జలాశయాల ఆక్రమణలు, మూసీ ప్రాజెక్టు విషయాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ల వ్యవహారశైలి అరాచకంగా ఉంది. ఆ విషయం సోమవారం నాటి హైకోర్టు విచారణలో మళ్లీ స్పష్టమైంది. అరాచకం అనేది నిజానికి పెద్దమాట. అయితే అందుకు తగిన నిర్వచనం, అర్థం ఉన్నాయి. రాచరికం అంటే ఒక రాజ్యం, దాని వ్యవస్థ. ఆ వ్యవస్థకు తాను స్వయంగా ఏర్పరచుకునే విధానాలు, వాటి అమలుకు తగిన పద్ధతులుంటాయి. అటువంటి విధానాలు, పద్ధతులు లేకపోయినా, ఉన్నప్పటికీ వాటిని అనుసరించకపోయినా, లేదా అందుకు భిన్నంగానో, విరుద్ధంగానో వ్యవహరించినా దానిని అరాచకం అంటారు. జలాశయాల ఆక్రమణలు, మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి, హైడ్రా కమిషనర్లు వ్యవహరిస్తున్న తీరు అక్షరాలా అరాచకంగానే ఉంది.
HYDRAA | మొన్న శనివారం నాడు రంగనాథ్‌తో పాటు, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఎండీ దానకిశోర్ కొన్ని గంటల పాటు జరిపిన మీడియా సమావేశంతోనూ ఆ స్థితి తొలగిపోలేదు. అక్కడ వారు చెప్పినవి అరకొరగా, ప్రస్తుతం తలెత్తిన ప్రశ్నలకు సంబంధించి అసంపూర్తిగా, పరస్పర విరుద్ధంగా, బాధితులకు మసిబూసి మారేడు కాయ చేసేవిగా ఉన్నాయనేవి ఒకటి. అంతకన్న ముఖ్యంగా, ఈ పాటి పని అయినా అసలు హైడ్రా అమలుకు ముందే ప్రజలకు ప్రజాస్వామికంగా, పారదర్శకంగా వివరించే పని చేయటానికి బదులు, ఇప్పుడు బాధితుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు, రోదనలు వేదనలు మొదలైన తర్వాత గాని మొదలుకానిది ఎందువల్ల అనేది మరొకటి. ఆ పని చేయని ప్రభుత్వం వారు, ఉన్నతాధికారులు ఇప్పుడు ప్రజల నిరసనలు తీవ్రమవుతుండటంతో, బీఆర్ఎస్ తదితర ప్రతిపక్షాలు రంగంలోకి రావటంతో జంకిపోయి వివరణల పేరిట తిరిగి వంచనలకు పాల్పడుతున్నారు. ఇట్లా ఈ వ్యవహారం మొత్తం అరాచకంగా ఉందనటానికి గల కారణాలు ఏమిటో ముందుగా చూసి, తక్కిన చర్చలోకి తర్వాత వెళదాము.
హైడ్రాను ముఖ్యమంత్రి గత జూలైలో ప్రకటించారు. అప్పటినుంచి రెండు నెలలకు పైగా గడిచాయి. జలాశయాలకు సంబంధించి అయిదు రకాల ఉల్లంఘనలు ఉన్నాయన్నారు ఆయన. ఒకటి, చెరువులు, సరస్సుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు, రెండు, వాటి బఫర్‌జోన్‌లో నిర్మాణాలు, మూడు నాలాలు, పార్కులను ఆక్రమించి నిర్మాణాలు, నాలుగు, ప్రైవేట్ పట్టాలుండి అనుమతి లేకుండా చేసిన నిర్మాణాలు, అయిదు, ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా చేసిన నిర్మాణాలు. వీటిలో ముందుగా మొదటి మూడింటిపై పూర్తి దృష్టి పెడతామని ప్రకటించారు.
