తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ ఉపన్యాసాలు ఉద్యమంపై ఎంత ప్రభావం చూపాయో, తెలంగాణ సాధనలో ఆయన మౌనం కూడా అంతటి ప్రభావం చూపించింది. ఇప్పుడు అదే తరహాలో కేసీఆర్ మౌనం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని భయపెడుతున్నది. కేసీఆర్ మౌనాన్ని ఇపుడు రేవంత్ తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్‌ను బూతులతో తిట్టడం ద్వారా, ఆయన చావును కోరుకోవడం ద్వారా సీఎం తరచూ తన అల్పబుద్ధిని బయటపెట్టుకుంటున్నారు. ఎన్ని రకాలుగా తన కురుచబుద్ధిని ప్రదర్శిస్తున్నా అందుకు కేసీఆర్ సమాధానం చెప్పకపోవడంతో ఆయనలో మరింత అసహనం పెరుగుతున్నది.
భారతీయ ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీష్ తన ఉపన్యాసాల్లో మౌనంగా ఉండడం నేర్చుకోండి (చుప్ రహనా సీఖో) అనే మాటలు కేసీఆర్ మౌనానికి, అతిగా మాట్లాడే రేవంత్‌రెడ్డి అల్పత్వానికి సరిగ్గా సరిపోతాయి. మౌనం మీద, ఎక్కువగా మాట్లాడడం మీద సాధారణంగా ఉండే అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలను తన ఉపన్యాసాల్లో ఓషో ఎంతో చక్కగా వివరించేవారు. మౌనంగా ఉండడం నేర్చుకున్నవారే విజయం సాధిస్తారు. ప్రపంచాన్ని పాలించేది లొడలొడమని ఎక్కువగా మాట్లాడేవారు కాదు.. ‘మౌనంగా ఉండేవాళ్లే ప్రపంచాన్ని పాలిస్తారు. ఎక్కువగా మాట్లాడేవారు తమ రహస్యాలను బయటపెడుతారు.
సహజంగా వీరి బుర్ర ఖాళీగా ఉంటుంది. మౌనంగా ఉండేవాళ్లు రహస్యంగా మారుతారు. సాధారణంగా మనుషులకు ఉండే అతి పెద్ద భ్రమ ‘నేను మాట్లాడకపోతే ప్రజలు నన్ను బలహీనుడిగా భావిస్తారు’ అని అనుకుంటారు. కానీ సత్యం దీనికి భిన్నమైనది. ‘బలహీనుడు తనను తాను నిరూపించుకోవడానికి ఎక్కువగా మాట్లాడుతాడు. శక్తివంతుడు మౌనంగా ఉంటాడు. అతనికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ ఇలా సాగుతుంది ఓషో ఉపన్యాసం. కేసీఆర్ మౌనాన్ని బూతుల ద్వారా రెచ్చగొట్టడానికి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ఓషో ఉపన్యాసం అక్షర సత్యం అనిపిస్తుంది.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు ఒకసారి శాసన సభలో చంద్రబాబుపై వ్యంగ్యాస్ర్తాలు విసురుతూ..‘భయపడేవారంతా నా చుట్టూ చేరండి’ అన్నాడట వెనుకటికొకరు. నిజానికి అందరికన్నా ఎక్కువ భయపడుతున్నది ఆయనే.
