అస్తిత్వ పోరాటంలో నుంచి ఎగిసిన ఆత్మగౌరవ పతాకం తెలంగాణ. అరవై ఏండ్ల సమైక్య ఆధిపత్య పాలనపై అలుపెరుగని పోరాటమే తెలంగాణ. స్వాభిమాన, సార్వభౌమాధికార శిఖరమే తెలంగాణ. అలాంటి తెలంగాణ అస్తిత్వంపై ఎనిమిది నెలల కాలంలోనే మరోసారి నీడలు పరచుకుంటున్నాయి. గత ఎన్నికలకు ముందు మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరించినట్టుగానే ఢిల్లీ ఆధిపత్యం మళ్లీ జడలు విప్పుతున్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టే బానిసబుద్ధులు ‘జీ హుజూర్ జో హుకుం’ అంటూ మోకరిల్లుతున్నారు.
ఇక్కడి ప్రజల ఆదర్శాలకు, ఆశయాలకు గండికొడుతున్నారు. ఇక్కడి ప్రతీకలను వెనుకతట్టు పట్టిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు వారికి చేతులు రాకపోవడమే అందుకు అతిపెద్ద నిదర్శనం. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టేందుకు ఉరుకులాడటం వైపరీత్యం. దేశానికి ప్రధానులుగా చేసిన అనేకమందిలో రాజీవ్ ఒకరు. దేశంలో ఆధునిక సాంకేతికత ప్రవేశపెట్టేందుకు పాటుపడిన నేతగా ఆయనను గుర్తుంచుకోవాల్సిందే, గౌరవించుకోవాల్సిందే.
దేశం కోసం సర్వోన్నత త్యాగం చేసిన నేతగా ఆయనను స్మరించుకోవాల్సిందే. ఎవరూ కాదనరు. అయినా ఇక్కడ ఆయనకు ఏం తక్కువైందని? రాజీవ్ రహదారి లేదా? రాజీవ్ స్టేడియం లేదా? రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా? ఊరూరా విగ్రహాలు ఉండనే ఉన్నాయి. నగరం నడిబొడ్డున పంజాగుట్టలో రాజీవ్ విగ్రహం ఉంది. అయినా ప్రాపకం కోసం వెంపర్లాట తప్పిస్తే కొత్తగా రాజీవ్ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?
వెన్నెముక లేని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పదవుల కోసం ఢిల్లీ ముందు మోకరిల్లడం నాటి నుంచీ అలవాటే. ఆ అలవాటులో భాగంగా జరుగుతున్నదే రాజీవ్ విగ్రహ ఏర్పాటు హంగామా. అందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోటునే ఎంచుకోవడం వారిలో ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం లోపించడాన్ని వేలెత్తి చూపుతున్నది. ఇక్కడి ఆకాంక్షల్ని ప్రతిఫలించే విగ్రహాలు పెట్టాల్సిన అవసరం లేదా? ఇక్కడి ప్రతీకల్ని నిలుపుకోవాలన్న సోయి ఉండొద్దా? తెలంగాణ అస్తిత్వంతో రాజీవ్‌కు ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షతో కాంగ్రెస్ ఆటలాడిన చరిత్ర మరిచిపోలేం కదా.
దేశాన్ని ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడేసి మహోన్నత ప్రధానిగా మన్ననలందుకున్న ఈ గడ్డ ముద్దుబిడ్డ పీవీకి కాంగ్రెస్ చేసిన అవమానాలు కడిగితే పోయేవి కావు. అన్నీ మరిచిపోయి రాజీవ్ విగ్రహాలు పెడుతూ పోతే సరిపోతుందా? బీఆర్ఎస్ హయాంలో విమానాశ్రయానికి రాజీవ్ పేరు తొలగించి, తెలంగాణ అస్తిత్వంతో సంబంధమున్న వ్యక్తి పేరు పెట్టాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి. అయినా అప్పటి నాయకత్వం సంయమనంతో, పరిణతితో వ్యవహరించి అందుకు పూనుకోలేదు. రేపు ప్రజల ఒత్తిడి ఎక్కువైతే పూనుకోదని మాత్రం చెప్పలేం. ఢిల్లీ పార్టీకి అధిష్ఠానమే సర్వోన్నతం. కానీ, బీఆర్ఎస్కు ప్రాంతీయ అస్తిత్వమే సర్వస్వం.
తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమై నూతన సచివాలయ భవనం వెలిసింది. ఆ భవనం ముందర తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే ఉచితం. కొందరు మిడిమిడి జ్ఞానులు తెలంగాణ తల్లి భావనపై, రూపురేఖలపై ప్రశ్నలు లేవనెత్తి గందరగోళపర్చాలని చూస్తున్నారు. తెలంగాణ తల్లి భావన ఈనాటిది కాదు. దాశరథి, రావెళ్ల రామారావు వంటి కవులు ఆనాడే తెలంగాణ తల్లి అంటూ పద్యాలు రాశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ స్ఫూర్తిలో నుంచి ఆవిష్కృతమైన తెలంగాణ తల్లి విగ్రహాలు ఈనాడు చాలా ఊళ్లలో కనిపిస్తున్నాయి.
ఆ విగ్రహ రూపురేఖలపై సర్వత్రా ఆమోదం వ్యక్తమైంది. అదే నికరమైంది. సమైక్య పాలకులు తమ ఆధిపత్యాన్ని స్థిరీకరించుకునేందుకు ముందుకుతెచ్చిన తెలుగుతల్లి భావన ఇక్కడ ఎవరికీ పెద్దగా ఎక్కలేదు. ఇక్కడి ప్రజల మనసుల్లో తెలంగాణ తల్లి తప్ప మరొకటి లేదు. రాజీవ్ విగ్రహం ఆలోచన మానుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముందు నెలకొల్పాలని కోరుతూ ఇక్కడి విద్యావంతులు కాంగ్రెస్ అధిష్ఠానానికి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రజల ఆకాంక్షలు, ఆశలను సోనియా, రాహుల్ కాదంటారా? రాజీవ్ పేరును కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహంతో రగడలోకి లాగడాన్ని వారు సమర్థిస్తారా?
కాంగ్రెస్‌కు ప్రజలు ఒకవిడత అధికారం మాత్రమే ఇచ్చారు. రాష్ర్టాన్ని రాసివ్వలేదు. తెలంగాణ చైతన్యశీలమైన గడ్డ. కాంగ్రెస్ నాయకుల బానిస మనస్తత్వాన్ని ఇక్కడి ప్రజలు ఏ మాత్రం సహించరు. ఇది కాంగ్రెస్ పాలకులు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన సత్యం. మీ పదవులను పదిలం చేసుకునేందుకు మీరు రాజీవ్ నామజపం చేస్తున్నారేమో.
అధినేత్రి సోనియాను ప్రసన్నం చేసుకునేందుకు అదొక తాయెత్తులా పనిచేస్తుందనే చౌకబారు ఆలోచన తప్పితే ఇందులో మరేమైనా ఉందా? మీరు రాజీవ్‌ను గౌరవిస్తున్నామని అనుకుంటున్నారేమో. కానీ, ప్రజల దృష్టిలో చులకన చేస్తున్నామని గుర్తించడం లేదు. ఉదాత్త ఆశయాలు, ఆధునిక భావజాలమున్న రాజీవ్ గనుక బతికుంటే ఈ తరహా వ్యక్తి ఆరాధనను సహించేవారా అని కూడా కాంగ్రెస్ నేతలు ఆలోచించడం లేదు. తెలంగాణ పోరుగడ్డ. తలవంచని వీరుల గడ్డ. ఇక్కడ గడీలు కూలినై, అహంకారాలు నేలవాలినై. ప్రజలు కన్నెర్రజేస్తే ‘సహేంద్ర తక్షకాయ స్వాహా’ అన్నట్టుగా మీరు, మీ అధికారం, మీ విగ్రహాలు అన్నీ కుప్పకూలకతప్పదు.