కాలం కటువుగా, నిర్దయగా ఉంటుందనిపిస్తుంది చాలాసార్లు! యేసు క్రీస్తు, మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ లాంటి వారిని సమకాలీన చరిత్ర అవమానించడం ఎంతటి అన్యాయం? ఆ మహనీయులు చెప్పిన, చేసిన మహత్కార్యాలకు వారిని నెత్తిన పెట్టుకొని పూజించాలి కదా! వర్తమానం కంటే భవిష్యత్తు కొంచెం ఉదారంగా ఉండటం కారణంగా క్రీస్తు, గాంధీ తదితరులు తమ తదనంతర కాలంలో వైతాళికులుగా వెలగడం సాంత్వన కలిగిస్తున్నది.
అంతటి చారిత్రక అన్యాయానికి గురవుతున్నవారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, స్వాప్నికుడు, రాజనీతిజ్ఞుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు! ‘పదేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి’ అని అంటాం కానీ, అది పదేండ్లలో జరిగింది కాదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి, తెలంగాణపై కుట్రల గురించి పెద్దాయన లోతైన అధ్యయనం 1990 దశకం నుంచే చేసిన్రు. ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ సుందరంగా, ఆదిప్రాసయుతంగా ఉండటం వల్ల ఉద్యమ ట్యాగ్ లైన్ కాలేదు. తెలంగాణ ప్రయోజనాలు ఆయనకు తెలుసు కాబట్టి, పదిలంగా కాపాడటం చేతనవుతుంది కాబట్టి. తెలంగాణ స్టేక్ హోల్డర్లు అయిన వేలాదిమంది నిపుణులతో గంటలకొద్ది సమయం, లక్షలాది పేజీల మథనం చేసిన్రు. అనితర సాధ్యమైన నాయకత్వంతో తెలంగాణకు అమృతం పంచిన్రు, దరిమిలా ఉద్భవించిన గరళాన్ని తానే భరించిన్రు చంద్రశేఖరుడైన శివునిలా!
పుట్టుక తప్ప, తెలంగాణతో ఎలాంటి ఆత్మికబంధమూ లేని రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టదలచుకున్నడు. విచారణ కోసం పిలిపిస్తున్నడు. ప్రజాప్రభుత్వాన్ని కూల్చబోయి పట్టపగలు దొరికిపోయిన మనిషి తన వ్యక్తిగత కక్ష కోసం ఉవ్విళ్లూరుతున్నడు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత మహత్తరమైనదో, తెలంగాణ ఎట్లా సస్యశ్యామలమైనదో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రజాక్షేత్రంలోని విశిష్ట వ్యక్తులు పలుమార్లు కీర్తించిన్రు. తెలంగాణ అంటే గుండెనిండా విద్వేషం ఉన్న ఆంధ్రజ్యోతి సైతం నాలుగురోజుల కింద రాసింది, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను తెలంగాణ దాటిపోయిందని. కాళేశ్వరం వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నయి. దానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నదని ఘోష్ కమిషన్ ముందు నాటి ఆర్థిక మంత్రి, ఇప్పటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టిన్రు. హరీశ్‌రావు సాధికారికంగా, గణాంక సహితంగా, డాక్యుమెంట్యుతంగా కమిషన్ ముందు సత్యావిష్కారం చేసిన్రు. ఆ వివరాలు, వివరణల పట్ల ఘోష్ కమిషన్ సంతృప్తి చెందినట్టు వార్తలూ వస్తున్నయి. అయినా, కేసీఆర్ రావాల్సిందే, ఆయనను విచారించినమనే వికృతానందం పొందాల్సిందే అన్నది రేవంత్ పంతం. ఆయనే చెప్పుకొన్నట్టు సీఎం అయ్యిందే కక్షలు, కార్పణ్యాల కోసం; జనం కోసం కాదు కదా! మరింక రేవంత్ పంతం తమ పంతమని జనం ఎందుకు అనుకుంటరు? కేసీఆర్ మీద బురదజల్లే పాచిక ఎట్లా పారుతది?
సమైక్య పాలన, తెలంగాణ స్వయంపాలన, ఇప్పటి రేవంత్ పాలనాలేమి.. ఇవన్నీ ఊళ్లల్లో రచ్చబండల దగ్గర చర్చకు వస్తున్నయి. ‘సారు మల్లా రావాలె’ అంటున్నరు. అట్లా అంటున్నవారు బీఆర్ఎస్ వారు మాత్రమే కాదని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, చదువరులు అందరి అనుభవంలోనిదే! ఆర్థిక ఇబ్బందులు, పడిపోయిన జీవన ప్రమాణాలు, అడుగంటిన భవిష్యత్తు ఆశలు పేదలకు నిత్యానుభవంగా ఉన్నది. అందునా, మహిళలకు మరింతగా ఆ బాధ తెలుసు. ఇంటి కష్టాలు ఇల్లాలి కంటే ఎవరు ఎరుగుదురు? కాబట్టే, బూతుల రూపంలో ప్రజాగ్రహం వాట్సాప్‌లలో మీదాకా వస్తున్నది. అవన్నీ మహిళల నిరసనలే. వీటి ముందు రేవంత్ విన్యాసాలు నిలువవు, పాచికలు పారవు!
పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఇలా అన్నరు. ‘ఇప్పటికైనా, ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి. చిన్న వయసులో మీకు పెద్ద అవకాశం వచ్చింది. ప్రజలకు మేలు చేయండి’ అని. ఆ మహనీయుడు ఎక్కడ? ఆయన చావు కోరుకునే అల్పులెక్కడ!