ఇపుడు బాబే ఎక్కువ భయపడుతూ అదే మాట అంటున్నారని వైఎస్సార్ వ్యంగ్యోక్తి విసిరారు. సరిగ్గా ఇప్పుడు కూడా రేవంత్‌రెడ్డి అదే చేస్తున్నారు. సీఎం పదవి చేపట్టినా ఆ స్థాయి హుందాతనం ఆయనలో కొరవడింది. అదేదో ఇపుడే మొదలైందని కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రేవంత్‌రెడ్డి సీఎం కాగానే అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి తనను అభినందించలేదని గతంలో విలేకరుల సమావేశంలోనే ఆయన చెప్పుకొచ్చారు. జగన్ అభినందించారో లేదో తెలియదు కానీ ఒక సీఎం వంటి ఉన్నత పదవిలో ఉంటూ వాళ్లు అభినందించలేదు.. వీళ్లు అభినందించలేదని వాపోవడం విచిత్రం. ఒక కార్పొరేటర్ కూడా ఈ స్థాయిలా మాట్లాడరేమో. తన ఇంట్లో కేసీఆర్ జారిపడి చికిత్స పొందుతుంటే రేవంత్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి..రాహుల్ గాంధీ వెళ్లమంటే వెళ్లానని చెప్పడం అంటే ఎంతటి కురుచబుద్ధో స్పష్టమవుతుంది. కేసీఆర్‌ను ఎలాగైనా రెచ్చగొట్టి అసెంబ్లీకి వచ్చేట్టు చేసి అవమానించాలనే వ్యూహం రేవంత్ మాటల్లో ఎప్పుడూ కనిపిస్తున్నది. ప్రతి సమావేశంలో తాను తిడుతున్నా కేసీఆర్ తిరిగి తిట్టకపోవడంతో రేవంత్‌రెడ్డిలో రోజురోజుకూ అసహనం పెరుగుతున్నది. ఆ అసహనంతోనే ఆయన మరింతగా కేసీఆర్‌ను ఇష్టారీతిన బూతులు తిడుతున్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం పదవి చేపట్టిన కొత్తలో కేసీఆర్‌ను ఉద్దేశించి తిట్టిన తిట్లు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. సీఎం స్థాయిలో ఉండి, గతంలో ఎవరూ అలా బూతులు మాట్లాడకపోవడం వల్ల రేవంత్ వల్లెవేసే బూతులు రాజకీయ నాయకులకే కాకుండా అధికారులకు సైతం మొదట్లో ఆశ్చర్యం కలిగించాయి. ఇప్పుడు ప్రతి సమావేశంలోనూ ఇవే బూతులు ప్రారంభ గీతంగా మారడంతో అంతా అలవాటుపడిపోయారు. ఇపుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే బాధిత ప్రజలు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు మాత్రం ఆయన బూతులను మించి బూతులతో ఆయన్నే తిడుతున్నారు.
రెండున్నరేండ్ల నుంచి రేవంత్‌రెడ్డి ఎన్ని బూతులు తిడుతున్నా కేసీఆర్ నుంచి మౌనమే సమాధానం వస్తున్నది. రాజకీయాలు అంటే నోటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రేవంత్ రాజకీయాల్లో ఎదిగింది కూడా నోటితోనే. ఆయన అలా బూతులు తిడుతుంటే..మౌనంగా ఉండే బీఆర్ఎస్ శ్రేణులు డీలాపడిపోతారనే వాదనలోనూ వాస్తవం ఉన్నది. ఆ విషయాన్ని గ్రహించే రేవంత్ బూతులకు అదే స్థాయిలో కేటీఆర్ సమాధానం చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ నోరు జారే వారు కాదు. కానీ ఆ పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, నన్నపనేని రాజకుమారి, వర్ల రామయ్య లాంటి వారిని కామన్‌గా అందరినీ తిట్టడానికి ప్రయోగించేవారు. ప్రత్యేకంగా రెడ్డి నాయకులను తిట్టేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రయోగించేవారు. తెలంగాణ నాయకులను, అన్నివర్గాల వారిని తిట్టేందుకు తొలుత రోజాకు టీడీపీనే తగిన శిక్షణ, ప్రోత్సాహం అందించింది. టీడీపీ ప్రయోగించిన రోజా అనే ఆయుధం చివరకు వారిపైనే తిరగబడింది.
మోత్కుపల్లి నర్సింహులు, వర్ల రామయ్య, నన్నపనేని రాజకుమారి వంటివారు పోషించిన పాత్రను రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్వయంగా రేవంత్‌రెడ్డి పోషిస్తున్నారు. అదే స్థాయిలో కేటీఆర్ ఆయనకు బదులిస్తున్నారు. రేవంత్ బూతు పురాణంతో తమ వ్యూహం ఫలించిందని మొదట్లో కొందరు కాంగ్రెస్ నాయకులు సంబురపడ్డారు. అయితే, రెండున్నరేండ్ల పాలనా కాలం ముగిసిన తరువాత కూడా అవే తిట్లను నమ్ముకోవడం ప్రయోజనం లేదని, ప్రజలు హామీల అమలు కోరుతున్నారని పలువురు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ‘పాములు పట్టేవాడు పాము కాటుకే పోయాడు’ అనే సామెత మాదిరిగా బూతులతో కాలం వెళ్లదీద్దాం అనుకున్న రేవంత్‌రెడ్డికి అవే బూతులతో ప్రజలు తగిన సమాధానం చెప్తున్నారు.
– బుద్దా మురళి