పులి-బంగారు కంకణం కథ అందరికీ తెలిసిందే. కంకణానికి ఆశపడి పులి దగ్గరకు వెళ్లామో అంతే సంగతులు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని పోల్చి చూపేందుకు ఇంతకు మించిన కథ మరొకటి ఉండదనిపిస్తున్నది. అధికార దాహంతో ఉన్న కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు గుప్పించి, అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం చూసిన రైతులకు ఇంకా మరేదో ఇస్తానని మాయమాటలు చెప్పింది. రైతుబంధును రైతుభరోసాగా మార్చి రెండు వేలు ఎక్కువే ఇస్తానని నమ్మబలికింది. తీరా గెలిచిన తర్వాత అన్నివర్గాలకూ కుచ్చుటోపీ పెట్టినట్టుగానే అన్నదాతలనూ మోసం చేసింది. పెంచుడు మాటేమో గానీ ఉన్న పెట్టుబడి సాయం ఊడిపోతుందని ఓటు చేజార్చుకున్న తర్వాత తెలిసి వచ్చింది రైతన్నలకు. ఎదురుచూసి.. నీల్గి.. నీరసించిన తర్వాత ఇప్పుడు అసలు సంగతి బయటపెట్టింది. అప్పుడు ఇంతిస్తా, అంతిస్తా అని కోతలు కోసింది. ఇప్పుడు అనర్హుల పేరిట కొర్రీలతో కోతలు కోస్తున్నది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం నుంచి అరువు తెచ్చుకుని మరీ అర్హతలు ప్రకటిస్తున్నది. ఆ పథకం నిబంధనలను అసెంబ్లీ ముందుంచి మరీ విధేయత చాటుకున్నది.
రైతుబంధు స్థానంలో తెచ్చిన రైతుభరోసా వల్ల లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. కుటుంబంలో ఎంతమంది రైతులున్నా ఒక్కరికే సాయం ఇస్తారట. ఆదాయ పన్ను కట్టేవారు కుటుంబంలో ఒక్కరున్నా పంట పెట్టుబడి ఇవ్వరట. ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వ ఉద్యోగులు, లాయర్లు, డాక్టర్లు అంటూ చాంతాడంత జాబితా తయారు చేశారు. చివరికి కుటుంబంలో ఇంజినీర్లున్నా మొండిచెయ్యేనట. ఈ కొర్రీల జాబితా వెనకున్న ఉద్దేశం తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. వీలైనంత మందికి పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకు సర్కారు యోచిస్తు న్నట్టు కనిపిస్తున్నది. రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు 86 శాతం మేర చిన్న, సన్నకారు రైతులేనని అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ పెద్ద రైతులను తొలగిస్తున్నారనుకున్నా కోత 14 శాతం మించరాదు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు లబ్ధిదారులు సీజన్‌కు 70 లక్షల దాకా ఉండేవారు. తాజాగా ప్రభుత్వం విధిస్తున్న కోతల వల్ల వారి సంఖ్య 30 లక్షలకు పడిపోతుంది. అంటే సగానికి పైగా రైతులు ఎగిరిపోతారన్న మాట. సర్కారు మోసకారి లెక్కలతో 50 శాతానికి పైగా రైతులకు ఎగనామం పెడుతుండటం ఏ మాత్రం క్షంతవ్యం కాదు.
పంటపెట్టుబడి సాయం నేరుగా రైతులకు అందించే వినూత్న పథకం రైతుబంధుతో రాష్ట్రంలో వ్యవసాయం ముఖచిత్రమే మారిపోయింది. రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారింది. ఇది బీఆర్ఎస్ చెప్పుకొంటున్న సంగతి కాదు. స్వయంగా సర్కారే అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన వాస్తవం. మరి అదే సర్కారు సాయంలో కోతలు పెడుతూ రైతును, రాష్ర్టాన్ని ఏం చేయాలనుకుంటున్నది? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్కారు హఠాత్తుగా రైతుభరోసా మాట ఎత్తుకోవడం హాస్యాస్పదం. ఇచ్చినట్టు కాదు, ఇవ్వనట్టు కాదు అన్నట్టుగా అరకొరగా అమలు చేసి అయిందనిపించుకునే పనిలో సర్కారు ఉన్నదన్నది స్పష్టమే. కానీ, రైతులను పదే పదే మోసం చేయడం సాధ్యపడదనే వాస్తవాన్ని సర్కారు గుర్తిస్తే మంచిది.