Telangana | గురు, శిష్య పరంపర సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన అంశం. ఒక్కొక్కసారి గొప్ప గురువుకు మంచి శిష్యులు దొరకరు. అటు ఉత్సాహవంతులైన శిష్యులున్నా గురువు దొరకకపోవచ్చు. వారిద్దరి ప్రకృతిలో, ఆలోచనల్లో తేడాలుండవచ్చు. కొద్ది ఉదాహరణల్లో శిష్యులు ఎంత గొప్పవారుగా తేలుతారంటే, వారి గురువుల పేర్లు ప్రజలకు తెలియవు. శిష్యుల పేర్లే తెలుస్తాయి. ఆదిశంకరాచార్యులవారి పేరు చాలామందికి తెలుసు. వారి గురువు గోవింద భగవత్పాదులు అని ఎంత మందికి తెలుసు? త్యాగరాజువారి గురువు సొంఠి వెంకటరమణయ్య అని ఎందరికి తెలుసు? అద్భుత రాజకీయ నీతిజ్ఞుడు అటల్ బిహారి వాజపేయి గురువు ఎవరికైనా తెలుసా?
ఏ రంగంలోనైనా ఎవరి ప్రతిభను బట్టి వారు రాణిస్తారు. తమ మేధ, అనుభవం, జీవితాన్ని పరిశీలించిన విధానాన్ని బట్టి వారి ప్రతిభ బయటకు వస్తుంది. గురుశిష్యులకు ఒకేరకమైన పోటీపెడితే తెలుస్తుంది ఎవరి ప్రతిభ ఏమిటో? నందమూరి తారక రామారావు మీద అభిమానంతో, కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పరంపరతో విసిగి కేసీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. జాతీయ పార్టీలకు రాష్ర్టాల గురించిన అవగాహన పూర్తిగా ఉండదని, ప్రాంతీయ పార్టీ అయితే ప్రజల అవసరాలు త్వరగా గుర్తించడం, తీర్చడం జరుగుతుందని ఆయన భావించారు. పదేండ్ల తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్‌ను దించి ముఖ్యమంత్రి పదవి ఆక్రమించిన చంద్రబాబు నాయుడి పార్టీలో కేసీఆర్ ఉండిపోవలసి వచ్చిం ది. అయితే చాలా నిజాయితీగా పార్టీ కోసం జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి పథకాలను రూపొందించి చంద్రబాబుకు సహాయం చేశారు. అయితే తరచుగా కేసీఆర్ తన శిష్యుడని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు.
చరిత్రలో విచిత్రమైన విషయాలు జరుగుతాయి. తెలంగాణ అన్న పదాన్ని అసెంబ్లీలో ఉచ్చరించకుండా నిషేధించిన చంద్రబాబు అహంకారాన్ని, తెలంగాణకు అప్రతిహతంగా జరుగుతున్న అన్యాయాన్ని చూసి, అవినీతిపరుడైన చంద్రబాబు పార్టీని వదిలి, కేవలం తెలంగాణ ప్రజల కోసం మరో పార్టీని స్థాపించి, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు కేసీఆర్. చంద్రబాబు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారో, తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారనే చరిత్ర ప్రజల కండ్లముందే ఉన్నది.
నిజానికి విచిత్ర సన్నివేశం ఏమంటే.. రాష్ర్టాలు విడిపోయాక ఇటు తెలంగాణకు కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రులు కావడం. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కేసీఆర్ మొట్టమొదటిసారి రాష్ట్ర అధినేత అయ్యారు. అప్పటికే 36 ఏండ్ల రాజకీయ అనుభవం, 9 ఏండ్లు ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు. మరి 2014 నుంచి 2019 దాకా (రెండోసారి ఆంధ్రా ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు కాబట్టి) ఈ ఇద్దరు నాయకుల పాలన ఎలా ఉండింది?
అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల లాగా పరిగెత్తించి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో కేసీఆర్ నిలిపారు. ముందుగా కరెంట్ కష్టాలు తొలగించి ప్రజలందరికీ మేలు చేశారు. తర్వాత చెరువుల పునరుద్ధరణ, నీటిపారుదల కల్పించి వ్యవసాయరంగాన్ని వృద్ధిపరిచారు. కేవలం ఎనిమిదేండ్లలో 56 లక్షల ఎకరాల నుంచి 1.65 కోట్ల ఎకరాల్లో పంట పండించారు సంతోషంగా తెలంగాణ రైతులు.
