గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి పాలనలో పాడియావులా వాడుకున్నారే తప్ప, అభివృద్ధిని పట్టించుకోలేదు. పైపై మెరుగులు దిద్ది ఏదో సాధించినట్టు డప్పు కొట్టుకున్నారు. కానీ, తెలంగాణ సాధకుడు, ప్రగతిరథ చోదకుడు అయిన ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ మహానగరాన్ని మహోన్నతంగా నిలబెట్టేందుకు సకల శక్తులు ఒడ్డి కృషి చేశారు. రాష్ట్రం నిలవాలంటే నగరం బాగుపడాలి. అందుకు పౌరవసతులు సమకూరడం, శాంతిభద్రతలు నెలకొనడం తప్పనిసరి. అప్పుడే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. అటు గ్రామాల్లో వ్యవసాయాభివృద్ధికి సకల సౌకర్యాలు కల్పించినట్టుగానే, ఇటు నగరంలో బహుముఖ వ్యూహాన్ని అమలు చేశారు. ముందుగా నగర దాహార్తి తీర్చారు. కనురెప్పపాటు కూడా ఆగకుండా నిరంతరం నాణ్యమైన కరెంటు సరఫరా చేశారు. పోలీసు వ్యవస్థ సమూల సంస్కరణలతో మిత్రపోలీసు నగరాన్ని ఆవిష్కరించారు. బస్తీలను నిరంతర పోలీసు గస్తీతో అనుసంధానం చేశారు. నేరాల అదుపునకు నగరమంతటా నిఘా నేత్రాలు ఏర్పాటుచేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించి నిరంతర అప్రమత్తతతో నగరంలో శాంతిభద్రతలను సువ్యవస్థితం చేశారు. ముఖ్యంగా ఆడబిడ్డల భద్రత కోసం హాక్ ఐ, షీటీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి తోబుట్టువులా అండగా నిలిచారు. వీటన్నిటి ఫలితంగా నగరం పరిశ్రమల గమ్యస్థానంగా మారిం ది. దేశవిదేశాల నుంచి పెట్టుబడులు తరలిరావడం మొదలైంది. టీఎస్-ఐపాస్ వం టి సత్వర అనుమతి విధానాలతో సులభ వాణిజ్య సౌకర్యం కల్పించారు. స్టార్టప్‌ల కోసం ఇంక్యుబేటర్లు పెట్టారు. దేశ నలుమూలల నుంచి శ్రామికులు పెద్ద సంఖ్యలో ఉపాధి కోసం హైదరాబాద్ రావడం మొదలైంది. అత్యంత నివాసయోగ్యమైన నగరంగా అవార్డులు, రివార్డులు అందుకున్నది. వివక్షారహిత వాతావరణంలో అందరూ హాయిగా జీవించే గంగాజమునా తెహజీబ్‌ను సమున్నతంగా నిలబెట్టింది బీఆర్ఎస్ పాలన.
కల్లబొల్లి కబుర్ల కాంగ్రెస్ పాలనలో నగరం తీరుతెన్నులే మారిపోయాయి. చేతకాని, చేవలేని సర్కారు పెద్దలు పాలనను గాలికొదిలేశారు. దీంతో సమస్యల వలయంలో చిక్కుకుని నగరం నరకంలా తయారైంది. నిఘావ్యవస్థ నిద్రలోకి జారుకోవడంతో నేరం వీరంగం వేస్తున్నది. రక్షణ కరవై గుండెలు అరచేతుల్లో పెట్టుకుని బితుకుబితుకుమంటూ గడుపుతున్నారు భాగ్యనగర పౌరులు. సర్కారు అలసత్వం నేరాలను ఎగదోస్తున్నది. అనుదినం దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పుల మోతలతో దద్దరిల్లుతున్నది రాజధాని. పట్టపగలే ఇండ్లలోకి జొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులకు తెగబడుతున్నారు. ఒంటరిగా ఇంట్లో ఉన్న పదేండ్ల చిన్నారిని కిరాతకంగా చంపిన ఘటన నగర పౌరులను నిర్ఘాంతపరిచింది. తుపాకులతో బెదరించి భారీగా సొమ్ము దోచుకునే ఘటనలు జరుగుతున్నాయి. నగల షాపుల్లోకి జొరబడి యథేచ్ఛగా దోపడీలకు పాల్పడుతున్నారు. అస్తవ్యస్త ట్రాఫిక్ నిర్వహణతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయే దుస్థితి. చినుకుపడితే రోడ్లు తటాకాలై జనం ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ కింద 47 ఫ్లైఓవర్, అండర్‌పాస్ ప్రాజెక్టులు చేపట్టి, అందులో 36కు పైగా పూర్తిచేసింది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకే రిబ్బన్ కట్టింగ్లు చేసి సంబుర పడుతున్నారు. కరెంటు కోతలు షరామామూలుగా జరిగిపోతున్నాయి. కరెంటు తీగలు కాలనాగుల్లా కాటువేస్తున్నాయి. ప్రభుత్వానికి ‘చెత్తశుద్ధి’ లోపించడంతో వీధులు మురికికూపాలవుతున్నాయి. రోగాలు విజృంభిస్తున్నాయి. ‘ఎట్లుండే పట్నం లష్కర్.. ఎట్లయిపాయే’ అని ప్రజలు నిస్సహాయంగా నిట్టూరుస్తున్నారు.
చేయని నేరానికి నగర ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. నగరం నలువైపులా సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం హైడ్రా పేరిట అనవసర హంగామా చేస్తున్నది. పేదలను రోడ్డున పడేస్తూ మూసీ సుందరీకరణ పేరిట తలాతోకా లేని పథకాలు తలకెత్తుకుంటున్నది. మినీ భారత్ లాంటి మహానగరంలో అవాంఛనీయ, విచ్ఛిన్నకర ధోరణులు పొడసూపుతుంటే సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నది. కట్టుకథలతో కాలక్షేపం, విదేశీ పర్యటనల పేరిట హంగామా తప్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేరుకు ఒక్క కొత్త పరిశ్రమ కూడా నగరానికి రాలేదు. హైదరాబాద్‌లో ఈవీ ప్లాంటు పెడతానని ముందుకువచ్చిన బీవైడీ కంపెనీ ముఖం చాటేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో భూమి కూడా కేటాయించిన కేన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ ‘బడేభాయ్’ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలిపోయింది. ఇదేతీరుగా ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థను పొరుగు రాష్ర్టానికి రేవంత్ గురుదక్షిణగా సమర్పించారు. మరో సెమీ కండక్టర్ల కంపెనీ ఫాక్స్‌కాన్ యూపీకి మకాం మార్చింది. యాపిల్ ఫోన్ల గెరిల్లా గ్లాస్ తయారీదారు కార్నింగ్ సంస్థ వెయ్యికోట్ల పెట్టుబడులు తమిళనాడుకు వెళ్లిపోయాయి. ఇవి కేవలం పెట్టుబడుల నష్టాలే కావు, వీటిని వెన్నంటే ఉద్యోగాల నష్టమూ ఉంటుందనేది తెలిసిందే. అశాంతి, అసౌకర్యాలకు నెలవుగా మారిన నగరానికి పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. ఇదీ కాంగ్రెస్ సర్కారు నగరంలో సాధించిన బృహత్తరమైన ‘మార్పు’.