ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం. ఒక ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను తర్వాతి ప్రభుత్వం కొనసాగించడం, పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయడం కూడా సర్వసాధారణం. కానీ, ఆ అభివృద్ధి వెనుక ఉన్న అసలు సూత్రధారులను, వారి దార్శనికతను విస్మరించి, కేవలం రిబ్బన్ కటింగ్ చేసి తామేదో ఘనకార్యం సాధించినట్టు ప్రచారం చేసుకోవడం నైతిక దివాళాకోరుతనమే అవుతుంది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించిన రూ.వందల కోట్ల విలువైన అభివృద్ధి పనుల విషయంలో జరుగుతున్నది ఇదే.
ముఖ్యమంత్రి రేవంత్ నూతన భవనాలకు రిబ్బన్లు కత్తిరించి, శిలాఫలకాలను ఆవిష్కరించి తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకొన్నారు. కానీ, ఆ రంగులద్దిన గోడల వెనుక, ఆ శిలాఫలకాల కింద బీఆర్ఎస్ ప్రభుత్వ దార్శనికత, కేసీఆర్ మార్క్ పాలన, వందల కోట్ల నిధుల కేటాయింపుల చెరగని సంతకం దాగి ఉన్నదన్న వాస్తవాన్ని ఎంతకాలం దాచగలరు?
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఓయూ గుండెకాయ వంటిది. ఇక్కడి విద్యార్థుల త్యాగాలు, పోరాటాల పునాదులపైనే స్వరాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమగడ్డ, ఎందరో మేధావులను దేశానికి అందించిన ఓయూను ఉన్నత విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వందల కోట్లను కేటాయించింది. ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఓయూ రుణం తీర్చుకోవాలని, యూనివర్సిటీ పూర్వ వైభవానికి బాటలు వేయాలని బలంగా సంకల్పించారు. అది మాటలకే పరిమితం కాలేదు, పక్కా ప్రణాళికతో కూడిన ఆచరణగా మారింది. అందులో భాగంగానే యూనివర్సిటీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మౌలిక వసతుల కల్పనకు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతీ నిర్మాణం ఆ యజ్ఞంలోంచి పుట్టినదే.
కేసీఆర్ ముందుచూపు, కేటీఆర్ చొరవతో ఓయూలో మౌలిక వసతుల కల్పనకు పటిష్ఠమైన ప్రణాళికలు రచించారు. ఇంజినీరింగ్ కాలేజీలో రూ.39.50 కోట్లతో బాలుర హాస్టల్, సైఫాబాద్ క్యాంపస్లో మహిళల వసతి, అదనపు తరగతి గదుల కోసం రూ.5 కోట్లు, శతాబ్ది ఉత్సవాల గుర్తుగా ఏకంగా రూ.55 కోట్లతో నిర్మిస్తున్న పరిపాలనా భవనం.. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే మంజూరయ్యాయి. కేవలం కాగితాలపై ఆమోదం తెలపడమే కాదు, అవసరమైన నిధులను కేటాయించి, టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, పనులను పరుగులు పెట్టించారు. అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రొ.రవీందర్ యాదవ్ పర్యవేక్షణలో ఈ పనులన్నీ దాదాపు పూర్తికావచ్చాయి.
ఈ వాస్తవాలన్నీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రికార్డుల్లో, బడ్జెట్ ఉత్తర్వుల్లో స్పష్టంగా నమోదై ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రారంభోత్సవాలు చేస్తున్న ప్రాజెక్టుల పుట్టుక, ప్రస్థానం మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. యూనివర్సిటీ అధికారిక రికార్డులే ఇందుకు తిరుగులేని సాక్ష్యాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, గతంలోనే పూర్తయిన ఆ భవనాలకు చివరి మెరుగులు దిద్ది, ప్రారంభోత్సవాలు చేసి, ఆ ఘనత అంతా తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం విడ్డూరంగా ఉన్నది.
ప్రభుత్వం ఏదైనా ప్రజలకు పనికివచ్చే ప్రారంభోత్సవాలను స్వాగతించాల్సిందే. కానీ, అదే సమయంలో ప్రభుత్వాల కొనసాగింపును కూడా గౌరవించాలి. గత ప్రభుత్వ కృషిని గుర్తించి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పాలకుల బాధ్యత. దానికి బదులుగా, వాస్తవాలను వక్రీకరించి, ఒకరి కష్టాన్ని మరొకరు తమదిగా ప్రచారం చేసుకోవడం రాజకీయ దురుద్దేశాలను సూచిస్తుంది. ఓయూ గోడలు, అక్కడ రూపుదిద్దుకున్న ప్రతీ నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ దార్శనికతకు, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుపై కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి నిలువుటద్దం పడుతున్నాయి. చరిత్రను ఎవరూ చెరిపేయలేరు. ఈ అభివృద్ధి వెనుక ఉన్న అసలు ఘనత ఎవరిదో ప్రజలకు తెలుసు.
– డాక్టర్ మహేష్ మాణిక్య ముదిరాజ్