నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ, స్వాతంత్య్ర భారతంలో నీటి ప్రాజెక్టులు ఆధునిక ఆలయాలు అని నెహ్రూ అన్నటువంటి మాటలు ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతున్నాయి. ఈ వ్యాఖ్యలోని రెండు అంశాలు- ప్రాజెక్టులు, ఆలయాలు- సందర్భోచితం. ఎందుకంటే.. దేశంలో, తెలంగాణలో రెండు అంశాలు తీవ్ర చర్చకు వస్తున్నాయి. ఒకటి భక్తుల ఆరాధ్య క్షేత్రం అయోధ్యలోని రామాలయం. మరొకటి, తెలంగాణ రైతుల ఆకాంక్షల ఆలయం కాళేశ్వరం. రామాలయం గురించి దేశమంతా సంచలనం జరుగుతుంటే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చలు మిన్నంటుతున్నాయి.
దేశ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అని, ఒకరి పొడ అంటే ఇంకొకరికి గిట్టదు అని. ఈ రెండు పార్టీలు ఉప్పు, నిప్పు లాంటివి అని. జాతీయ స్థాయిలో వాటి మధ్య తీవ్ర భావ, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయి అని. ఈ విషయం అందరికీ తెలుసు. అసలైన సగటు కాంగ్రెస్ కార్యకర్తకయినా, బీజేపీ కార్యకర్తకయినా. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాలలో జరిగిన ఎన్నికలలో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులు. ఈ రెండింటి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మనం వింటున్నదే, చూస్తున్నదే. ఇవి ఎంతగా దిగజారాయంటే రాజకీయ ఆరోపణలు కాకుండా వ్యక్తులపై విష ప్రచారాలదాకా వెళ్లాయి.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల విషయంలో ఇక్కడే తేడా కనిపిస్తున్నది. వింత ఏమిటంటే, ఈ శత్రుత్వం తెలంగాణ సరిహద్దుల వరకే. తెలంగాణలో మాత్రం వీటి మధ్య అవినాభావ సంబంధం స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి ఇంతగా మైత్రీబంధం పెరగడానికి కారణం ఏదైనా అది దిగజారుడు రాజకీయాలనే సూచిస్తుంది. ఒక వ్యక్తిపై వ్యతిరేకతే, సిద్ధాంతపరంగా విరుద్ధమైన ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య మిత్రత్వానికి దారి తీస్తుందని బహుశా 2023 ముందు వరకు ఏ రాజకీయ విశ్లేషకులూ ఊహించి ఉండరు. 2014 ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్తో, టీడీపీతోనో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్య పడలేదు. ఎందుకంటే అప్పట్లో వాటి మధ్య వైరుధ్యాలు అంత తీవ్రమైనవికావు. కానీ కాంగ్రెస్-బీజేపీ మాత్రం ఒకే ఒరలో ఇమడలేని వైరుధ్యం కలిగిన పార్టీలు. వాస్తవానికి ఇది పార్టీల స్నేహం కంటే, ఇద్దరు వ్యక్తుల దోస్తీ అని చెప్పవచ్చు. ఈ పరిణామాలు అసలైన కాంగ్రెస్, బీజేపీ శ్రేణులలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ అనుమానాలు ఎంత దూరం వెళ్తున్నాయంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఈ రెండు పార్టీలలోని పాత నేతలను పక్కకు తప్పిస్తారనే చర్చ జరుగుతున్నది.