ఈ ఆక్రమణల వల్ల నీటి ప్రవాహం లేకపోవటం, మురుగు, వరదల కారణంగా ఇప్పటికే చాలా సమస్యలు వచ్చాయని, వాతావరణం దెబ్బతినటం వాటిలో ఒకటని, అది భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే పైన పేర్కొన్న అయిదు చర్యలు అవసరమని అన్నారు. మూసీకి సంబంధించి మూసీ సుందరీకరణ పథకాన్ని లక్షన్నర కోట్ల రూపాయలతో అతి భారీ స్థాయిలో ప్రకటించారు. ఇందుకు రూ.50 వేల కోట్లు అని మొదట చెప్పి అంతలోనే మూడు రెట్లు ఎందుకు పెంచారనే ప్రశ్న ఉంది గాని, దానిని పక్కన ఉంచుదాము.
యథాతథంగా ఈ లక్ష్యాలు మంచివి కావని ఇంతవరకు ప్రతిపక్షాలతో సహా ఎవరూ అనలేదు. అంతేకాదు, బాధిత ప్రజలలోనూ అనేకులు మూసీ శుద్ధి మంచి పనేనని, అందుకు తాము సహకరించటంతో పాటు విరాళాలు ఇవ్వగలమని కూడా స్వయంగా అంటుండటం గమనించదగిన విషయం. మరి సమస్య ఎక్కడ వస్తున్నది? ఇది రాచకంగా సాగటానికి బదులు అరాచకంగా మారింది ఏ విధంగా? సూటిగా చెప్పాలంటే ఇందులో మొదటి దోషి రేవంత్‌రెడ్డి. తర్వాత దోషులు రంగనాథ్, దాన కిశోర్‌లు. ప్రభుత్వం ఏదైనా చేయదలచుకుంటే ఆ విషయాలను రాజుల కాలంలో కూడా ముందుగా ఊరూరా చాటింపులతో చెప్పేవారు. ఇప్పుడు మనం ఆధునిక ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. మనకొక రాజ్యాంగం, చట్టాలు, వాటి అమలు తీరుపై విచారణకు న్యాయస్థానాలున్నాయి. భారతదేశం సంక్షేమ వ్యవస్థ అని, సామాన్యులకు, పేదలకు అనుకూలమని ప్రకటించుకున్నాం. మరొకవైపు ప్రజలకు తమ హక్కుల పట్ల చైతన్యం ఇప్పటికే చాలా పెరిగింది. అయినా ఇటువంటి అరాచకమంటే దుస్సాహసమే.
ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, తర్వాత రంగనాథ్, దాన కిశోర్‌లు అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులుగా చేయవలసిందేమిటి? ఈ లక్ష్యాలు చాలా ముఖ్యమైనవి. వాటి అమలు వల్ల కలిగే ఫలితాలను అట్లుంచి, అమలు క్రమంలో ప్రజల జీవితాలపై, కుటుంబాలపై నివాసాలపై, పరిసరాలపై, ఆర్థిక పరిస్థితులపై, వ్యాపార కార్యకలాపాలపై, చదువులూ, ఉద్యోగాలపై, సామాజిక సంబంధాలపై, కుటుంబ సంబంధాలపై, నిర్వాసితుల పునరావాసాలపై పడే ప్రభావాలు అనేక విధాలుగా ఉంటాయి. అంతేకాదు, ఒక నిర్మాణానికి రెడ్ మార్క్ వేయదలచినప్పుడు అందుకు సంబంధించిన అధికారిక అనుమతుల పూర్వాపరాలపై పలు ప్రశ్నలు తలెత్తుతాయి. నిర్వాసితులకు నష్టపరిహారాలు, పునరావాస ప్రశ్నలు బృహత్తర రూపంలో ముందుకొస్తాయి. మరోవైపు న్యాయపరమైన అంశాలపై కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఇవి పై ముగ్గురికి తెలియనివి కావు. ఊహించలేనివి కావు. అటువంటప్పుడు ఏమి చేయాలి? అసలు జూలైలో హైడ్రాను ప్రకటించటానికి ముందే ఈ విషయాలన్నింటిపై మేధోమథనం జరిపి, పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి విధి విధానాలను, సమాధానాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. అది బాధ్యత గల పద్ధతి. తర్వాత వాటిని ప్రజాస్వామికంగా, పారదర్శకంగా ప్రజల ముందుంచి వారి అభిప్రాయాలను, సూచనలను తీసుకోవాలి. సందేహాలు తీర్చాలి. అవసరమైన సవరణలు చేసుకోవాలి. అప్పుడు, ఇంత మంచి ఆలోచనకు మీ సహకారం అవసరమని కోరాలి. స్థిర నివాసాలు గల ప్రజలే గాక చిన్న షెడ్లు వేసుకొని నివసించే, పనులు చేసుకునే పేదలను కూడా పరిరక్షించాలి.
