చిహ్నాలను మారిస్తేనో, పేర్లను చెరిపేస్తేనో చెరిగిపోయేవి కావు కేసీఆర్ గుర్తులు. తెలంగాణలోని సబ్బండ వర్గాల గుండెల్లో ఆయన పేరు, గుర్తులు ఎప్పుడో ముద్రితమైపోయాయి. తెలంగాణ ప్రజల జీవితాలే అందుకు సజీవ సాక్ష్యాలు. వాటిని చెరిపివేయడం ఎవరి తరం కాదు. కేసీఆర్ అంటేనే ఒక విజ్ఞాన గ్రంథం. తెలంగాణ విశిష్టత, అస్తిత్వం, చరిత్ర గు రించి ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే స్వరాష్ట్రం ఏర్పడ్డాక సుదీర్ఘ చర్చలు, మేధోమథనం చేసి తెలంగాణ అస్తిత్వం, చరిత్ర కు పెద్దపీట వేసి రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించారు.
రాష్ట్రం చిహ్నంలో కాకతీయ కళాతోరణానికి చోటు కల్పించడం వెనకున్న మేధోమథనాన్ని తెలంగాణ ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వరంగల్ కోటలోని నాలుగు కాకతీయ తోరణాలు అలంకార తోరణాలు కావు, నాటి కాకతీయ పాలకుల వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. నాటి పాలనా వైభవం, కాకతీయుల విజయాలు, ప్రజల జీవన స్థితిగతులను కండ్లకు కట్టినట్టు పూసగుచ్చినట్టుగా చెప్తాయి కళా తోరణాలు. తోరణంలోని నాలుగు పిల్లర్లు కాకతీయుల పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనడానికి నిదర్శనం. చివరి రెండు పిల్లర్లపై ఉండే గర్జించే సింహాలు కాకతీయుల నాయకత్వానికి చిహ్నాలు. వాటిపక్కన తలపైకెత్తి నిల్చున్న మొసలి నాటి జలకళకు ప్రతీతి. ఎందుకంటే కాకతీయుల కాలంలో చెరువులు, కుంటలు, కాలువలలో పుష్కలంగా నీళ్లు ఉండేవి. నీళ్లు ఉన్నచోటే మొసళ్లు ఉంటాయి. తోరణంలో కనిపించే లతలు, తీగలు వారి గొలుసుకట్టు చెరువులను, కుంటలను సూచిస్తాయి. తోరణంపైన ఉండే రెండు హంసలు పారదర్శక పాలనకు నిదర్శనం. హంసల కింద ఉండే కుబేర విగ్రహాలు వారి ఆర్థిక పుష్టికి చిహ్నం. కింద భాగాన బోర్లించిన ఏడు పూర్ణకుంభాలు గ్రామ దేవతలకు ప్రతిబింబాలు. వాటినే సప్త మాతృకలు అని కూడా పిలుస్తారు. స్తంభం మధ్యలో ఉండే చేపల చిత్రాలు మత్స్య సంపదకు సంకేతం.
నాటి కాకతీయుల పాలన వలె తెలంగాణ కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కళా తోరణాన్ని రాష్ట్ర చిహ్నంలో పొందుపరిచారు. అంతేకాకుండా తాను ఎంచుకున్న కళా తోరణంలోని అంశాలను ప్రతిబింబించేలా తెలంగాణను సుభిక్షంగా మార్చారు. కాకతీయుల వలె కేసీఆర్ కూడా సంక్షేమ పాలన అందించారు. కరవును పారదోలారు. వలసలకు అడ్డుకట్ట వేశారు. బీడుబారిన నేల దూప తీర్చారు. దండుగ అన్న ఎవుసాన్ని పండుగలా చేశారు. కేసీఆర్ అంటే కే- కాలువలు, సీ- చెరువులు, ఆర్- రిజర్వాయర్లు అనేంతలా పాలించారు.
నేటిప్రభుత్వ పెద్దలకు తెలంగాణ అస్తిత్వం గురించి, చరిత్ర గురించి కనీస అవగాహన లేకపోవడం మన దౌర్భాగ్యం. అందుకే నేడు రాష్ట్రంలో తుగ్లక్ పాలనను చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న కళా తోరణాన్ని రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించాలనుకోవడం దురదృష్టకరం. చిహ్నంలోని కళాతోరణం స్థానంలో అమరుల స్థూపాన్ని మారుస్తున్నట్టు ప్రచారం చేస్తూ ఉద్యమకారులను కాంగ్రెస్ పాలకులు మభ్యపెడు తున్నారు. అమరుల త్యాగాలు కీర్తించదగినవే. అయితే అమరుల పేరుగాని, వారి త్యాగాలను గాని పలికే అర్హత కాంగ్రెస్కు లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అంత మంది అమరులవ్వడానికి కారణమైనదే కాంగ్రెస్. చిహ్నంలో అమరుల స్థూపాన్ని పెడతామనడం ఎట్లుందంటే.. చంపినోడే పూలదండ వేసి నివాళులర్పించినట్టుంది.
1952లో హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పోరాటం చేసిన సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి ఆరుగురిని పోట్టనబెట్టుకున్నది కాంగ్రెస్ కాదా? 1969 నాటి తొలి దశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపింది హస్తం పార్టీ కాదా? 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11 చోట్ల గెలుపొందిన తెలంగాణ ప్రజా సమితి పార్టీని భూస్థాపితం చేసింది కాంగ్రెస్ కాదా? 2004లో ఇచ్చిన మాట తప్పడంతోనే కదా వందలాదిమంది యువకులు బలిదానం చేసుకున్నది. తెలంగాణ బిడ్డలను అమరులను చేసిన కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర చిహ్నంలో అమరుల స్థూపాన్ని పెడతామని చెప్తుంటే నోరెళ్లబెట్టి చూస్తున్నది నా తెలంగాణ. అమరులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పే కాంగ్రెస్.. స్వాతంత్య్ర సమరంలో అమరులైన యోధుల చిహ్నాన్ని భారత రాజముద్రగా స్వీకరించకుండా అశోకుడి స్థూపంలోని నాలుగు సింహాలు, అశోక చక్రాన్ని ఎందుకు స్వీకరించిందో సమాధానం చెప్పాలి.
తెలంగాణ బిడ్డలు ఉద్యమ ఉగ్గుపాలు తాగి పెరిగారు. సమ్మక్క, సారక్క, రాణి రుద్రమదేవి, సర్వాయి పాపన్న, దాశరథి, వీరవనిత చాకలి ఐలమ్మల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఈ ప్రాంత బిడ్డలకు పోరాటం కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే అస్తిత్వం కోసం మరో ఉద్యమం తప్పక పురుడుపోసుకుంటుంది.
జై తెలంగాణ.. జైజై తెలంగాణ..
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
– డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ,
88866 66006