తెలంగాణ ఉద్యమంలో టన్నులకొద్దీ మందుగుండు దట్టించి పేల్చిన ఫిరంగి లాంటి నినాదం ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’! ఆ నినాదపు పరమార్థం ఉద్యమ నాయకుని ఉక్కు సంకల్ప ప్రకటనో; ఫలసిద్ధి అనంతరం నాయకునికీ, పార్టీకీ దక్కబోయే కీర్తియో; ఇతర సంకుచిత ప్రయోజనాలో కాదు! దశాబ్దాలుగా పరాయి పాలన ప్రసాదించిన వివక్షకు బలై, అన్యాయాలపాలై, అవమానాలకు లోనై; సొంత నాయకుల మోసాలకు గురై, ఆశలు ఆవిరై, నీరుగారి ఉన్న తెలంగాణ ప్రజానీకం ఒక అచ్చమైన, స్వచ్ఛమైన ఉత్తేజం పొంది; కచ్చితంగా ముద్దాడి తీరబోయే లక్ష్యం పట్ల మొక్కవోని దీక్షతో యుద్ధానికి సిద్ధమైన తరుణంలో వచ్చిన పాంచజన్య శంఖపు పూరింపు ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’! రణన్నినాదం!
ఈ సాయంత్రం జరుగబోయే ఎల్కతుర్తి సభలో ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఇచ్చే డైరెక్షన్ పట్ల తెలంగాణకు ఒక ఎరుక ఉన్నది, ఆశా ఉన్నది. ఆయన వస్తే తప్ప బతుకు బాగుపడదని కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్ టైం పనిచేసి మరీ ప్రజలకు తెలియజెప్తున్నది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరపకుండా ఆపాలని నెలరోజుల పాటు వరంగల్‌లో సభలు, సమావేశాలు రద్దు అంటూ ఆర్డర్ పాస్ చేసినపుడే బీఆర్ఎస్ పాసైంది. ఆ పార్టీ వాల్ రైటింగ్స్‌ను కాంగ్రెస్ నాయకులు చెరిపివేస్తున్నపుడే జనం గుండెల్లో కేసీఆర్ పేరు మరింత లోతుగా ముద్రించుకుపోవడం మొదలైంది! తెలంగాణను దరిచేర్చగలిగేది ఒక్క కేసీఆరే అనే భావన యావత్ ప్రజానీకంలో బలంగా వ్యాపించింది. తటస్థులు సైతం ఈ ప్రభుత్వం ఎంత త్వరగా పోతే, అంత మంచిదనుకునే దశకు వచ్చిన్రు. కాబట్టే, ఇపుడు ‘కేసీఆర్ మళ్లొచ్చుడో, తెలంగాణ ఇక సచ్చుడో’ అనే నినాదం నాటి ఉద్యమ నినాదానికి సీక్వెల్‌గా మారుతున్నది.
కేసీఆర్ సమర్థ పాలకుడే కాదు, లోతైన ఆలోచనలున్న దార్శనిక నాయకుడు. పిల్లలను పొదివి కాపాడే తల్లి కోడిలా తెలంగాణను కాపాడుకున్నరు. తన నేలపై ఆయన ప్రేమ ఎనలేనిది. ఆయనకు రాజకీయాలు వ్యాపకం కాదు, టాస్క్! ‘కొంగులోనా దాచిపెట్టీ.. కొడుకుకిచ్చే ప్రేమ వేరూ…’ అనే బలగం సినిమా పాటలాగ, తెలంగాణే ఆయన బలగం! కడుపు కట్టుకొని, సంపద పెంచి, అందరికీ పంచే తండ్రి లాంటి నాయకుడు కేసీఆర్.
ఏడాదిన్నర పాలనాలేమితో తెలంగాణ వందేండ్లు వెనక్కుపోయింది. రాష్ట్ర ఆదాయం 40 శాతం మేర పడిపోయింది. అన్ని శాఖలూ వాటి మంత్రుల లాగానే పడకేసినయి. ఒక్క ఆబ్కారీ తప్ప ఆదాయం వచ్చే మార్గాలే లేకుండా పోయినయి. సంపద సృష్టించే సమర్థత లేదు; ‘వల్గర్ టు ది కోర్’ వ్యక్తిత్వంతో ఇంటా బయటా ఎవరూ గౌరవించే పరిస్థితి లేదు; గూండా గిరీ ‘గాంధీ’ భవన్ నుంచే సాగుతుండటం ఒక విరోధాభాస! నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు.
తెలంగాణ అస్తిత్వం, చైతన్యం అంటే అస్సలు స్పృహ లేని రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. జన బాహుళ్యం నుంచీ, పౌర సమాజం నుంచీ, న్యాయవ్యవస్థ నుంచీ ముప్పేట దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నరు. కంచ గచ్చిబౌలి, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో న్యాయస్థానాల తీవ్ర వ్యాఖ్యలకు సిగ్గూ శెరం ఉండి ఉంటే తలదించుకునేవారు!
