తెలంగాణ భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతే శాంతియుతంగా జరిగింది తెలంగాణ ఉద్యమం. ఉద్యమమే నాయకులను సృష్టిస్తుంది కానీ, ఆ నాయకులు ఆ ఉద్యమాన్ని కడదాకా తీసుకువెళ్లినప్పుడే వారి పేరు చిరస్మరణీయమవుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎందరో నాయకులు ఇలా వచ్చారు, అలా వెళ్లారు. కానీ, 2001లో స్వరాష్ట్ర సాధన జెండా ఎత్తిన ఆ వ్యక్తి మాత్రం గమ్యాన్ని ముద్దాడే వరకు ఎత్తిన జెండా దించలేదు. ప్రాణం మీదికి వచ్చినా లక్ష్యాన్ని వీడలేదు. ఆయనెవరో కాదు బక్కపలచని దేహం, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్. ఈ పేరే తెలంగాణ భావోద్వేగం.
ఈ మూడక్షరాల కేసీఆర్ పేరు చర్చలకు కేంద్ర బిందువు. ప్రత్యర్థులకు కొరకరాని కొయ్య, అంతుచిక్కని పద్మవ్యూహం. ఈ బక్కమనిషితో ఏమవుతుందిలే అనుకున్నారంతా! కానీ, ఆయన చూపించే చుక్కలు చూసి నివ్వెరపోయారంతా. ఇందుకు కేసీఆర్ చేసిందొక్కటే, తెలంగాణను ఓన్ చేసుకోవడమే. తెలంగాణ ఆవశ్యకతను ఆయన ప్రజలకు వివరించారు. రాజీనామాలతో ప్రజల్లో తెలంగాణ వాదాన్ని బలోపేతం చేశారు. ఉప ఎన్నికలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణ ప్రజలు మెల్లగా కేసీఆర్ను ఓన్ చేసుకున్నారు. అదీ కేసీఆర్కు, తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట చర్చను దేశవ్యాప్తం చేయటమే కాకుండా, బలమైన సమైక్య లాబీయింగ్, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్య పరిస్థితిని తీసుకువచ్చారు. ఈ ప్రయాణంలో తెలంగాణ కోసం కేసీఆర్ ఎక్కిని కొండలు ఎన్నో, మొక్కిన బండలు ఎన్నో, కన్నీళ్లు కార్చిండు, సింహమై గర్జించిండు. మొత్తానికి ఒక యుద్ధమే చేసిండు. లేకుంటే సమైక్యవాది చంద్రబాబుతో ‘జై తెలంగాణ’ అనిపించడం, సోనియాగాంధీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ను ఒప్పించడం, తెలంగాణ కోసం తాను గీసిన బరిలోకి ప్రతీ పార్టీని లాగిండు కేసీఆర్. తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్య పరిస్థితి తీసుకువచ్చి ప్రత్యర్థులను మట్టి కరిపించి తెలంగాణ సాధించిండ్రు కేసీఆర్.
తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసి దేశంలో అగ్రపథాన నిలిపారు. ఇలా… కొందరు నాయకులవుతారు. కొందరు సేవకులవుతారు. కానీ, కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజల భావోద్వేగం అయ్యారు. ఇవన్నీ రాత్రికి రాత్రే వచ్చిన విజయాలు కాదు. పద్నాలుగేండ్ల పోరాటం, పదేండ్ల నిరంతర కృషి. మొత్తంగా తెలంగాణ ప్రజల కోసం ఆయన పడ్డ శ్రమకు ప్రతిఫలమే రానున్న రజతోత్సవం. ప్రస్తుత పాలకులు చేస్తున్న విమర్శలు ఆయనకు గడ్డిపోచతో సమానం.
ఏనుగు పోతా ఉంటే వీధి సింహాలు అరుస్తూనే ఉంటాయి. అంతమాత్రాన ఏనుగు వెనుకడుగు వేస్తుందా? అస్సలే వేయదు. కాబట్టి, ప్రస్తుత పాలకులు తెలుసుకోవలసిందేమంటే అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదు. సాధించిన కీర్తి, ప్రజల్లో పొందిన ప్రేమనే శాశ్వతం. అందుకే, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని గుర్తుకువస్తుంది. కేసీఆర్ ఆనవాలు చెరిపేస్తామని, కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వమని వెకిలి మాటలు మాట్లాతుండచ్చు. కానీ, కేసీఆరే మొక్క కాదు, రాష్ట్ర ప్రజలకు చల్లని నీడనిచ్చే ఓ మహావృక్షం. ఆయనను ప్రజల నుంచి దూరం చేస్తామనుకోవడం అత్యాశే అవుతుంది. అలా అనుకున్నవాళ్లంతా పత్తా లేకుండా పోయారనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకుంటే వారికే మంచిది..
– తెలంగాణ విజయ్