తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తొంభై శాతం హామీలు పూర్తయ్యాయి. మిగిలిన హామీలు దశలవారీగా పూర్తి కానున్నాయి. అవినీతికి తావులేకుండా కేసీఆర్ ఆలోచనా విధానాలతో అధికారుల సహకారంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలిచింది. కులమతాలకతీతంగా పేద, ధనిక తేడాలు లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరువయ్యాయి. ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో పల్లెలన్నీ వల్లకాడులయ్యాయి. కులవృత్తులను నమ్ముకొని బతుకీడ్చినవారు అవి కనుమరుగవటంతో బతుకడమే కష్టమై పల్లెలనిడిచి వలసపోయిన సందర్భాలున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం అంతరించిపోయిన కులవృత్తులను ప్రోత్సహించడంతో పాటు, వ్యవసాయరంగ అనుబంధ రంగాలను మరింత బలోపేతం చేసింది.
తెలంగాణ వచ్చాక వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధానమైన గొర్రెలు, మేకల పెంపకం, పాడి పరిశ్రమలను ప్రోత్సహించి ఈ రంగాలపై ఆధారపడిన వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయతో జలసందడి చేస్తున్న చెరువుల్లో చేప పిల్లలను పెంచి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. సబ్సిడీ బర్రెల పథకాన్ని ప్రకటించి గ్రామీణ ఉపాధి రం గాన్ని బలోపేతం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతి ఎకరానికి ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నది. దశలవారీగా ప్రభుత్వం లక్ష్యాలను అధిగమిస్తూ పేద ప్రజలను, అణగారిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు నడిపించేందుకు ఎంచుకున్న లక్ష్యాల్లో ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది భవిష్యత్తు తరాల కోసమే అనేవిధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యమంలో కీలక భాగస్వామ్యం పంచుకున్న ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చి, పరిపక్వత చెందిన పాలనాధినేతగా పేరు తెచ్చుకున్నారు.
అభివృద్ధి, సంక్షేమరంగాలను ప్రక్షాళన చేసి పురోగతికి చర్యలు తీసుకున్నారు కేసీఆర్. ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటుచేసి సమాన అభివృద్ధి ఫలాలను సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికలు అమలుచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలో ఉన్న కోటి మూడు లక్షల కుటుంబా ల్లో నూతన వెలుగులు నింపాలన్న సంకల్పంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా సామాజిక సర్వే ఆధారంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వర్తింపజేస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 93 లక్షల కుటుంబాల్లో ఉన్న పేదలను గుర్తించి వారి ఆర్థికాభివృద్ధికి సరికొత్త పథకాలు ప్రారంభించింది ప్రభుత్వం. అన్ని సంక్షేమ పథకాల్లో నిబంధనలు సడలించి సాధ్యమైనంత మేర ఎక్కువ మంది లబ్ధిపొందేలా వారికి న్యాయం చేసింది ప్రభుత్వం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు గుర్తింపులేని అనేక కులాలను గుర్తించి వారి ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసింది. అవినీతి అక్రమాలకు దూరంగా ప్రభుత్వం సంక్షే మ కార్యక్రమాలను లబ్ధిదారులకు నేరుగా చేరవేయాలన్న సంకల్పంతో అనర్హులను తొలగించి, అసలైన అర్హులకు మేలు చేసింది. పరిమితి లేకుం డా పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. దారిద్య్రరేఖకు దిగువగా ఉన్న కుటుంబాలను గుర్తించి వారి కి ఆహారభద్రత కల్పించేందుకు ఆధార్ కార్డు లింకేజీతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం ది. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి డిజిటల్ రేషన్ కార్డులను మంజూరు చేసేవిధంగా చర్యలు చేపట్టింది. బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులను సరఫరా చేస్తుంది. ప్రభుత్వం ఈ విధానం ద్వారా బ్లాక్ మార్కెట్‌ను దాదాపు 90 శాతం అరికట్టకలిగింది.
