‘ఏం చేస్తున్నావే కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా’ అన్నదట వెనుకటికి ఓ కోడలు పిల్ల. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీరు అందుకు భిన్నంగా ఏమీ లేదు. వరంగల్ సభలో తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివితే ప్రభుత్వ పెద్దలు తత్తరబిత్తర పడిపోతున్నారు. అన్నింట్లో సున్నా మార్కులు రావడమే అందుకు కారణం. మొదట మంత్రులు, పార్టీ నేతలు గాయి చేశారు. సర్కారు సాధించిన గొప్ప సంగతులేమిటో చెప్పలేక ఎదురుదాడితో సరిపెట్టారు. అడ్డగోలుగా విమర్శలు గుప్పించేందుకే మొగ్గు చూపారు. వారి సంగతి అలా వదిలేస్తే ఇప్పుడు స్వయంగా గుంపుమేస్త్రీ ఆత్మ సమర్థనకు దిగారు. ఆ సమర్థన సెల్ఫ్‌గోల్ లా ఉండటమే విడ్డూరం. ఏడాదిన్నర కాలంగా పథకాలకు చిత్రికలు పడుతున్నారట. సమయమంతా ప్లానింగ్‌లోనే గడిచిపోయిందట. ఇక నుంచి తడాఖా చూపిస్తారట. ఇదీ ఆయన మాటల్లోని సారాంశం. అంటే ఇప్పటిదాకా ఏమీ చేయలేదని ఒప్పుకున్నట్టే. కేసీఆర్ అంటున్నది, ప్రజలు చెవియొగ్గి వింటున్నదీ ఆ మాటే. ‘శుష్కప్రియాలు, శూన్యహస్తాలు’ తప్ప తమ ప్రభుత్వం సాధించిందేమీ లేదని రేవంత్ చెప్పకనే చెప్పారు. మాట మీద నిలబడటం కష్టం కానీ ఎగ్గొట్టేందుకు ఎన్నో దారులు. రాజు గారు మెచ్చుకొని ఉల్లిగడ్డ చేతుల వెట్టినట్టు శాంపిల్ పథకాలతో సరిపెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రం అంధకారంలో ఉన్నది. ఎటుచూసినా అస్తవ్యస్త స్థితి. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. ప్రతికూల శక్తులు దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఆయన రాష్ర్టాన్ని స్థిరంగా వెలుగుల వైపు నడిపించారు. ప్రగతిపథంలో ప్రథమ స్థానంలో పరుగెత్తించారు. రేవంత్ బడేభాయ్ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ బీఆర్ఎస్ పాలనకు ఇచ్చిన అవార్డులు, రివార్డులే అందుకు తార్కాణం. కేసీఆర్ దూరదృష్టి, దార్శనికత, వ్యూహ చతురత, నాయకత్వ పటిమ అందుకు కారణం. నిరంతర సమాలోచనలతో రాష్ర్టానికి దశ-దిశ నిర్దేశించిన తీరు అద్వితీయం. సంపద పెంచి అందరికీ పంచిన తీరు అనన్య సామాన్యం. అన్ని సూచీల్లో రాష్ట్రం అగ్రస్థానాలకు ఎగబాకడం ఆయన పాలనా సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనం.
మామూలుగా సంసారాలు నడపడమే కష్టమంటారు. అలాంటిది సర్కారును నడపడం మామూలు విషయం కాదని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ‘కనీసం మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు రాష్ట్ర భారాన్ని ఎలా నడిపిస్తారని’ పదవిలోకి వచ్చిన కొత్తలో అడిగితే ‘గుంపుమేస్త్రీకి అన్నీ తెలియాలా’ అని తెలివిగా సమాధానమిచ్చారు సీఎం రేవంత్. అది తప్పించుకుతిరిగే సమాధానమని ఇప్పుడు తేటతెల్లమైంది. ఏడాదిన్నర సాక్షిగా ఆయన పరిపాలనా సామర్థ్యం బట్టబయలైంది. పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించిన పళ్లెంలో రాష్ర్టాన్ని కేసీఆర్ అప్పగిస్తే ఖాళీ ఖజానా చేతికిచ్చారనే కల్లబొల్లి కబుర్లతో పాలన మొదలుపెట్టారు రేవంత్. బీఆర్ఎస్ అప్పులు చేయడం తప్పని ఇల్లెక్కి కూసినోళ్లు రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారు. గతంలోని అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పుల కంటే ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసింది. మరి ఆ అప్పును ఏ బొందలో పోశారో వారికే తెలియాలి. ఇప్పుడేమో అప్పు పుట్టడం లేదని కూడా బీద అరుపులు అరుస్తున్నారు. పతార పోగొట్టుకొని అప్పు అడిగితే ఎవరూ ఇవ్వరనే కనీస ఇంగితం గుంపుమేస్త్రీకి లేకపోతే ఎలా?