ఇది రాచకంగా సాగటానికి బదులు అరాచకంగా మారింది ఏ విధంగా? సూటిగా చెప్పాలంటే ఇందులో మొదటి దోషి రేవంత్‌రెడ్డి. తర్వాత దోషులు రంగనాథ్, దాన కిశోర్‌లు. ప్రభుత్వం ఏదైనా చేయదలచుకుంటే ఆ విషయాలను రాజుల కాలంలో కూడా ముందుగా ఊరూరా చాటింపులతో చెప్పేవారు. ఇప్పుడు మనం ఆధునిక ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. మనకొక రాజ్యాంగం, చట్టాలు, వాటి అమలు తీరుపై విచారణకు న్యాయస్థానాలున్నాయి.
అట్లా చేసి ఉంటే ఇపుడీ రకరకాల సమస్యలు వచ్చి ఉండేవి కావు. ఆ పనిచేసి ఉంటే అది రాచరికం అయేది. చేయలేదు గనుక అరాచకంగా మారింది. ఇందులో రంగనాథ్ గురించి విశేషంగా చెప్పుకోవాలి. ఆయన తీరును హాలీవుడ్ కౌబాయ్లతో పోల్చుతూ ఆ పదం మాత్రం వాడకుండా ఇప్పటికి రెండు సార్లు రాశాను నేను. ఇప్పుడు మరొక మాట అనవలసి వస్తున్నది. ఆయనకు గతంలో మంచి పేరైతే వచ్చింది గాని అదే సమయంలో టిపికల్ పోలీస్ సంస్కృతి బాగా వంటబట్టినట్టున్నది. మొదటినుంచి ఆయన మాటలు, చేతలు, చివరికి మూడు సార్లు హైకోర్టు నుంచి మందలింపులు, ప్రశ్నలు ఎదుర్కొనవలసి రావటం, అయినప్పటికీ తన ధోరణి మారకపోవటం ఒకవైపు ఫక్తు పోలీసు సంస్కృతిని, మరొకవైపు హైడ్రా అమలు విషయంలో అరాచకతను, కొంత అహంభావాన్ని సూచిస్తున్నాయి. అవి అప్రజాస్వామికత లక్షణాలు. ప్రజల హక్కులకు భంగకరమైనవి. చట్టానికి కూడా విరుద్ధమైనవి.
శనివారం నాటి మీడియా సమావేశంలో ఆయన రాజ్యాంగ సూత్రాలను, ఎవరో పెద్దాయనను (ఆ పేరు టీవీలో వినిపించలేదు. మరునాడు పేపర్లు రాలేదు) ఉటంకిస్తూ ఎంతో సమున్నతంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కాని తన వాస్తవమైన తీరు మాత్రం అందుకు అనుగుణంగా లేదు. ఈ విషయమై చెప్పేందుకు ఎన్ని దృష్టాంతాలైనా ఉన్నాయి. అవన్నీ ప్రజలు మాట్లాడుకుంటున్నవే అయినందున ఇక్కడ రాయనక్కరలేదు. ఆయన శనివారం నాడు ఒక విధంగా సంజాయిషీ అనిపించే తీరులో మాట్లాడినవి కూడా ప్రజలను ఒప్పించే విధంగా లేనందున కనీసం ఇప్పటికైనా తన మనస్సాక్షికి తాను సంజాయిషీ ఇచ్చుకుని మారటం అవసరం. గత కొద్దిరోజుల విషయానికి వస్తే, బుచ్చమ్మ ఆత్మహత్య లేదా మరణంతో హైడ్రాకు ఏ సంబంధం లేదంటూ ఆ రోజున టిపికల్ బురాక్రటిక్ శైలిలో చేతులు దులుపుకున్నారు. అది నడవలేదని అర్థమై శనివారం మీడియా సమావేశంలో, తాము నోటీసులేమీ ఇవ్వలేదని, ఎవరో ఆమెను భయపెట్టారని, హైడ్రా వచ్చేస్తున్నదన్నారంటూ తిరిగి అదే టిపికల్ పద్ధతిలో కొత్త ఎస్కేపిస్టు కథను అల్లారు. ఎవరైనా భయపెట్టినా, ఆమె స్వయంగా భయపడి ఉండినా, ఆ పేద వృద్ధురాలి భయానికి సృష్టి ఎక్కడ జరిగింది? ఆయన ధోరణి ఒకప్పుడు ఒరిస్సాలోని కలహండిలో పేదరికం వల్ల పెద్ద సంఖ్యలో ఆకలిచావులు సంభవిస్తుండగా, అవి ఆకలి చావులు కాదు పోషకాహార లోపం వల్ల జరిగినవంటూ ప్రభుత్వం లోకాన్ని వంచింపజేయ చూడటాన్ని గుర్తుకుతెస్తుంది.