‘పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో నీతిబాహ్యమైన, చట్టవిరుద్ధమైన దోపిడీ చర్యలకు సంబంధించి అనేక విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి శాయశక్తులా కృషిచేశాను. ఏ ఒక్కరూ ఏ విధంగానూ నన్ను బలపరచలేదు. నా అనుభవంలో ఇది బాతాఖానీ షాపు మాత్రమే! జనాన్ని కదిలిస్తే తప్ప, ప్రజలు తమంత తాముగా నిలబడటం నేర్చుకుంటేనే తప్ప మరో మార్గం లేదు’ అని 1969 మార్చి 16న శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీలో కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి అన్న మాటలివి!
దురదృష్టవశాత్తూ ఇవి రేవంత్‌రెడ్డికి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇది కేవలం తెలివిడికి సంబంధించిన అంశం కాదు; ముఖ్యమంత్రి వ్యక్తిత్వం, ఆయన ప్రవర్తన, ఆయన ఫిలాసఫీ అలాంటిది! ఆయన రోల్‌మోడల్స్, రోకలి మోడల్స్ వేరే! రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానన్న సోయి ఆయనకు సంవత్సరం దాటినా రావడం లేదు.
ఈ ఏడాదిన్నరలో దాదాపు రూ.1,58,041 కోట్లు అప్పు చేసినమని రేవంత్ స్వయంగా అసెంబ్లీలో మొన్న మార్చి 15న ప్రకటించిన్రు. అయినా పూటగడవని పరిస్థితి. జీడీపీ పెంచుతదని ప్రచారం చేసుకున్న ఫ్రీ బస్సు ఇప్పుడు కాస్ట్లీగా మారింది. చెప్పాపెట్టకుండా 20 శాతం ధరలు పెంచింది ఆర్టీసీ. విద్యార్థుల పాస్‌లు 50 శాతం పెంచింది. తెలివిలేని నిర్ణయాలు, దుందుడుకు చర్యలతో హైదరాబాద్ ఇమేజ్ నాశనం అయ్యింది. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్ జనరేట్ చేసే ఆదాయం, రియల్ఎస్టేట్ ఢమాల్ అన్నది. హైడ్రా భయం పల్లెలకూ చేరింది. రిజిస్ట్రేషన్లు పడిపోయి మూడు నెలల్లో రూ.800 కోట్ల నష్టం వాటిల్లింది ఖజానాకు. రేవంత్‌రెడ్డి దావోస్, అమెరికా, యూకే పర్యటనలు విహారయాత్రలుగా మిగిలిపోయాయే గానీ, రాష్ర్టానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఒక్క పైసా అయినా రాలేదు. కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు, కొత్త సంస్థల జోరు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్‌ల్లో ఊపందుకుంటుండగా, తెలంగాణలో చతికిలబడ్డట్టు కేంద్రప్రభుత్వ కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ గణాంకాలు బయటపెట్టాయి.
అసలే అరకొర ఆదాయం. అందులో కొంత అధిష్ఠానానికి, మరికొంత మంత్రుల ముఠాకు వంతులు వేయగా, ప్రజలకు విదిల్చడానికి మిగిలేది ఎంత? కాబట్టే క్షేత్రస్థాయిలో ప్రజల ఆందోళనలు. కేసీఆర్‌ను ఎన్ని తిట్టినా, పైసా అందకపోతే జనాల కడుపునిండుతదా? ఆగ్రహం ఆగుతదా? డైవర్షన్ పాలిటిక్స్ జనం ఆకలిని మాన్పుతదా? ఈ మాత్రం సోయి ఎందుకు ఉండదు పాలకులకు? వంద కిలోమీటర్ల దూరానికి సైతం హెలికాప్టర్లు వాడే మంత్రులు, అందాల పోటీల కోసం కోట్లాది రూపాయల దుబారా.. ఇవన్నీ ప్రజల పట్ల తీవ్ర పరిహాసం!
ఈ పాలన పట్ల ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ప్రజాపాలన అని అధికారంలోకి వచ్చిన పార్టీ కార్యాలయం ముందు ఇనుపకంచెలు వచ్చినయి. ఓడిపోయిన పార్టీ కార్యాలయాన్ని జనాలు వెతుక్కొని వెళ్లి మరీ తమ బాధలు చెప్పుకొంటున్నారు. తెలంగాణ భవన్ ‘జనతా గ్యారేజీ’గా మారిపోయింది.
తెలంగాణ అంతటా పరచుకున్న కేసీఆర్ స్ఫూర్తిని ‘ఈ స్తంభంబునందు చూపగలవే చక్రిన్ గిక్రిన్’ అని నీలిగి సమసిపోయే దైత్యుని వలె రేవంత్‌రెడ్డి పొడసూపుతున్నడు. రేవంత్ అఘాయిత్యపు చర్యల పర్యవసానమే కేసీఆర్ విచారణ. మొదటే చెప్పినట్టు ఆ మహనీయునికి ఇది జీవితకాలంలో తారసపడిన అనేకానేక పరీక్షల్లో ఒక చిన్న పరీక్ష, తెలంగాణకు అవమానం. అయిననూ… చివరి మబ్బు విడిపోయి వెలుగులు చిమ్మడానికి ఇదొక అవకాశం. కేసీఆర్‌లోని వైతాళికుడు రాబోయే రోజుల్లో ప్రస్ఫుటమవడం అవశ్యం!