దిగులు.. తరాలను తరిమిన దిగులును జయించిన గాయాల హృదయాలన్నీ గుమిగూడి సామూహిక గెలుపు గేయాన్ని ఆలపించడం ఎంత చారిత్రక సన్నివేశం? ఓడి.. ఓడి.. పడి.. పడి.. సకల శక్తులతో తలపడి చివరికి నిలబడ్డ వారంతా ఏకమై మన తెలంగాణను గానం చేయడమెంత అద్వితీయం? ప్రియమైన డాలస్.. లవ్ యూ. నీవెంత చారిత్రక సన్నివేశానికి వేదికగా మారావో తెలుసా? మొన్న నీ వేదిక మీద జరిగిన గులాబీ జెండా రజతోత్సవం, సంబురం మాత్రమే కాదన్నది నీకు అర్థమైపోయుంటుంది. ఏటా జరిగే గాలివాటపు గెట్ టు గెదర్ గోల కూడా కానేకాదని స్పష్టంగా తేటతెల్లమైపోయుంటుంది.
నీకు స్పార్టకస్ కథ, మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ చరిత్ర తెలుసు కదా? తరాలకు తరాల పాటు మా తెలంగాణది కూడా స్పార్టకస్ బతుకే. ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ అని మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ అమెరికా చరిత్రను కొత్త కలల నదిలోకి దింపినట్టు.. మా తెలంగాణ చరిత్రను కూడా కేసీఆర్ వెలుగుల నదిలోకి నడిపించారు. అందుకే కేసీఆర్ అందించిన జెండాను ఖండాలన్నింట్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు ఎత్తిపడుతున్నారు.
వివక్ష ఒడిలో కొలువైన కొలువులను అందుకోలేక, పక్షపాత రోగగ్రస్త ప్రభుత్వాలతో చేతులు కలపలేక, పోరు దారిలో దశాబ్దాలను కోల్పోయింది తెలంగాణ సమాజం. సొంత నేలపైనే పరాయి పాలకులు ఆశ్రిత మానవ సమూహంగా మార్చేస్తుంటే, మానవాగ్నిగా మారి నలుచెరుగులా తెలంగాణ అగ్నిపర్వతాలుగా మారిపోయింది. కాలం పొడవునా అవమానాలను, ఆవేదనను దిగమింగింది. అంతెందుకు ఊరు కాని ఊరు, దేశం కాని దేశమొచ్చినా తానా, ఆటాల్లో కూడా తెలంగాణ వారసత్వం దిగాలుగా నిలబడాల్సిన దుస్థితి. ఈ మొత్తం వేదనా సముద్రంలో నుంచి తెలంగాణను ఒడ్డుకు చేర్చడమే కాదు, ఎన్నో విజయశిఖరాలను అధిరోహించేలా చేసిన రాజకీయ శక్తి బీఆర్ఎస్ పార్టీ. అందువల్లనే దేశం వెలుపల ఏ భారతదేశ రాజకీయ పార్టీకి సాధ్యపడని, సాకారమవ్వని మానవీయ మహా మేళాలాగా డాలస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవం జరిగింది.
నిజానికి టీడీపీ లాంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు, బీజేపీ వంటి జాతీయ పార్టీల పునాది వర్గాలు, వారి తర్వాతి తరాలు దశాబ్దాల క్రితమే విదేశాల్లోని వివిధ రంగాల్లో విస్తరించాయి. ఆయా పార్టీలకు ఆవిర్భావంలోనే విదేశాల్లో శక్తుల సంఘీభావం, వివిధ రకాల మద్దతు సులభంగా సమకూరింది. కానీ, బీఆర్ఎస్ పార్టీది చాలా విభిన్నమైన పరిస్థితి.
నిర్బంధం పడగలో విశ్వాసం కోల్పోయిన సమాజాన్ని సమీకృతం చేసి, విముక్తి కోసం ఏకతాటిపైకి నడిపించడానికి తెలంగాణలోనే అనేక తిప్పలు పడాల్సివచ్చింది. ఇక విదేశాల్లో, అందునా అమెరికాలో తెలంగాణ బిడ్డలు ఏకం కావడానికి ఎన్ని అవాంతరాలో కదా? అయినా ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో, దేశం ఆవల, అవకాశాల చుట్టూ వేయబడ్డ వివక్ష కంచెను దాటడానికి ఎన్నో కష్టాలు పడ్డ తెలంగాణ బిడ్డలు.. అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా అడుగడుగునా తెలంగాణ ఉద్యమ విజయాన్ని ఆకాక్షించారు.
