పరాయి పాలనలో విధ్వంసమైన తెలంగాణ ‘పల్ల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోనా.., నా పంట చేలలోనా!’ అంటూ విషాదగీతం పాడుకున్నది. నీళ్లు లేక, కరెంటు రాక బీళ్లుగా మారిన భూములను చూసి రైతన్న పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వలసబాట పట్టిండు. పద్నాలుగేండ్ల పోరాట ఫలితంగా తెలంగాణ స్వప్నం సిద్ధించింది. పరాయి పాలనలో దండుగన్న వ్యవసాయం స్వపరిపాలనలో ఒక్కసారిగా పండుగైంది. వలసలు పోయిన రైతాంగం తమ తమ ఊళ్లకు తిరుగు పయనమైంది. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎక్కడ చూసినా ‘భూమికి పచ్చాని రంగేసినట్టు…’ పచ్చగా కళకళలాడింది.
దండుగన్న ఎవుసం సంకురాత్రి పండుగైంది పల్లేర్లు మొలిచిన భూములు పచ్చని చీర కట్టుకున్నయ్ ఆకలికి ఏడ్చిన కడుపులు.. అన్నం బెట్టే అక్షయ పాత్రలైనయ్ ఉపాధి లేక వలసబాట పట్టి బిక్కచచ్చిన ముఖాలు.. చేతినిండా పనితో మూడుంగాలాల కైకిలితో నవ్వినయ్ నిరంతరాయ ఉచిత కరెంటుతో పదేండ్ల తెలంగాణలో పచ్చని పల్లెలు ధాన్యరాశుల గుట్టలుగా మారిన వైనమిది 2 కోట్ల ఎకరాల మాగాణంగా తెలంగాణ మారిన చరిత్ర ఇది..
2014 కంటే ముందు తెలంగాణలో ఎటుచూసినా బీడు భూములే. కరెంటు కోతలతో పంటపొలాలు నీళ్లులేక ఎండిపోయేవి. క్షామంతో ఏకంగా పల్లెలకు పల్లెలే వలసబాట పట్టేవి. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే నా తెలంగాణలోనా..!’ అంటూ ఎక్కడ చూసినా విషాద గీతాలే వినిపించేవి. రాష్ట్ర జనాభాలో దాదాపు 70 శాతానికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇది తెలిసినప్పటికీ ‘ఎవుసం దండుగ’ అన్నట్టుగా సమైక్య పాలకులు వ్యవహరించారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు, వలసలు. అయితే, 2014లో ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సాగు రంగంపై అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వానల మీదనే ఆధారపడి పంటలు పండించే తెలంగాణ రైతన్నలకు సాగుకు అవసరమైన కరెంటును ఇస్తేనే, ఎవుసం పండుగైతదని సంకల్పించారు. తొమ్మిదిన్నరేండ్లలో అదే చేసి చూపించారు. అలా బువ్వ కోసం పక్క చూపులు చూసే ఒకప్పటి తెలంగాణ.. 2 కోట్ల ఎకరాల మాగాణంగా మారింది.
బీడు భూములకు జలకళ: తెలంగాణ రైతులకు సాగు సవాళ్లతో కూడుకొన్న వ్యవహారం. వానకాలంలో వర్షాలు పడితేనే పంటలు సాగయ్యేవి. యాసంగిలో భూములన్నీ బీడుగానే ఉండేవి. కరెంటు కోతలతో సరైన సాగునీటి వసతి లేకపోవడంతో తెలంగాణ కరువుకు చిరునామాగా ఉండేది. తెలంగాణ సాకారమయ్యాక, అప్పటి సీఎం కేసీఆర్ సాగునీటి గోస తీర్చడంపై దృష్టి సారించారు. ముందుగా కోతలనేవే లేకుండా వ్యవసాయానికి అవసరమైన కరెంటును ఇవ్వాలని ప్రతినబూనారు. అత్యంత ప్రయాసకోర్చి రాష్ర్టాన్ని, రైతులను విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కించారు. 2016 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును, 2018 జనవరి 1 నుంచి 24 గంటల ఉచిత విద్యుత్తును సాగు కోసం ప్రభుత్వం నిరంతరాయంగా సరఫరా చేసింది. ఇందుకోసం ఏటా రూ. 5 వేల కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించింది. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం ఫలాలు వెరసి బీడు భూములకు జలకళ వచ్చింది. దీంతో 2014-15లో యాసంగి, వానకాలం కలిపి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదనంగా ఏటా 15-20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి.

77 ఏండ్ల స్వత్ంరత్ర భారతంలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగు విస్తీర్ణం 6.7 శాతం కాగా.. కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం 60 శాతం.
గుట్టలుగా ధాన్యపు రాశులు: తినడానికి సరిపడా పంట పండితే చాలనుకొన్న ఒకప్పటి తెలంగాణ.. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. సాగు రంగానికి కేసీఆర్ సర్కారు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయడమే దీనికి ప్రధాన కారణం. ఉచిత విద్యుత్తుతో సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎకరాలకు పైగా పెరిగింది. దీంతో ధాన్యం రాశులు పల్లెల్లో రోడ్ల మీద గుట్టలుగా దర్శనమిచ్చాయి. 2014కు ముందు ధాన్యం కొనుగోళ్లలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు పంజాబ్‌తో పోటీ పడుతూ అగ్రస్థానానికి ఎగబాకింది. 2014లో రాష్ట్రంలో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2023 నాటికి ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ విషయంలో దేశంలో రాష్ట్ర వాటా 14 శాతం. 2014-15లో వరి సాగు రెండు సీజన్లలో కేవలం 34.98 లక్షల ఎకరాల్లో సాగయితే, 2022-23లో ఏకంగా 1.21 కోట్ల ఎకరాల్లో సాగైంది. ఇది రికార్డు.

కేసీఆర్ ప్రభుత్వం లాగా సాగుపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారిస్తే, వచ్చే ఇరవై ఏండ్లకు సరిపడా ధాన్యరాశులను ఒక్క ఏడాదిలోనే పండించే స్థాయికి భారత్ చేరుకొంటుంది.
వలసపోయిన పల్లెలు ఇప్పుడు ఉంటేగా!: కేసీఆర్ హయాంలో సాగు రంగానికి తగినంత విద్యుత్తు సరఫరాతో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. దీంతో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెను, ఎవుసాన్ని విడిచి వెళ్లిన రైతులు తిరిగి పల్లెలకు చేరుకున్నారు. ఒకనాడు వలసపోయిన తెలంగాణ పల్లెలకే ఇతర రాష్ర్టాల కూలీలు వలస వచ్చారు. 2011 లెక్కల ప్రకారం.. తెలంగాణలో దాదాపు 31 లక్షల మంది సాగుదారులు ఉండగా.. 30-40 లక్షల మందికి పైగా వ్యవసాయ కూలీలున్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలో వ్యవసాయ సీజన్లో నికరంగా 120-180 రోజులకు మించి పనులు ఉండేవి కావు. అయితే, 2014 తర్వాత పంటలు దండిగా పండి కూలీలకు 300 రోజులకు పైగా పనులు దొరికాయి. దీంతో ఒకప్పటి వలసల తెలంగాణ.. దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా మాత్రమే కాదు, వ్యవసాయ కూలీలను ఆదుకొన్న కల్పవల్లిగానూ మారింది.
2014లో..1.31 కోట్ల ఎకరాలు
2023లో..2.09 కోట్ల ఎకరాలు
పెరుగుదల..60 శాతం

– ఎడిటోరియల్ డెస్క్