అణచివేత చరిత్ర కావచ్చేమో కానీ, అభివృద్ధి చరిత్ర కారాదు, కానీయబోమన్నదే మొన్నటి ప్రజాసభలో తెలంగాణ సాధకుడు కేసీఆర్ నిండు గుండెతో పలికిన మాటల అంతరార్థం. పోరాడి గెలుచుకొని, బంగారంలా మలుచుకున్న తెలంగాణ పరిస్థితి మళ్లీ మన్నులబడ్డట్టవుతున్నదని చెప్పాలంటే ఆయన గొంతు గద్గదమైంది. తెలంగాణపై ఆయనకు ఉన్న ఈ ప్రేమే ఉద్యమ పార్టీ స్థాపనకు పురిగొల్పింది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో… మళ్లీ పాత కష్టాలనే కలబోసుకోవాల్సి రావడం బాధాకరమే అయినా, ‘తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించే వరకూ మనం పనిచేస్తూనే ఉండాలంటూ’… ఎల్కతుర్తి వేదిక సాక్షిగా ఆయన చేసిన మహా సంకల్పం, ఆ ప్రాంగణాన్ని గులాబీ వర్ణమయంగా మార్చిన లక్షలాది ప్రజానీకానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎనలేని భరోసానిచ్చింది. ఆనాడైనా, ఈనాడైనా ఉద్యమ జెండా, ఎజెండా ప్రజా సంక్షేమమేనని మరోసారి చాటిచెప్పింది.
సాధారణంగా అధికార పార్టీ సమావేశాలకు, ఎన్నికల ముందు జరిగే సభలకు పెద్ద ఎత్తున జనం తరలిరావడమన్నది మనం గమనిస్తాం. కానీ, ఒక పార్టీ పాతికేండ్ల పండుగకు జన జాతర అనగలిగేలా ప్రజానీకం పోటెత్తడం ఓ అరుదైన సన్నివేశం. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలి రావడానికి ఆ పార్టీ మీద ప్రేమ ఒక్కటే కారణం కాదు, ఆ పార్టీ అధినేత మీద ఉన్న విశ్వాసం కూడా కారణమే. ఆయన సాగించిన పోరాటాలు, సాధించిన విజయాల మీద భరోసా. కష్టమంటే కడుపులో పెట్టుకొని చూసుకునే, ఉద్యమం అంటే ఉరికొచ్చే జెండా ఉన్నదన్న ధైర్యం. మళ్లీ మొదటికొచ్చిన తెలంగాణ విషయంలో కేసీఆర్ ఏం ఆలోచన చేస్తున్నడో తెలుసుకోవాలన్న కుతూహలం.
ఇందులో ఒక్క నమ్మకమూ వమ్ము కాలేదు. వచ్చిన ఏ ఒక్కరి మనసూ చిన్నబుచ్చుకోలేదు. అప్పుడైనా ఇప్పుడైనా కేసీఆర్ తెలంగాణ కోసం ఆలోచిస్తడు, పాతికేండ్ల కిందటైనా ఈ రోజైనా ఉద్యమం అంటే బీఆర్ఎస్ పిడికిలి ఎత్తుతుందన్న విశ్వాసం ప్రతి ఒక్కరిలో కలిగించేలా సాగింది ఓరుగల్లులో పోరుబిడ్డ ప్రసంగం. అవును, అక్కడున్నది కేసీఆర్ మరి! చిమ్మ చీకట్లను ధిక్కరిస్తూ ధగ ధగా మెరుస్తున్నది ప్రజల గుండెల్లోని ఆ గులాబీ జెండా. ప్రతి జెండాకూ ఓ ఎజెండా ఉంటుంది. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. ఆకాంక్షలూ, ఆశయాలూ సుస్పష్టంగా నిర్దేశితమవుతాయి. కచ్చితమైన లక్ష్యాలూ ఉంటాయి. వాటన్నింటికీ ఆకర్షితులైనవాళ్లు ఆ జెండా కింద చేరుతారు.
