Revanth Reddy | కేసీఆర్ నిలబడుతడు… కలబడుతడు… రేవంత్ నువ్వు మాట మీద నిలబడు… బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు రావాలంటూ చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పారు. తీరా కేసీఆర్ బయటకు వస్తే ఆ పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దల గుండెల్లో గుబులు మొదలైంది. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని, తెలంగాణను రక్షించేది గులాబీ జెండానే అని కార్యకర్తలను ఉత్సాహపరిచేలా ప్రసంగించారు.
ఈ వ్యాఖ్యలను తట్టుకోలేని ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలోనే కేసీఆర్‌పై దూషణకు దిగారు. కేసీఆర్ వయసును, ఆయనకు జరిగిన ప్రమాదాన్ని, అయిన గాయాన్ని అవహేళన చేసేలా మాట్లాడారు. కట్టె లేకుండా సరిగ్గా నిలబడాలని దురహంకారంతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంబోతుల్లాగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.
పద్నాలుగేండ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్, పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన సేవలు, ఆయన వయసు, శారీరక స్థితిపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి… ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తెలంగాణ సమాజాన్ని నివ్వెరపర్చాయి. కేసీఆర్ దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో గాయపడ్డారు. దాన్ని కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవాలన్న రేవంత్‌రెడ్డి సంకుచిత మనస్తత్వాన్ని కచ్చితంగా నిరసించాల్సిందే.
స్టీఫెన్ హాకింగ్ లాంటి వ్యక్తులు తమలోని లోపాలను అధిగమించి ఎన్నో విజయాలు సాధించారు. 21 ఏండ్ల వయసులోనే తీవ్ర శారీరక సమస్యలు ఎదుర్కొన్న ఆయన బ్లాక్‌హోల్ లాంటి అంతుచిక్కని సిద్ధాంతాలను వివరించారన్న విషయం రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లకు తెలిసి ఉండదు. ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న నెల్సన్ మండేలా లాంటివాళ్లు దివ్యాంగుల హక్కుల కోసం పోరాడి నోబెల్ శాంతి బహుమతి పొందారు. ఒక వ్యక్తి విజయాలు సాధించటానికి తనదైన రంగంలో కృషి చేయటానికి శారీరక సమస్యలు అడ్డం కావన్న విషయాన్ని రేవంత్ రెడ్డి లాంటి సంకుచిత వ్యక్తులు గుర్తుంచుకోవాలి.
ముందు కట్టె సాయంతో నిల్చోవాలని సూచన చేసిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏ మాత్రం లేదు. పద్నాలుగేండ్లు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని కోరుకొని ఏ మాత్రం హింస లేకుండా రాష్ర్టాన్ని తీసుకువచ్చిన వ్యక్తి కేసీఆర్. టీడీపీలో ఉన్నప్పుడు కండబలం, ధనబలంతో విర్రవీగిన రేవంత్‌రెడ్డి, కరీంనగర్ సభకు తుపాకీని తీసుకువెళ్లారు. ఓటుకు నోటు కేసులో ఒక ఎమ్మెల్సీని కొనటానికి కోట్ల రూపాయలు మోసుకెళ్లారు. ఇలాంటి అక్రమాలు, అవినీతి పనులు చేయటానికి శారీరక శక్తి సామర్థ్యాలు అవసరమేమో కానీ, ఒక సిద్ధాంతాన్ని, భావజాలాన్ని, కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి కండబలం ఎందుకు, బుద్ధి బలం ఉంటే చాలదా?
అంతెందుకు తెలంగాణ నుంచి జాతీయస్థాయికి ఎదిగిన జైపాల్‌రెడ్డి లాంటి నాయకులు తాము చేపట్టిన పదవులకు వన్నె తీసుకువచ్చారు. కార్పొరేట్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గకుండా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు. మృదుస్వభావి, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గుర్తించకపోవచ్చు. కానీ, తెలంగాణ సమాజం ఆయన చేసిన కృషిని మరిచిపోదు. ఆయనకు ఉన్న శారీరక లోపాన్ని సవాలుగా తీసుకొని పల్లె నుంచి ఢిల్లీ వరకూ ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు జైపాల్‌రెడ్డి. 18 నెలల వయసులోనే పోలియో లాంటి మహమ్మారిని ఎదుర్కొని కూడా ఆయన ఏ మాత్రం చలించలేదు. ఇది ఆయన రాజకీయ జీవన ఆరోహణకు ఎన్నడూ అవరోధం కాలేకపోయింది. అసలు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దక్షిణాది నుంచి ఎన్నికైన తొలి ఎంపీ జైపాల్‌రెడ్డి. రేవంత్ రెడ్డికి ప్రపంచ విషయాల మీద అవగాహన లేకపోయినా పర్లేదు కనీసం ఆయన తన కుటుంబంలో నుంచే శారీరక లోపాలను ఎదురించి గొప్పనేతగా మారిన జైపాల్ రెడ్డి గురించి విస్మరించినట్టు కనిపిస్తున్నది.
కమ్యూనిస్టు పార్టీకి చెందిన డి.రాజా వినికిడి సమస్య ఉన్నప్పటికి దేశంలోనే అగ్రగామి కమ్యూనిస్టుగా తనను తాను మలుచుకున్నారు. సుమిత్రా మహాజన్ లాంటి వాళ్లకు కంటి చూపులో ఇబ్బంది ఉన్నప్పటికీ స్పీకర్‌గా తన వంతు పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన శ్యామ్ చరణ్ గుప్తా స్థానిక సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన నందిని సత్పతి శుక్లాల సమస్యతో పోరాడి మరీ గొప్ప పాలన అందించారు. సుమారు పదేండ్ల పాటు చక్రాల కుర్చీలోనే ఉండి తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు కరుణానిధి.
అసలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతీరంగంలోనూ దివ్యాంగులు, శారీరక సమస్యలు ఉన్నవాళ్లు ఎన్నో విజయాలు సాధించారు. ఇలా తెలంగాణలోనూ, దేశంలోనూ చాలామంది శారీరక లోపాలను ఎదిరించి, నిలిచి, గెలిచారు. వాళ్లందరిని ముఖ్యమంత్రి తన మాటలతో అవమానించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలపై నిలబడని రేవంత్‌రెడ్డి మిగతావాళ్లు నిలబడినప్పుడు మాత్రమే మాట్లాడాలనటం విడ్డూరం.
ముఖ్యమంత్రి పదవి స్థాయి మరిచి రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని పౌర సమాజం తప్పక ఖండించాలి. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఆయన దివ్యాంగులకు, అల్పసంఖ్యాక వర్గాలకు తోడ్పాటు అందించాల్సింది పోయి, ఓ వ్యక్తికి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనను రాజకీయ విమర్శలకు వాడుకోవటం తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఇప్పటికైనా ఆయన కేసీఆర్ శారీరక స్థితిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ కోరాలి.
-బాల్క సుమన్
చెన్నూరు మాజీ శాసనసభ్యులు