వస్తదో, రాదోననుకున్న తెలంగాణ కోసం ఉద్యమించేందుకుగాను అమెరికాలోని మంచి ఉద్యోగానికి యువనేత కేటీఆర్ రాజీనామా చేశారు. అరువై ఏండ్ల కలను సాకారం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. అంతేకాదు, రాష్ట్ర పురోగమనంలో మంత్రిగా తన మార్క్ పాలనను చూపించారు. సుదీర్ఘ ఉద్యమం తర్వాత వచ్చిన రాష్ర్టాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయా రంగాల సమ్మిళితమై పురోభివృద్ధిలో ఆయన చేసిన అవిరళ కృషి అనిర్వచనీయం. ప్రపంచ పారిశ్రామిక యవనికపై తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కేటీఆర్ ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడప లేదు.
ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఫాక్స్‌కాన్ వంటి సంస్థలను తెలంగాణ వైపు ఆకర్షించడంలో కేటీఆర్ చేసిన శ్రమ అంతా ఇంతా కాదు. బెంగళూరును తలదన్నే రీతిలో హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులును 2023 నాటికి 3 లక్షల కోట్లకు పెంచారు. నూతనంగా దాదాపు 7 లక్షల మంది ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పొందగలిగారు. ఐటీ రంగాన్ని అగ్రశ్రేణి నగరాలకే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయశ్రేణి నగరాలకూ విస్తరించారు. మొత్తంగా ప్రపంచమే అబ్బురపడేలా తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని రూపొందించారనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక నేతన్నల బతుకులను మార్చేందుకుగాను ఆయన పడ్డ శ్రమ అనిర్వచనీయం. ఉమ్మడి పాలనలో నేతన్నల ఆత్మహత్యలు సర్వసాధారణం. అందులో సిరిసిల్ల అగ్రగామి. ‘ఉరి’ జిల్లాగా ఉన్న సిరిసిల్లను ‘సిరుల’ సిల్లగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ మార్చారు. అరువై ఏండ్ల పోరాటం తర్వాత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ వలస పాలకుల వకాల్తా పుచ్చుకునేవారు తయారవుతున్నారు. అస్తిత్వంపై ప్రజలను మభ్యపెట్టి దాడులు చేస్తున్నారు. ఆ కుట్రలను తెలంగాణ పార్టీగా ప్రతిఘటించడంలో బీఆర్ఎస్ను ఎల్లప్పుడూ కేటీఆర్ సంసిద్ధం చేయాలని ఆశిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
– పిన్నింటి విజయ్‌కుమార్, 90520 39109
ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు ఎన్నో విజయాలు సాధించారు. జనహితమే తన హితంగా ముందుకువెళ్తున్న ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఎన్నో ఆటుపోట్లను, మైలురాళ్లను అధిగమించారు.
ఈ ఆధునిక సమాజంలో సేవాభావమే ఏకైక లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు అరుదు. అందులో కేటీఆర్ ఒక్కరనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకేనేమో ఆయన నిరంతరం రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనే నిమగ్నమవుతారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఆపద్బాంధవుడు అవుతారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రైవేటు కార్యక్రమమైనా ఆయన మాటలు కత్తుల్లా పదునుగా మారుతుంటాయి. కేటీఆర్ నిరాడంబరంగా, ఎల్లప్పుడూ సాదాసీదా మనిషిలా కనిపిస్తుంటాడు. మాటల్లో సౌమ్యం, మనసు మనోహరం, ప్రజలు కష్టపడుతున్నారని తెలిస్తే చాలు మనవతా దృక్పథంతో తక్షణమే స్పందించే మనస్తత్వం కేటీఆర్ సొంతం.
ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా తన యాసభాషను మార్చుకుంటూ అటు అమెరికా ప్రజల నుంచి, ఇటు పల్లెటూరి ముసలవ్వల దాకా అందరికీ అర్థమయ్యేరీతిలో మాట్లాడటం కేటీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. గత తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఎన్నో అంతర్జాతీయ ఐటీ సంస్థలను తెలంగాణకు తీసుకురావడంలో కేటీఆర్ చేసిన కృషికి వరించిన అవార్డులే నిదర్శనం. తన వాగ్ధాటితో హేమాహేమీలైన రాజకీయ నాయకులను ఉక్కిరిబిక్కిరిచేస్తూ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఐటీ రంగానికే వన్నె తెచ్చిన మంత్రిగా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారు.
– గుండమల్ల సతీష్, 94931 55522
భారతదేశంలో కేటీఆర్ పేరు రోజురోజుకు మార్మోగిపోతున్నది. దీనంతటికి కారణం ప్రతీ విషయంపై ఆయన చేసిన కఠోరశ్రమనే కారణమని చెప్పవచ్చు. 1976 జూలై 24న కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు-శోభ దంపతులకు సిద్ధిపేట లో జన్మించిన ఆయన తెలంగాణ ప్రజలకు ప్రత్యేక మైన నాయకుడిగా ఎదిగారు. ప్రపంచ యవనికపై పలు వేదికల్లో కేటీఆర్ ప్రసంగిస్తున్న తీరు అద్వితీ యమని చెప్పడంలో సందేహం లేదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న కేటీఆర్‌ను పలు దేశాలు ప్రత్యేకంగా ఆహ్వానించాయి. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆయనను ఆహ్వానించింది.
అంతేకాదు, పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టానికి పెట్టుబడులు వరదలా వచ్చాయంటే అందుకు కేటీఆరే ప్రధాన కారణమని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నా మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతున్నారు. అక్రమ ఆరోపణలు, తప్పుడు కేసులు పెడుతున్నా ఎక్కడా వెరవకుండా ప్రజా హక్కులకై పరితపిస్తున్నారు. అధికారపక్షంపై బాణం ఎక్కుపెట్టి రాముడి వలె ధర్మయుద్ధం చేస్తున్నారు. రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ కీలకం కానున్నారనడంలో కించిత్ అనుమానం లేదు.
– మిద్దె సురేష్, 97012 09355