ఇటువంటి వంచనలు ప్రభుత్వ నేతలకు అవసరం కావచ్చు. కానీ, తమకు కూడా అవసరమని కొందరు అధికారులు ఎందుకు భావిస్తారో వారి మానసికతల గురించి అధ్యయనం చేస్తే గానీ తెలియదు. వారు కనీసం పిల్లల పుస్తకాలను, ఉడుకుతున్న అన్నం గిన్నెలను, షెడ్లలోని సామాన్లను ఎందుకు తీసుకోనివ్వరో అప్పుడు అర్థమవుతుంది.
పోతే, ప్రభుత్వ అరాచక వ్యవహరణ గురించి కొంత చెప్పుకోవలసి ఉంది. హైడ్రా పరిధి ప్రస్తుతం ఓఆర్ఆర్ వరకు వర్తిస్తుందన్నారు. ఈ పరిధిలో గల చెరువులు, నాలాల సంఖ్యను దాన కిశోర్ చెప్పారు. కాని వాటన్నింటి ఎఫ్టీఎల్, బఫర్జోన్లపై కచ్చితమైన సమాచారాన్ని జూలైలో హైడ్రా ప్రకటనకు ముందే సేకరించవలసింది. వాటి మ్యాపులు, శాటిలైట్ చిత్రాలు, పంచాయితీ మ్యాపుల మధ్య గల తేడాలు, వేర్వేరు ప్రభుత్వ ఏజెన్సీల మధ్య గల తేడాలను పరిశీలించి ఒకే రూపంలో ప్రామాణికంగా తుది నిర్ధారణ చేయవలసింది. అన్నింటికీ భూమిపై హద్దులు కూడా పాతవలసింది. ఇది చేయనందున సమస్య ఇండియా-చైనా సరిహద్దు వలె తయారైంది. అక్కడ బ్రిటిష్ అధికారి మెక్‌మోహన్ పోతూ పోతూ కాగితాలపై డీ లిమిటేషన్ చేశాడు గానీ, భూమిపై డీమార్కేషన్ నేటికీ జరగలేదు. దానితో ఇద్దరం పేచీ పెట్టుకున్నాం. ఇదే స్థితి ఇప్పుడు దుర్గం చెరువులో కనిపిస్తుంది. ఇదిట్లా ఉండగా, ఈ పరిధులలో ఆక్రమణలు, అమ్మకాలు, అధికారిక అనుమతులు, స్థలాల రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అనుమతులు, అన్నివిధాల పౌర సౌకర్యాల కల్పనలు, దశాబ్దాల తరబడిగా అన్ని రుసుముల వసూళ్లు, దీనంతటిలో నాయకులు, పైరవీకార్లు, బిల్డర్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వారి పాత్రలు, లంచాలు, ఓట్ల రాజకీయాలు, గూండా గిరీలు వగైరాలతో సమస్తం గజిబిజిగా తయారైంది. ఇక స్వయంగా ప్రభుత్వ ఆక్రమణల సంగతేమిటి?
ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకొని సంబంధిత సమాచారాలు సేకరించిందా? ప్రశ్నలకు జవాబులు కనుగొన్నదా? ప్రభుత్వం వైపు నుంచి ఒక అతి ముఖ్యమైన లోపం ఆక్రమణలు అనే వాటికి వెనుకకు వెళ్లి కటాఫ్ తేదీని ప్రకటించకపోవటం. నిజాం కాలమా, హైదరాబాద్ రాష్ట్ర కాలమా, ఉమ్మడి రాష్ట్రమా, తెలంగాణ ఏర్పడిన 2014గా. నిర్మాణాలు చేసింది వ్యక్తులా, బిల్డర్‌లా, సహకార సంఘాలా, నిర్మాణం తర్వాత చేతులు మారాయా, కుటుంబ సభ్యుల మధ్య పంపకాలు జరిగాయా, స్థలాలను ప్రభుత్వాలే ఏవో పథకాల కింద పంపిణీ చేశాయా, క్రమబద్ధీకరణలు ఏవైనా జరిగాయా అనే ఆలోచనలు, నిర్ణయాలు ఏవీ చేయలేదు. ఇవి గాని, వివిధ అక్రమ అనుమతులనిచ్చిన అధికారులను, అక్రమ బిల్డర్లను, అక్రమ ఆక్రమణదారులను, అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్లు చేసిన రిజిస్ట్రార్లను (ఇదొక పెద్ద సమస్య) డాక్యుమెంట్ల పరిశీలనలో గుర్తించటం ఎంతమాత్రం సమస్య కాదు.
కానీ, ఇటువంటి చేయవలసిన పనులేవీ చేయకుండా యథేచ్ఛగా జేసీబీలు నడుపుతున్నారు. ఓఆర్ఆర్ లోపల చెరువులు, నాలాల వివరాలు సేకరించాలని, ఎఫ్టీఎల్, బఫర్జోన్లను గుర్తించాలని, అర్హులైన పేదల వివరాలు తయారుచేయాలని, కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి రావద్దని, ప్రజలను ఒప్పించాలని ముఖ్యమంత్రి ఇప్పుడు సెప్టెంబర్ చివరిలో, ఒకవైపు విధ్వంసం కొనసాగుతుండగా సెలవిస్తున్నారు. అంటే అవేవీ ఇప్పుడు లేనట్టు కదా? అనుమతులు, కూల్చివేతలు, నోటీసులు, మార్కింగ్‌లపై రంగనాథ్ శనివారం నాడు మరొక మారు మాటల గారడీ చేశారు. ఒకటి, రెండు కేసులేవో తనకు అనుకూలమైనవి చెప్పి అసలు అరాచకాన్ని దాచిపెట్టజూశారు.. కూల్చివేసినా లోన్లు కట్టాలి అదెట్లా, ఇక్కడినుంచి ఎక్కడికో వెళ్లగొడితే అక్కడ పనిపాటలెట్లా, పిల్లల చదువులెట్లా, ఒక్క డబుల్ బెడ్రూంలో మా నాలుగు కుటుంబాలు ఉండేదెట్లా, అన్ని అనుమతులతో కట్టుకున్న మమ్ములను కబ్జాకోరులంటూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేంటి, మా ఇళ్లు కొన్ని దశాబ్దాల పాటు చట్టబద్ధమై ఇప్పుడెట్లా చట్ట విరుద్ధమవుతున్నాయి, గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు రాత్రింబవళ్లు భయంతో జీవించే పరిస్థితి తెచ్చారెందుకు అంటూ బాధితులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. ఆదివారాలు కూల్చొద్దంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులుండగా ఆ పని ఎందుకు చేస్తున్నారని, స్టే ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
