‘కన్ను ఏడుస్తుంటే, చేయి తుడుస్తుంది! ఆ చేతికి దెబ్బ తగిలితే, కన్ను ఏడుస్తుంది’ అలాగే ‘అలమటిస్తున్న తెలంగాణ ఆకలి దప్పులు తీర్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమిస్తుంటారు కేసీఆర్. అలాంటి ప్రజా నాయుకుడిని, అప్రయోజక పాలకులు అవమానిస్తుంటే ఆక్రోశిస్తూ, ఆగ్రహిస్తుంటుంది తెలంగాణ’. అందుకే అసూయపరులంతా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏకమై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా విడదీయలేని అనుబంధం ‘కేసీఆర్-తెలంగాణ బంధం’ అంటున్నది ప్రజానీకం.
నాటి ప్రజా రాజకీయాలకూ-నేటి వ్యాపార రాజకీయాలకూ ఎంత తేడా? ‘నాడు గోదావరి నీటి కోసం ‘ధవళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మించిన ‘కాటన్ దొర’ను అపర భగీరథునిగా కీర్తించారు. తమకు సాగు, తాగు నీరందించినందుకు దేశాంతర, ఖండాంతర వాసి అయినా పాలకులతో సహా, నిలువెత్తు విగ్రహం పెట్టి ‘కాటన్ దొర’ను నేటికీ పూజ్యభావంతో స్మరిస్తున్నారు అక్కడి ప్రజలు. కృతజ్ఞత అంటే అదే. భారతీయ సంస్కృతి ‘కృతజ్ఞత’ను ఉత్తమ సుగుణంగా పరిగణిస్తుంది. ఎందుకంటే? ‘మానవాళిని ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకువెళ్తుంది కృతజ్ఞత’ అన్నారు శ్రీరామకృష్ణ పరమహంస.
నేడు అదే గోదావరి జలాల కోసం ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్‌ను ‘అభినవ భగీరథుని’గా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే? నాటి భగీరథుడు ఆకాశం నుంచి గంగను పాతాళానికి దింపితే- ఈ అభినవ భగీరథుడు పాతాళం నుంచి గోదావరిని ఆకాశానికి ఎక్కించారు. కేసీఆర్ తెలంగాణ బిడ్డ. తెలంగాణ పిత. జలదాత.
అయినా సరే, అలాంటి ప్రజా నేతను విచారణ పేరిట కమిషన్ ముందుకు పిలిపించి ఘోరంగా అవమానించారంటూ రగిలిపోతున్నారు తెలంగాణ ప్రజలు. ‘కృతఘ్నత’ అటే ఇదే కదా! భారతీయ సంస్కృతి ‘కృతఘ్నత’ను నీచగుణంగా పరిగణిస్తుంది ‘కృతఘ్నుల శవాలను కుక్కలు కూడా ముట్టవు’ అని హెచ్చరిస్తున్నది మహాభారతం. అయినా సరే, వ్యాపార రాజకీయాలలో లాభానికే గానీ, కృతజ్ఞతకు తావుండదని నిరూపిస్తున్నారు నేటి పాలకులు.
నేటి వ్యాపార ప్రపంచంలో, సనాతన ధర్మమంటున్న పార్టీతో సహా పాలక పార్టీలన్నీ భారత రాజకీయాన్ని ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’గా మార్చేశాయి. తత్ఫలితంగానే, ‘పుచ్చలపల్లి సుందరయ్య’ అన్నట్టు నేడు దేశవ్యాప్తంగా ‘అమ్ముకుతినే ఆశపోతులే’ అధికార పీఠాల మీద అగుపిస్తున్నారు. ‘ఏం చేసైనా అధికారాన్ని దక్కించుకోవటమే, ఆశపోతుల లక్ష్యం’. అందుకు వారి ఎత్తుగడలు.
అయితే, ఇలాంటి వ్యాపార రాజకీయ ఎడారిలోనూ, అరుదైన మానవీయ ఒయాసిస్సుల వంటి ప్రజానేతలూ కొందరున్నారు. వారిలో నిరంతర అధ్యయనశీలి, ప్రణాళికాబద్ధమైన ప్రగతిశీలనేత, భావితరాల గురించి యోచించే రాజనీతిజ్ఞుడైన కేసీఆర్‌ను ప్రముఖునిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే, తెలంగాణ పట్ల భక్తి, ప్రజల పట్ల గల ప్రేమతో ప్రాణాలకు తెగించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించటమే కాదు, ఆరు దశాబ్దాలుగా చీకటి వెలుగుల్లో, ఆకలి దప్పులతో అల్లాడుతున్న ఆకలి తెలంగాణను కేవలం ఎనిమిదేండ్లలో అన్నపూర్ణగా, వెలుగుల రాష్ట్రంగా రూపొందించారు. దటీజ్ కేసీఆర్. అందుకే ‘కరోనా కష్టకాలం పోను, కేసీఆర్, బీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రెండవ ప్రాంతం తెలంగాణ’ అని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జియా ప్రకటించారు. అది అక్షర సత్యమని నిరూపించింది ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ విడుదల చేసిన నివేదిక.