వంట కోసం కిరోసిన్‌ను వాడని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లను పెంచేందుకు నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో 19.84 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా 9.37 లక్షల మందికి కనెక్షన్లు మంజూరయ్యేలా చేసింది. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ మహిళా పోలీసులతో ‘షీ’ టీమ్‌లను ఏర్పాటుచేసింది. మహిళల పట్ల జరిగే అఘాయిత్యాలను అరికట్టగలిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తూ పేద విద్యార్థులకు బాసటగా నిలిచించి. రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రైతుల రుణమాఫీ చేసి వారి అప్పులను తీర్చింది. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయాల నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. వ్యవసా య ఉత్పత్తుల నిలువకు కొత్తగా మూడువందలకు పైగా గోదాములను నిర్మించే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. ప్రభుత్వం రాజధానిలో ప్రవేశపెట్టిన ఐదు రూపాయల భోజన పథకాన్ని వ్యవసాయ మార్కెట్లో ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నింటికీ మించి దళిత నిరుపేదలకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధం గా దళితులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభు త్వం దళితబంధు పథకం ద్వారా పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి, వారి ఇంట్లో వెలుగులు నింపుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అనేక గురుకుల పాఠశాలలను కొత్తగా ప్రారంభించింది. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రూ.20 లక్షలరుణ సదుపాయాన్ని అందజేస్తుంది.
అణగారిన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పరిశ్రమల ద్వారా ప్రత్యేకంగా 50 శాతం వరకు పెట్టుబడి రాయితీలను అందిస్తున్నది. న్యాయవాదుల అభివృద్ధి, సంక్షేమం కోసం వందకోట్లు కేటాయించింది. డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు ఐదు లక్షల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ప్రమాద బీమా కింద ఉన్న పథకాన్ని రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచింది.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎంచుకున్న మిషన్ భగీరథ పథకం లక్ష్యాన్ని ఛేదించింది. గడువులోగా పనుల న్నీ పూర్తిచేసి 100 శాతం మంచి నీటిని అం దించే రాష్ట్రంగా గుర్తించబడింది. రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే తపనతో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పుట్టిన బిడ్డకు 16 రకాల వస్తువులతో కూడి న కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పోషకాహారాన్ని అందిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికీ జీతాలు పెంచింది. అలాగే ఆశా వర్కర్ల పారితోషికాన్ని కూడా పెంచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా 4,380 గ్రామపంచాయితీలు ఏర్పాటయ్యాయి. విద్యుత్తు రంగంలో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొం దింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరందించింది. తద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు, గతంలో కంటే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వరి దిగుబడిలో నేడు తెలంగాణ దేశం గర్వించే స్థాయిలో నిలిచిం ది. రైతులు పంటలు పండించి సంతోషంగా ఉన్నారంటే అది కేసీఆర్ సంకల్పమే.
రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు కారణంగా ఈనాడు అనేకవర్గాల ప్రజలు వెలుగుదారుల్లో పయనిస్తున్నారు. ఇలా అనేక వర్గాల అభివృద్ధి కో సం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు మరొకసారి ఆదరించాల్సిన అవసరం ఉన్నది. లేనట్లయితే ప్రజా సంక్షేమం కుంటుపడే ప్రమాదం ఉన్నది. ప్రధానంగా తెలంగాణ జలవనరులు, మన ప్రాం తానికి దక్కకుం డా పోయే ప్రమాదమూ ఉన్నది. ఎందుకంటే పచ్చ గా ఉన్న తెలంగాణను వల్లకాడు గా చేయడానికి ప్రతిపక్ష పార్టీలు కూటమి కట్టాయి. ఆ కూటమిలో ప్రజా సంక్షేమం కంటే సొంత స్వార్థమే ఎక్కువ గా కనబడుతు న్నది. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి. ప్రజా ప్రభుత్వానికి బాసటగా నిలువాలి.
-మోటె చిరంజీవి
99491 94327