తెలంగాణలో ప్రస్తుత పాలకులు, ముఖ్యంగా ముఖ్య మంత్రి.. ‘లేదు, కాదు, చెయ్యలేం, ఏం చేయమంటరో మీరే చెప్పండి’ అనే మాటలను పదే పదే చెప్తున్నారు. ఎవరైనా, ఏదైనా మీ ఇంట్లో ఉందా? అని అడిగితే లేదని వెంటనే చెప్పవద్దు. ఎందుకంటే, ‘పైన తథాస్తు దేవతలు ఉంటరు, ఆ వస్తువు మనకు ఎప్పటికీ దొరకకుండాపోయే అవకాశం ఉంటది’ అని మా చిన్నప్పుడు చెప్పేవారు. మా ఇంట్లోవాళ్లు మాకు నేర్పిన సంస్కారం ఇది. దాన్నే మనిషికి నియత్ ఉండాలి, అప్పుడే బర్కత్ ఉంటదని పెద్దవారు ఇప్పటికీ చెప్తుంటారు. దుకాణాల్లో మనం అడిగిన వస్తువు లేకుంటే చటుక్కున లేదని చెప్పరు. అంతకన్నా మంచి బ్రాండ్ అనో, ఇంకేదో కొత్త కంపెనీ అనో చెప్పి మనల్ని మచ్చిక చేసుకుంటరు.
మనలో కొంతమంది దురాశకు పోవడం వల్ల ఇప్పుడు అందరూ ఎన్నో అవస్థలు పడాల్సి వస్తున్నది. అరుపులు, తిట్లు కొందరి మీద ఒక మత్తులాగా పని చేశాయి. అన్ని హామీలు చేస్తడని నమ్మి, బొక్కబోర్లా పడుడు అయ్యింది. జ్ఞానోదయం కలిగించి సార్ల నిజస్వరూప దర్శనం వెంటవెంటనే కావడంతో మింగలేక కక్కలేక ఉన్నం. ఏదో వెలగబెడ్తడని పెద్ద కుర్చీలో కూర్చోబెడితే సందర్భం ఏదైనా ‘ఖజానాలో లంకె బిందెలు ఉన్నాయనుకున్న. ఖాళీగా ఉంది. లాగులు, తొండలు, పేగులు చీరి మెళ్లో వేసుకుంటా. అందర్నీ తొక్కుకుంటూ వచ్చిన. ఉట్టిగ రాలే’ అంటూ పూనకాలే పూనకాలు. ‘ప్రేమనగర్’ సినిమాలో పాట లాగా ‘తాగితే మర్చిపోగలను తాగనివ్వదు, మర్చిపోతే తాగగలను మరువనివ్వదు’ అన్నట్టు కేసీఆర్ ఆనవాళ్లు నిద్ర లేకుండా చేస్తున్నయి కొత్త ప్రభుత్వానికి. కేసీఆర్ను మర్చిపోలేకుండా చేస్తున్నయి.
విద్యావ్యవస్థ మళ్లీ ప్రైవేట్పరంగా, కరెంట్ కోతలు విచ్చలవిడిగా, ఫ్రీ బస్సు ప్రయాణ అవస్థలైతే చెప్పే పనే లేదు. అన్ని ప్రాంతాలకు సాధారణ బస్సుల సంఖ్య కుదించారు. ప్రజల బాధలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేల భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. కమీషన్ల కోసమే కదా ఎవరైనా పని చేసేదని ఒకరు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో అంతసేపు నోరెళ్లబెట్టి విన్నా కూడా, స్వయంగా కోర్టులే కాళేశ్వరం ఒక మంచి ప్రాజెక్టు అని, దాని వల్లనే ధాన్యం సాగులో తెలంగాణకు దేశంలో పేరొచ్చిందని చెప్పినా వారికి పట్టింపులేదు. ‘ఉమ్మడి పాలనలో ఎటూ లేవు మంచి పనులు. కనీసం బీఆర్ఎస్ వచ్చాక పచ్చగా అయినాయి పొలాలు’ అన్న మాట కాంగ్రెస్ నోట రానేరాదు.ఇక తిట్ల దండకం సరేసరి. పాత ప్రభుత్వ పాలనా విధానాన్ని కొనసాగిస్తే అయిపోవు ఇప్పటి కాంగ్రెస్ వాళ్లు. ఎందుకంటే అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు అన్ని సుద్రాయించే ఉన్నయ్. అధికారులు, మంత్రులు సమన్వయంతో వాటిని సరిచూసుకుంటే ఇంకా కొత్త కొత్త పనులు చేసేంత సమ యం ఉండే ఇప్పటి ప్రభుత్వానికి.
రైతుల సంగతి రోజూ చూస్తూనే ఉన్నం. ఒకరిద్దరు ప్రతి దినం బలవంతపు చావులు చస్తున్నరు. ఎంత బాధాకరం. మాట్లాడుకుం టూపోతే ఈ ప్రభుత్వం దౌర్జన్యాలే ఎక్కువై ప్రజాప్ర యోజనాలు వేళ్ల మీద కూడా లెక్క బెట్టలేం. ఇక మీదనన్న ఇట్లాంటి పొరపాటు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.
– బి.అనసూయ