దురదృష్టవశాత్తు నేడు మెజారిటీ మేధావులు, మీడియా, సామాజిక ప్రవాహాన్ని వీడి, లాభదాయక అధికార ప్రవాహాన కొట్టుకుపోతున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు స్వీయ పరిశీలనకు పూనుకున్నారు. ప్రజా నేతల పాలనా ఫలితాలను రాజకీయ వ్యాపారుల పాలనా వైఫల్యాలను బేరీజు వేసుకుంటున్నారు. అందుకు ఆర్బీఐ, నీతి ఆయోగ్-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాధికారిక సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
అంతేకాదు, కేసీఆర్ హయాంలో ఆవిష్కరించిన ‘ఎడ్యుకేషనల్ హబ్’, ‘ఐటీ హబ్’, ‘అపూర్వ శిల్పకళా క్షేత్రంగా యాదగిరి గుట్ట’, ‘అంబేద్కర్ విగ్రహ సమేత అధునాతన కళాత్మక సచివాలయం’, తెలంగాణ తల్లికి అనన్య సామాన్య, అమూల్య అభరణాలుగా విరాజిల్లుతున్నాయన్నది, పర్యాటకుల, ప్రపంచ
సుందరీమణుల ప్రశంస! ‘ఇంతకూ ఇది హాలీవుడ్డా? తెలంగాణనా?’ అన్నది సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రశంస.
తెలంగాణను ప్రగతి పథాన కేసీఆర్ పరుగెత్తించిన తీరుతో ఈ గల్లీ టు ఢిల్లీ పాలకులు పోటీ పడలేరని అంటున్నారు తెలంగాణ ప్రజలు. డబుల్ ఇంజిన్ సర్కార్లు, ఈ గల్లీ టూ ఢిల్లీ పాలకులు ఎనిమిదేండ్లు కాదు గదా, ఎనిమిది దశాబ్దాలు ఏలినా, ‘కేసీఆర్‌ను క్రాస్ చేయటం కాదు, కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా చేరుకోలేరు గాక చేరుకోలేరు’ అంటూ తెలంగాణ రైతాంగమే కాదు, భారత రైతాంగమూ సవాలు చేస్తున్నది. ఎందుకంటే? ‘డబ్బులు ఊరికే రావు’ అన్నట్టు ‘ఊకదంపుడు ఉపన్యాసాలతో అభివృద్ధి ఊడిపడదు’, – ప్రజల సమస్యలేంటో? వాటికి పరిష్కార మార్గాలేంటో? స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి నాయకుడు. అందుకు సునిశిత పరిశీలన-నిరంతర అధ్యయనం- వివిధ రంగాల మేధావులతో చర్చల ద్వారా సమస్యల సాగరాన్ని మధిస్తే గాని పరిష్కారామృతం లభించదు. అలా నిర్విరామంగా సమస్యల సాగరాన్ని మధించిన కేసీఆర్, మన వంటి వ్యవసాయక చైనా అభివృద్ధికి ‘డెంగ్‌సియావో పింగ్’ ఎంచుకున్న ప్రగతి మార్గాన్ని ఆదర్శంగా స్వీకరించారు.
‘డెంగ్’ వలెనే బడ్జెట్లో అత్యధిక నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించి గణనీయ వ్యవసాయాభివృద్ధినీ – తద్వారా విద్య, వైద్య, పారిశ్రామిక ప్రగతినీ – తద్వారా సాంకేతిక విద్య, సేవల రంగాభివృద్ధి దిశగా తెలంగాణను పరుగులు పెట్టించారు. అందువల్లనే ఆయన ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రగతిని సాధించిన తెలంగాణ అధినేతగా దేశం దృష్టినే కాదు, యావత్ ప్రపంచ దృష్టినే ఆకర్షించగలిగారు. దటీజ్ కేసీఆర్.
‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్నాడొక మహర్షి. ‘కృషితో రుషిగా ఎదగటానికి మనిషికి దేశం అవసరం. దేశం గొప్పగా ఎదగటానికి రుషిగా ఎదిగిన ఆ మనిషి అవసరం.’ అన్నాడు ఒక తత్తవేత్త. అలా రుషిగా ఎదిగిన కేసీఆర్‌ను తెలంగాణ రాష్ట్రమే కాదు, నేడు యావత్ దేశమే కోరుకుంటున్నది. అందుకే పాలక పార్టీలకు ఆయనంటే అసూయ, పగ అనే వాస్తవాన్ని ఇప్పటికీ గుర్తించగలిగారు తెలంగాణ ప్రజలు. ఇది తెలంగాణకే కాదు, భారతదేశానికీ శుభపరిణామం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– డాక్టర్ పాతూరి వేకంటేశ్వరరావు
98490 81889