విద్యారంగంలో దాదాపు 1200 గురుకులాల స్థాపన, వైద్యరంగంలో ఆసుపత్రులను పటిష్ఠం చేయడం, కేసీఆర్ కిట్ వంటి పథకాలు సామాన్యుడికి ఊరటనిచ్చాయి. ముసలివారికి పింఛన్లు, ఆడపిల్ల పెండ్లికి కల్యాణలక్షి వంటి పథకాలే కాకుండా, అవసరమైన నిర్మాణాలు రికార్డు సమయంలో పూర్తిచేశారు. రూ.720 కోట్లతో సచివాలయ భవనం, జిల్లాల్లో కలెక్టరేట్లు, పార్కులు, వైకుంఠధామాలు, బీదవారికి విద్యాదానం, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు, బీసీ బంధు వంటి పథకాలు అమలుపరిచారు. కుల, మత భేదాలు లేకుండా సనాతన ధర్మంలో చెప్పిన సమానత్వాన్ని పాటించిన నేత కేసీఆర్.
ఇక చంద్రబాబు ఐదేండ్లలో ఒక్క రాజధానికి కావలసిన శాసనసభా భవనం గాని, హైకోర్టు గాని నిర్మించలేకపోయారు. సింగపూర్ నుంచి రాజమౌళి దాకా రకరకాల పేర్లు రంగప్రవేశం చేశాయి. కానీ, ఒక్క నిర్మాణం పూర్తికాలేదు. ప్రజలకు ప్రమాణం చేసిన ఉద్యోగ కల్పన పూర్తికాలేదు. పదేండ్ల తర్వాత నీటమునిగిన అమరావతికి పడవల్లో వెళ్లవలసి రావడమే తప్ప, అక్కడ ఏం జరుగుతున్నదో ఎవరికీ పాలుపోవడం లేదు. జగన్ ప్రతిపాదించిన వికేంద్రీకరణ, మూడు రాజధానులు ముందుకు వెళ్లకుండా ఐదేండ్లు కేసుల మీద కేసులు వేసి ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చారు. చివరికి విడిపోయి పదేండ్లయినా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని మటుకు ఏర్పడలేదు. ఇది ఎవరి పాపం!
ఆంధ్ర ప్రజలకు ఇంకో అపోహ ఉన్నది. అది తొలగిపోవాలి. వారి నాయకులు ఆంధ్రా నుంచి నిధులు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని మేధావులు అనుకునేవాళ్లు కూడా మాట్లాడతారు. నిజానికి హైదరాబాద్‌లో తెలంగాణ నిధులతో ఆంధ్రా నాయకులు, వ్యాపారస్థులు కోటీశ్వరులు అయ్యారు. అంతేకానీ, తెలంగాణకు వారు చేసిందేమీ లేదు. హైదరాబాద్ నగరం 400 ఏండ్ల నుంచీ ప్రపంచంలోనే ఐదవ అద్భుత నగరంగా ఉన్నది. పైగా ఉమ్మడి రాష్ట్ర ఆదాయం చూసినా ఈ విషయం అర్థమవుతుంది. తెలంగాణ జిల్లాల ఆదాయం 66 శాతం, హైదరాబాద్ ఆదాయం 10 శాతం కలిపి ఈ ప్రాంతం 1957 నుంచి 2014 దాకా రాష్ర్టానికి 76 శాతం ఆదాయాన్నిచ్చింది. ఆంధ్రా ప్రాంతం 17 శాతం, రాయలసీమ 7 శాతం ఆదాయాన్నిచ్చాయి. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలే. మరి ఎవరి సొమ్ము ఎవరు తిన్నారు? ఆంధ్రా ప్రజలు వారి నాయకులను అడగాల్సిన ప్రశ్న ఇది. ఇరవై ఏడున్నరేండ్లు రాయలసీమ ప్రాంతం వారు, ఇరవై నాలుగున్నరేండ్లు ఆంధ్రా ప్రాంతం వారు ముఖ్యమంత్రులుగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండు ప్రాంతాల నగరాలను ఎందుకు హైదరాబాద్ లాగా తయారుచేయలేదు? అని. ఈ ఆదాయమంతా ఏమైంది? అని.
ఇక ఇప్పుడు ఆంధ్రా రాజధాని విషయానికి వస్తే.. చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉండవచ్చు. 46 ఏండ్ల అనుభవంతో కేసీఆర్‌ను మించిన అద్భుతాలు చేయవచ్చు. కేసీఆర్ 650 మీటర్ల ఎత్తుకి నదీజలాలు తీసుకెళ్లగలిగిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినప్పుడు.. ఆయన గురువునని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు బహుశా 650 మీటర్లు భూమి అడుగున రాజధానిని నిర్మిస్తారేమో! అప్పుడు పైన నీళ్లున్నా సబ్మెరైన్లలో అమరావతికి చేరుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఆశ్చర్యపోయిన అమెరికా శాస్త్రజ్ఞులు.. ద్వారకా నగరం ఇప్పుడున్నట్టు నీళ్ల కింద ఉన్న అద్భుత అమరావతిని చూసి మూర్ఛపోతారేమో! ఎవరు చూశారు!
– కనకదుర్గ దంటు
89772 43484