గత అసెంబ్లీ ఎన్నికల ప్రసంగాల్లో కేసీఆర్ స్పష్టంగా ఒక మాట చెప్పిన్రు ‘నేను చెప్పిన అని మీరు నమ్మవలసిన పనిలేదు. మీ సొంత వివేచన చేయాలె’ అన్నరు. ఎందుకంటే ఆయనకు ధైర్యం. తను చెప్పేవి నిజాలు అని! ‘తప్పుడు హామీలు ఇవ్వను! సంపద పెంచుకుందాం, సంక్షేమం పంచుకుందాం. ఒక్కొక్కటిగా చేసుకుందాం, మీరు మాయలో పడకండి’ అని నెత్తీ నోరూ కొట్టుకున్నరు కేసీఆర్. అవన్నీ అధికారం కోసం, తన కుటుంబం కోసం అని ఆనాడు ఆడిపోసుకున్నవారు సైతం ఇప్పుడు ఆలోచిస్తున్నరు. మళ్లా కేసీఆర్ వస్తే తప్ప తెలంగాణ బతుకదంటూ నిర్ద్వంద్వంగా చెప్తున్నరు.
కేసీఆర్ అధికారం కోల్పోవడానికి వంద శాతం ప్రజల తప్పిదమే కారణమనడం లేదు. బీఆర్ఎస్ వైపు, అధినాయకుని వైపు, ప్రజా ప్రతినిధుల వైపు వేలెత్తి చూపించగల తప్పులు జరిగి ఉన్నయని చెప్పడానికి పార్టీ అభిమాని అయిన ఈ వ్యాసకర్తకు ఎలాంటి భేషజం లేదు. వాస్తవాలు మాట్లాడితే అధిష్ఠానానికి ఆగ్రహం వస్తుందన్న వెరపూ లేదు. ఎందుకంటే పెద్దాయన మనసు తెలుసు కనుక! అయితే, ఒక్క విషయం మాత్రం స్పష్టం. కేసీఆర్ తప్పులు చేసి ఉండవచ్చు కానీ, రేవంత్‌లా మోసగాడు మాత్రం కాదు. ఆయన తప్పులు సరిచేసుకోగలిగినవే కానీ, రేవంత్‌లా శాశ్వత నష్టం చేసేవి కాదు.
తెలంగాణలో నివసించే ఆంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ అభిమానులు గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం పనిచేసిన వారిలో కొందరు ఖమ్మం, హైదరాబాద్, ఆర్మూర్, అమెరికా నుంచి నాకు ఫోన్లు చేస్తున్నరు. కాంగ్రెస్‌ను గెలిపించినందుకు తాము చెంపలు వేసుకుంటున్నామని నిజాయితీగా చెప్తున్నరు. ఉన్న మాట ఉలుకు లేకుండా చెప్పాలంటే వారికి పార్టీలు, నాయకులు, కులాల కంటే కూడా అభివృద్ధి ముఖ్యం. ఇపుడు తమ సొంత కుటుంబాలే గోస పడుతుంటే వారు ఊరుకోలేకపోతున్నరు. కాబట్టి.. ప్రజలను రేవంత్ ప్రభుత్వం పెడుతున్న గోస తెలిసి కూడా కేసీఆర్‌పై నిత్య అసంతృప్తితో, నిరంతర ద్వేషంతో నేటికీ విషం చిమ్ముతున్న వర్గాలు నిద్ర నటించటం ఆపాలి, కండ్లు తెరవాలి.
తెలంగాణ ప్రజానీకానికి రెండు ముగింపు మాటలు: ఒక దార్శనిక నాయకుడు; ఇంతకు ముందెన్నడూ లేనంత అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం తన ప్రజలకు హక్కుగా దక్కించిన నికార్సయిన భూమిపుత్రుడు కేసీఆర్ 27న వరంగల్ రజతోత్సవ సభలో చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించాలి. ఆయన మాటల్లోని నిజాయితీని, తెలంగాణను తిరిగి నిలబెట్టుకోవాలన్న ఆయన దృఢచిత్తాన్ని ఒళ్లంతా కళ్లు చేసుకొని చూడాలి, చెవులు చేసుకుని వినాలి. ఇప్పుడు కుదేలైన తెలంగాణను ఆరు నూరైనా విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత బీఆర్ఎస్తో పాటు తమపైనా ఉన్నదని గ్రహించాలని తెలంగాణ బిడ్డలకు సవినయ మనవి! జై తెలంగాణ!
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల 90309 97371