రాష్ట్రం సాకారమయ్యాక కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ, సాగునీటి, పారిశ్రామిక, ఐటీ, సేవల రంగాల్లో స్వల్ప కాలంలోనే సాధించిన ప్రగతిని గర్వంగా విజయగాథలుగా విదేశీ మిత్రులతో పంచుకున్నారు. పరాయి దేశంలో సొంత గడ్డ బాధలు వల్లెవేసిన నోటితోనే దాని అద్భుత విజయాలు వివరించే అవకాశం కలగడం ఎంత ఆత్మగౌరవాన్ని సమకూరుస్తుందో వర్ణించలేం. ఆ ఆత్మగౌరవ ఆకాశమే కేటీఆర్‌పై డాలస్‌లో అంతటి అభిమానమై వర్షించింది.
కేటీఆర్‌కు అమెరికా ఏమీ కొత్త కాదు. కెరీర్ తొలి దశలోనే సుదీర్ఘ కాలం అగ్రరాజ్యంలో అవకాశాల మధ్యలో ఆయన మెలిగారు. కానీ, ఈసారి అమెరికాలోని తెలంగాణ కుటుంబాలకు మానవీయ అనుభూతిని కేటీఆర్ ఇచ్చి రాగలిగారు. వేలాది ఎన్నారై కుటుంబాలతో ఆత్మీయబంధాన్ని బీఆర్ఎస్కు నిర్మించగలిగారు. ఉద్యమం తర్వాత పాలనా అనుభవం, మళ్లీ ఏడాదిన్నరగా తెలంగాణ పరిరక్షణ కోసం పెనుగులాటలో అర్థమైన జీవితాన్ని మనసారా మన వాళ్లతో పంచుకొని, వారందరి గుండెల్లో తెలంగాణ మమకారాన్ని సుస్థిరపరచగలిగారు. అసలది రాజకీయ పార్టీ రజతోత్సవంలా కాక, విదేశాల్లోని తెలంగాణ కుటుంబాల ఐక్యతాసభగా నడిచింది.
కేటీఆర్ వారందరికీ అంతలా ఎందుకు కనెక్ట్ అయ్యారు? నాయకుడికి మించి ఆత్మీయుడిగా ఎలా మారగలిగారు? అనే సందేహాలకు తెలంగాణలోనే సమాధానం ఉంది కదా! కేసీఆర్ నాయకత్వంలో ఐటీ, పరిశ్రమల మంత్రిగా తొమ్మిదేండ్లలోనే రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 18 వేల పరిశ్రమలు, 16 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించిన కేటీఆర్ పాలనా సామర్థ్యం విదేశాల్లో ఉన్న తెలంగాణ నిపుణులకు చాలా స్పష్టంగా తెలుసు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పడ్డ 334 చిన్న తరహా పరిశ్రమలకు తిరిగి ఊపిరిపోయడమే కాదు, మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్ మిల్లు, కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీలను మళ్లీ తెరిపించిన కేసీఆర్ పాలనా చరిత్ర, కేటీఆర్ నాయకత్వ తీరు ప్రపంచ దేశాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న తెలంగాణవారందరినీ సహజంగానే ఆకర్షించకుండా ఉంటాయా! అందుకే కేటీఆర్ ప్రవాస తెలంగాణ సమాజానికి ప్రియమైన సోదరుడిగా మారారు.
నేపథ్యమే కాదు, కేటీఆర్ ప్రసంగం కూడా రాజకీయ ఉపన్యాస శైలికి పూర్తి భిన్నంగా సాగి అందరి మనసులు గెలుచుకున్నది. వర్తమానంలో తెలంగాణ నైపుణ్యం సృష్టిస్తున్న వనరులు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు ఇలా ఎన్నో కీలకమైన అంశాలను లోతుగా విశ్లేషిస్తూ, హృదయాంతరాల్లోంచి వారందరి అందమైన జీవితాన్ని ఆకాంక్షిస్తూ సాగిన కేటీఆర్ ప్రసంగం దేశదేశాల్లోని తెలంగాణవాసుల హృదయాలను సైతం గెలుచుకున్నది. మొత్తంగా డాలస్ సభ సంబురాన్నే కాదు.. దేశ, విదేశాల్లోని తెలంగాణ సమాజానికి సత్సంకల్పాన్ని కల్పించింది. అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ జరిగిన తర్వాత ఆలోచిస్తే నిజానికి ఎక్కడి నుంచి ఎక్కడిదాకా నడిచొచ్చింది తెలంగాణ? ‘కదం తొక్కుతూ.. పదం పాడుతూ.. హృదయాంతరాళం గర్జిస్తూ’ అన్నట్టుగా గులాబీ జెండా ప్రస్థానం, తెలంగాణ ప్రయాణం ఎంత చారిత్రాత్మకమైనదో కదా! సంకెళ్లు తెంపుకోవడం కొత్తేమీ కాదు.. తెలంగాణమా వర్ధిల్లు.
-రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్