వీటివేటికీ జవాబులు లేని హైడ్రా కమిషనర్ బధిరత్వాన్ని నటిస్తున్నారు. కోర్టు ఉండని శని, ఆదివారాలలో వీకెండ్ టెర్రర్ సినిమాను యథావిధిగా చూపుతున్నారు. ముఖ్యమంత్రేమో అంతా భగవద్గీతానుసారమంటూ మనలను కొంత ఆశ్చర్యానికి, కొంత వినోదానికి గురిచేశారు. కూల్చివేతలలో పార్టీలను చూడబోమన్న ఆయన కొడంగల్‌లో స్వయంగా తన ఇల్లు, దుర్గం చెరువులో సోదరుని ఇల్లు, హిమాయత్‌సాగర్‌లో పొంగులేటి మొదలైనవారి ఇళ్లుంటే, మీడియా ఎత్తిచూపినప్పటికీ పెదవి విప్పటం లేదు. హైడ్రా కమిషనర్ తన చమత్కారమంతా ప్రదర్శిస్తున్నారు. హైడ్రా చట్టబద్ధమా, ఎఫ్టీఎల్, బఫర్జోన్ల మ్యాపులు ఎక్కడ? నోటీసులు ఇవ్వకుండానో, ఇచ్చిన కొన్ని గంటలలోనో ఎట్లా కూలుస్తారనే హైకోర్టు ప్రశ్నలకు జవాబులుండవు. కొత్తవే కూలుస్తాం, నివాసాలు ఉంటున్నవారివి కూ ల్చం వగైరాల మాటలు చెప్పే రంగనాథ్, మార్కింగ్‌లు ఎందుకు చేయిస్తున్నారో, తాత్కాలిక గుడిసె లు, షెడ్లలో నివసించేవారు, చిన్న వ్యాపారాలు చే సుకునే వారి బతుకేమిటో మాత్రం చెప్పరు. అసలు ప్రభుత్వానికి ఒక ఆలోచన, ప్రణాళిక ఉంటే గదా చెప్పేందుకు. హైడ్రా చర్యలకు, తక్కిన శాఖలకు ఎ టువంటి సమన్వయం లేని అరాచకం నడుస్తున్నది.
శనివారం నాటి మీడియా సమావేశంలో మరికొన్ని విచిత్రాలు కనిపించాయి. మూసీపై చేస్తున్నది సుందరీకరణ పథకమని ముఖ్యమంత్రి ఇంతకాలం హోరెత్తించగా, అదేమాట ప్రజలలోకి వెళ్లిపోగా, ఆ మాటతో ఇప్పుడు చిక్కులు, వ్యతిరేకతలు వస్తున్నట్లు గ్రహించి కావచ్చు, అది సుందరీకరణ కాదని, మూసీని కాలుష్యరహితం చేసి నది స్వచ్ఛంగా ప్రవహించేట్లు చేయటం మాత్రమేనని చెప్పి నమ్మించేందుకు రంగంలోకి లేట్‌గా ప్రవేశించిన దాన కిశోర్ గట్టిగానే ప్రయత్నించారు. ఎవరినీ బలవంతంగా డబుల్ బెడ్రూం ఇండ్లకు పంపబోమని ఇన్నాళ్ల మౌనం తర్వాత ఇప్పుడు హామీ ఇస్తున్నారు. హెల్ప్ డెస్క్లని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయా ప్రాంతాల పేదలు అక్కడి డబుల్ బెడ్రూంల కోసం ఇంతకాలం ఎదురుచూడగా, ఇప్పుడు వాటిని బయటివారికిస్తారా అంటూ గగ్గోలు పెడుతున్నారు. అదైనా, బాధితులు 10,660 మంది కాగా (కొన్ని ఇళ్లలో ఒకటికన్న ఎక్కువ కుటుంబాలున్నాయి మరి) డబుల్ ఇళ్లు నాలుగైదు వేలేనన్న దాన కిశోర్, మరో 15 వేల ఇళ్ల కోసం 700 కోట్లు అడిగామంటున్నారు. ఆ పని ఎప్పటికయ్యేనో ఎవరైనా ఊహించవచ్చు. ఇంతకూ ఇప్పుడు ఇస్తున్నవైనా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించినవన్న మాట మాత్రం చెప్పరు.
మౌలికంగా ఆలోచిస్తే అర్థమయ్యేది ఇదంతా వ్యవస్థ వైఫల్యం. ఎప్పటినుంచో వీరు వారని గాక అందరివల్ల జరిగిన వైఫల్యాలు. అనేక వైపుల నుంచి జరిగిన వైఫల్యాలు. మొదటనే అనుకున్నట్టు ప్రస్తుత ప్రభుత్వం అరాచకం మాత్రం ప్రజల మెడపై కత్తిలా నిలిచింది. నేరం మరొకరిది కాగా శిక్ష అనుభవిస్తున్నది ప్రజలు. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారానికి వచ్చినాక మరొకటి మాట్లాడటం అలవాటైపోయిన రేవంత్‌రెడ్డి ఆ బాధిత ప్రజలతో మాత్రం మాట్లాడరు.