మొన్న తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన కెరటం.. నిన్న అధికారంలో తెలంగాణను సమున్నత శిఖరాలకు చేర్చిన సంకల్పం.. నేడు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకను బలంగా వినిపిస్తున్నది. హోదా ఏదైనా.. పరిస్థితి ఎలాంటిదైనా.. అందులో ఒదిగిపోయి ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పరితపించే సమర్థ నాయకత్వానికి నిలువెత్తు ప్రతీకగా కల్వకుంట్ల తారకరామారావు నిలుస్తున్నారు. నాడు తెలంగాణ సాధన కోసం గర్జించిన గళం.. నేడు తెలంగాణ ప్రజల హక్కుల కోసం మరోసారి నినదిస్తున్న ది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను అడుగడుగునా నిలదీస్తున్నది.
నాడు స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన మహోద్యమంలో అడుగడుగునా గులాబీ సైనికులతో కలిసి కదంతొక్కారు కేటీఆర్. సమైక్య రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకుల అన్యాయాలను ఎక్కడికక్కడ ఎండగట్టారు. కేటీఆర్ పాల్గొన్న నిరసనలకు లెక్కలేదు.. సమైక్య పాలకులు ఆయనపై పెట్టిన ఉద్యమ కేసులకు కొదవేలేదు.. ఇక అక్రమ అరెస్టులకైతే అంతే లేదు. ప్రజాక్షేత్రాన్నే ప్రధాన వేదికగా చేసుకుని కేటీఆర్ నిత్యం వినిపించిన రణన్నినాదం ఇప్పటికీ తెలంగాణ చరిత్ర పుటల్లో మార్మోగుతూనే ఉన్న ది. ధర్నాలు, రాస్తారోకోలే కాదు, జాతీయ చానళ్లలో జరిగిన చర్చల్లో కూడా తెలంగాణ గోసను వినిపించి, ఢిల్లీ పెద్దలను మెప్పించి, ఒప్పించేలా సాగిన వాదనలు నేటికీ హస్తిన మీడియా సర్కిళ్లలో చర్చనీయాంశాలే.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సందర్భంగా ఆవిష్కృతమైన కేటీఆర్ అరెస్టు దృశ్యాలు.. ప్రతిఒక్కరికీ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేశాయి. ఓవైపు ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకొంటూ.. మరోవైపు మాజీ మంత్రులు, సీనియర్ శాసనసభ్యులైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను సీఎం, డిప్యూటీ సీఎం అవమానించేలా మాట్లాడిన తీరు మహిళా లోకాన్నే కాదు, తెలంగాణలోని ప్రతీఒక్కరి గుండెను గాయపరిచింది. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పేవరకు విడిచిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సారథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని సీఎం చాంబర్ ముందే బైఠాయించడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక చేసేది లేక మార్షల్స్‌ను రంగంలోకి దింపి అక్కడినుంచి కేటీఆర్ సహా ఇతర ఎమ్మెల్యేలను బలవంతంగా ఎత్తుకెళ్లి పోలీసు వ్యానుల్లో పడేసింది. మార్షల్స్ చుట్టుముట్టినా కేటీఆర్ పిడికిలెత్తి ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు మాత్రం ఆపలేదు. సమైక్యరాష్ట్రంలో దర్శనమిచ్చిన ఇలాంటి దృశ్యాలు చూసి దశాబ్దం దాటిపోయింది.
పదేండ్లు ప్రశాంతంగా సాగిన తెలంగాణ అసెంబ్లీ.. ఈ సారి బడ్జెట్ సెషన్లో మాత్రం అట్టుడికింది. సమైక్యరాష్ట్రంలో నిరసనలకు కేంద్ర బిందువుగా నిలిచిన గన్‌పార్క్ మరోసారి ఆందోళనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇందుకు ఆజ్యం పోసిన మరో కీలకాంశం జాబ్ క్యాలెండర్. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊరించి.. చివరికి ఉద్యోగాల ఊసు లేకుండా కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన జాబ్ లెస్ క్యాలెండర్ యువత కోపాగ్నికి కారణమైంది. నిరుద్యోగులను నిలువునా దగా చేసిన కాంగ్రెస్‌పై అసెంబ్లీలోనే కాకుండా గన్‌పార్క్ వేదికగా యువత పక్షాన కేటీఆర్ జంగ్ సైరన్ మోగించారు.
ఓవైపు ఈసారి బడ్జెట్లో కాంగ్రెస్ వేసిన తప్పటడుగులను లెక్కలతో సహా ఎండగడుతూ కేటీఆర్ సంధించిన ప్రశ్నలు అధికార పక్షం తలలు పట్టుకునేలా చేశాయి. మరోవైపు అసెంబ్లీ లోపల, బయటా ఆయన సారథ్యంలో హోరెత్తిన నిరసనలు అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించాయి.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ పోరాటం నుంచి.. నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్ సర్కారు నిర్వాకాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందు ఎండగట్టే వరకు.. ప్రతి అధ్యాయంలో అడుగడుగునా నాటి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు కేటీఆర్. పదేండ్ల క్రితం వరకు సమైక్యరాష్ట్రంలో అనుసరించిన పోరాట పంథానే గుండెల నిండా నింపుకొని కాంగ్రెస్ పాలకపక్షాన్ని గడగడలాడించారు. ఉద్యమాలే ఊపిరిగా పురుడుపోసుకున్న ఈ రాజకీయ చాణక్యుడి అలుపెరగని పోరాటం ప్రభుత్వాన్ని పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది. వ్యక్తిగత దూషణలే పతాక శీర్షికలుగా మారుతున్న ఈ రోజుల్లో.. వాటికి ఏ మాత్రం తావులేకుండా, ఎవరెంత రెచ్చగొట్టినా సబ్జెక్ట్ నుంచి ఏ మాత్రం డీవియేట్ కాకుండా లెక్కలతో సహా నిలదీయడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. కేటీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు, సంధించిన వాగ్బాణాలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపి చివరికి నాలుక కర్చుకున్నది.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ పదేండ్ల ప్రగతి ప్రస్థానంలోనూ చెరగని ముద్రవేశారు కేటీఆర్. తెలంగాణ సాధనతోనే లక్ష్యం నెరవేరలేదని స్పష్టం చేస్తూ.. కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమించారు. అన్నింటికన్నా ముఖ్యంగా హైదరాబాద్‌ను యువతకు ఉపాధి అవకాశాల గనిగానే కాదు, యావత్ దేశం ఖజానా నింపే అక్షయపాత్రగా తీర్చిదిద్దారు. ఉద్యమ స్ఫూర్తితో పనిచేయడం వల్లే అనతికాలంలోనే అద్భుత ఫలితాలు సాధించి విశ్వవేదికలపై శభాష్ అనిపించుకున్నారు.
(తెలంగాణ దళిత బహుజన చైతన్య వేదిక)
– టి.విఠల్