తామంతా ఒక్కటన్న భావనతో సాగుతారు. ఎత్తుపల్లాలను ముందే ఊహించి తమను ముందుకు నడిపే ఒక్క దమ్మున్న తోడున్నా, ఆ జెండా సాక్షిగా అందరి ఆశలూ నెరవేరినట్టే. తెలంగాణ విషయంలో, ఆ ఒక్క మనిషి మన బక్క మనిషి కేసీఆర్ అయితే, ఆ దారి చూపింది రెపరెపలాడే గులాబీ జెండానే. బీఆర్ఎస్ జెండా విషయంలో ప్రాథమిక లక్ష్యం రాష్ట్ర సాధన అయితే, శాశ్వత లక్ష్యం మాత్రం ప్రజా సంక్షేమమే. వేరుపడి వెక్కిరింతలకు గురైన చరిత్ర తెలంగాణది కాకూడదని తొలి రోజు నుంచే పనిచేశారు కేసీఆర్. సాధించుకున్న తెలంగాణను పసిడి సిరుల సీమగా చేయాలని గోదావరికి మొక్కి కాళేశ్వరాన్ని భుజానికెత్తుకున్నారు. కరువు సీమ పాలమూరుకు పరిగెత్తే నీళ్లను పరిచయం చేశారు.
విద్యుత్తు వెలుగులు 24 గంటలూ విరబూయించారు. ఐటీ ఎగుమతుల్లోనూ మేటిగా నిలిపారు. మొత్తానికి అభివృద్ధికి అడ్డాగా తెలంగాణను మలిచారు. కానీ, కాంగ్రెస్ గద్దెనెక్కాక తీరూ తెన్నూ లేని పాలనతో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణను రాష్ర్టాల జాబితాలో పదిహేనో స్థానానికి పడిపోయేలా చేయటమన్నది మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కాలం నాటి పరిస్థితులను పునరావృతం చేయడమే. అందుకే కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి ఉండంగ ప్రజలు మంచినీళ్లకు గోస పడాల్సిన అవసరం ఎందుకొచ్చిందని గద్దించి అడిగారు కేసీఆర్.
పొలం ఉన్న ప్రతి రైతూ ఆస్తి పరుణ్ని అని భావించిన రోజులను జ్ఞప్తికి తెచ్చారు. పదవులు తనకు లెక్క కాదనీ పదవీ త్యాగంతోనే తెలంగాణ ఉద్యమం మొదలైందని గుర్తుచేశారు. పోరాటం విషయంలో తన పంథా ఏమిటో చెప్పారు. గులాబీ జెండా పాతికేండ్ల పండుగ సాక్షిగా బీఆర్ఎస్ ప్రజా సంక్షేమానికి పునరంకితమవుతుందని ఢంకా బజాయించారు.
పరాయి పాలనలో ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ గులాబీ జెండా అండగా ఉన్నది. ఇప్పుడు కూడా పాలకులు తప్పు చేస్తే గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటున్నది. ఉద్యమం అన్నది జెండా ఊపిరిలోనే ఉన్నదని ఎల్కతుర్తి సభ మరోసారి రుజువు చేసింది. ఎందుకంటే ఈ గులాబీ వర్ణం రాజప్రాసాదాల పూదోటల నుంచి పుట్టింది కాదు, ఒక ప్రాంతపు ప్రజలు ఎదుర్కొన్న అవమానాలు, అన్యాయాలు, వివక్షల సాక్షిగా సంతరించుకున్నది!
సాధించుకున్న తెలంగాణను పసిడి సిరుల సీమగా చేయాలని గోదావరికి మొక్కి కాళేశ్వరాన్ని భుజానికెత్తుకున్నారు. కరువు సీమ పాలమూరుకు పరిగెత్తే నీళ్లను పరిచయం చేశారు. విద్యుత్తు వెలుగులు 24 గంటలూ విరబూయించారు.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి