తెలంగాణ అన్నదాతల్లో కొండంత ధైర్యం నిండింది. కొట్లాడేందుకు సిద్ధమనే ఆత్మైస్థెర్యం వచ్చింది. నయవంచక కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేందుకు బీఆర్ఎస్ సంగ్రామ సభ నాంది పలికింది. రైతుల ఆవేదన, ఆగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన గొంతులో పలికించారు. కాంగ్రెస్‌పై రైతులంతా నాగలి మర్లేయాలని తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సాగు సంక్షోభంలో చిక్కుకొని అవస్థలు పడుతున్న అన్నదాతలకు కేటీఆర్ ఇచ్చిన సందేశం కొండంత అండగా నిలిచింది. ఆరు దశాబ్దాలపాటు అరిగోస పడ్డ తెలంగాణ రైతుల బతుకులు.. ప్రత్యేక రాష్ట్రంలో పచ్చబడగానే కాంగ్రెస్ కన్నుకుట్టింది… కర్షకుల బతుకు మన్నుముట్టింది.
ఎన్నికల ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన హస్తం పార్టీ నేతలు.. నమ్మించి గొంతుకోశారు.. నయవంచనకు గురిచేశారు. ఏరుదాటినంక తెప్ప తగులబెట్టే కాంగ్రెస్ చరిత్ర తెలంగాణలో పునరావృతమైంది. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటినంక బోడి మల్లన్నలు అయిపోయారు. అధికార అందలం ఎక్కిన తర్వాత అన్నదాతకు కాంగ్రెస్ గత పాలన తరహాలోనే మళ్లీ ఆనాటి రోజులు తీసుకొచ్చారు. ఎలాగైనా గెలువాలని అధికారదాహంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మోసపూరితమని బీఆర్ఎస్ చెప్పింది.
మోసపోతే గోసపడుతామని, కాంగ్రెస్ గెలుస్తే రైతుబంధు ఎగ్గొడుతారని నెత్తీనోరు కొట్టుకొని చెప్పింది. కాంగ్రెస్ మోసాన్ని ఆనాడే పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసింది. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ను నమ్మకూడదని హెచ్చరించింది. తెలంగాణ రైతులు చాలా మంది కాంగ్రెస్ మాటలను నమ్మలేదు. కానీ కొంతమంది బోర్లవడ్డరు.. కాంగ్రెస్ పాలనలో సాగు బొందలో పడ్డట్టయింది.
రెండున్నరేండ్లలోనే మూడు రంగుల జెండా పార్టీ అసలు రంగు బయటపడింది. రైతుబంధు ఆగమైంది.. రైతుబీమా అటకెక్కింది.. బోనస్ బోగస్ అయింది. సాగు సంక్షోభంలో చిక్కుకున్నది.. దీంతో ఓపిక నశించి.. రైతులు రోడ్డెక్కుతున్నారు.. సర్కార్‌పై నాగలి మర్లేసి నిప్పులు చెరుగుతున్నారు. దగాపడ్డ రైతన్న తరఫున దండు కట్టేందుకు, సంగ్రామం సాగించేందుకు బీఆర్ఎస్ నడుం బిగించింది. పోరుగల్లు ఓరుగల్లు నుంచి సమరశంఖం పూరించింది.
కాళేశ్వరం, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోలుతో వ్యవసాయ స్థిరీకరణతో రైతుల జీవితాల్లో బీఆర్ఎస్ పాలన ఆనందం నింపింది. కండ్ల ముందే అద్భుతం జరుగుతున్నట్టుగా ప్రాజెక్టులు చకచకా పూర్తయ్యాయి. ఎన్నడూ పారని కాలువలు ఏరులై పారి.. పొలం బాట పట్టాయి. ఏడాదికి రెండు పంటలతో, పుష్కలమైన నీటితో, భూముల విలువలు పెరిగి, రైతులు తమ జీవితకాలంలో చూస్తామో లేదో అన్నంత ఆనందాన్ని ఆస్వాదించారు. ఇంతలో రైతులపై పిడుగుపడింది. అది 2022 మే 6… తెలంగాణ రైతులను నట్టేట ముంచేందుకు కాంగ్రెస్ ముహూర్తం పెట్టిన రోజు.
వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట మోసం చేసిన రోజు. నాలుగేండ్ల క్రితం తెలంగాణ రైతన్నను మోసం చేసేందుకు కాంగ్రెస్ శాసనం రాసిన రోజు. అధికారంలోకి వస్తే రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని, వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, మిరప, పసుపు, కూరగాయల రైతులకు ప్రత్యేక సాయం అందిస్తామని నమ్మబలికింది. కాంగ్రెస్ కొత్తగా ఏమీ ఇవ్వకపోగా, బీఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి కూడా ఎగ్గొట్టింది. ఈ నేపథ్యంలో కడుపుమండిన, గుండెలు రగిలిన రైతుల ఆగ్రహావేశాలకు బుధవారం వరంగల్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ రైతు సంగ్రామ సభ వేదికైంది.
కడుపు మండిన రైతులు ప్రస్తుత పాలక పెద్దలకు వారి భాషలోనే సమాధానం చెప్తున్నారు. వరంగల్ రైతు సంగ్రామ సభలో అన్నదాతలు గర్జించారు. కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుదామని ప్రతినబూనారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పక్షాన గళమెత్తారు. కాళ్లు పట్టుకోవడం కాదు, కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి అంటూ కేటీఆర్ నినదించినప్పుడు కర్షకుల్లో సమరోత్సాహం వెల్లివిరిసింది. దండం పెట్టొద్దు, కాంగ్రెస్‌కు పిండం పెట్టండి, మక్కలు కొనకపోతే కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేయండి అంటూ రైతుల ఆవేదన, ఆగ్రహాన్ని కేటీఆర్ తన గొంతుల పలికించారు.
రైతు కన్నీళ్లలో రాబందు పాలకులు కొట్టుకుపోవటం ఖాయమని బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి, నట్టేట ముంచిన కాంగ్రెస్ వైఖరిని కర్షకలోకం ఎండగట్టింది. రైతు ద్రోహి కాంగ్రెస్ సర్కార్‌పై మొదలైన రైతుల తిరుగుబాటుకు సమరశంఖం పూరించారు. రానున్న రోజుల్లో జరిగే ప్రజాస్వామిక పోరాటంలో కాంగ్రెస్‌కు రైతులు తగిన గుణపాఠం చెప్పేందుకు, ధైర్యం కోల్పోకుండా కొట్లాడేందుకు నిన్నటి సంగ్రామ సభ దోహదపడనున్నది.