అక్షింతలు మీకు, అధికారం మాకు అనే నినాదంతో దేవుని పేరుమీద ఇంటింటికీ అక్షింతలు పంచిన పార్టీ ఇప్పుడు దేశంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ భక్తులకు సమాధానం ఇవ్వకుండా మౌనం వహిస్తున్నది. తెలంగాణ మీడియాలో ఎక్కడా ఈ అంశంపై చర్చ జరగకుండా జాగ్రత్త పడుతున్నది. ఇక ఆ పార్టీకి అనుబంధంగా పనిచేసే వాట్సాప్ ’అంకుల్స్’ ప్రతి కాలనీ, పట్టణాలు, గ్రామాల్లో ఉండనే ఉన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ’అంకుల్స్’చేసే ముఖ్యమయిన పని వాట్సాప్, యూట్యూబ్లో వచ్చిన వీడియోలు, మెసేజ్లను షేర్ చేయడమే. కొంతమందికయితే అలా షేర్ చేయందే రోజు ప్రారంభం కాదు, రాత్రి నిద్ర పట్టనంతగా అలవాటయింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం బీజేపీకి ఎన్నికల ఆయుధంగా మారింది. కానీ ఇప్పుడు అదే మందిరం విరాళాలు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ట్రస్టీలపై అవినీతి, వ్యవస్థాపక లోపాల ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ సహా విపక్షాలు రాజీనామాలు, సీబీఐ విచారణ, అరెస్టులు డిమాండ్ చేస్తున్నా యి. బీజేపీని ఇంతకాలం తర్వాత ఇలా ఇరుకున పెట్టడం విపక్షాలకు పెద్ద విజయంగా కనిపిస్తున్నది. తెలంగాణ మీడియా మినహా దేశవ్యాప్తంగా జాతీయ మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నది. బీజేపీ ఓటు బ్యాంకుకు ప్రధాన ఆయుధమైన రామ మందిరంలో జరిగిన అవకతవకలతో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. కానీ తెలంగాణలో పరిస్థితి విచిత్రంగా ఉన్నది. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం బీజేపీని ఎండగట్టుతుంటే, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మంత్రులు పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్నారు. ప్రెస్మీట్లు, స్టేట్మెంట్లు, డిమాండ్లు ఏమీ లేవు. ఇంత పెద్ద అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఇది యాదృచ్ఛికం కాదు అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. లోపాయికారీ మిలాఖత్ లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు మౌనం వహిస్తున్నట్టు?
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయ చరిత్రను మార్చేసిన అద్భుత ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు స్థిరమైన నీటి సరఫరాతో రైతులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ రైతుల భవిష్యత్తుకు మూలస్తంభమైన ఈ ప్రాజెక్టును హేళన చేయడం ఎవరికీ సహేతుకం కాదు. రైతుల పట్ల సానుభూతి ఉన్న ఎవరైనా ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడరు. కాంగ్రెస్ సర్కార్ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇవ్వనంతవరకు నీటి ఎత్తిపోత పనులు చేయలేం అనే వింత వాదన వినిపిస్తున్నది. ఇది ఎంత హాస్యాస్పదం! కాళేశ్వరం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి అనుమానాస్పదం. తెలంగాణ రైతుల తరపున ఒక జాతీయ పార్టీగా గట్టిగా కొట్లాడాల్సిన బీజేపీ మౌనం అనుమానాలను కలిగిస్తున్నది. బీజేపీలో ఒకరిద్దరు మినహా ఎవరూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాట్లాడటంలేదు. కేసీఆర్పై కక్ష సాధింపు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెడుతుంటే మాట్లాడకపోవడాన్ని తెలంగాణ రైతులు గమనిస్తున్నారు.
అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారంలో విచారణ జరుగుతున్నా, భక్తుల దర్శనాలు, పూజా కార్యక్రమాలు ఆగిపోలేదు. విచారణ జరుగుతూనే ఆలయం కార్యకలాపాలు సాగుతున్నాయి. అదే విధంగా కాళేశ్వరంలో కుంగిన పిల్లర్ల మరమ్మతులపై విచారణ జరగొచ్చు, కానీ ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులు ఆపకూడదు. రైతుల పంటలు, భవిష్యత్తు ఆగిపోతే ఎవరు బాధ్యులవుతారు? తెలంగాణ రైతులు ఇప్పుడు నిజాలు గ్రహిస్తున్నారు.
రామాలయం వివాదంపై జాతీయ కాంగ్రెస్ గట్టిగా మాట్లాడుతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు బీజేపీని నిలదీయడం లేదు. పైగా బీజేపీ నాయకులకు సంబంధించిన కేసుల్లో అప్రకటిత సహాయం చేస్తున్నారు. బీజేపీని ప్రజాక్షేత్రంలో గట్టిగా నిలదీసే అవకాశాన్ని కాదనుకుంటున్నారు. అలాగే బీజేపీ తెలంగాణ నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాళేశ్వరం నీటి ఎత్తిపోతల విషయమై రైతుల తరపున డిమాండ్ చేయడం లేదు. రైతు ఆలయమైన కాళేశ్వరం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, ప్రభుత్వాన్ని నిలదీయకపోవడంతో తెలంగాణ బీజేపీ వైఖరి రైతులకు అర్థమవుతున్నది. కాళేశ్వరంపై ప్రభుత్వం ఏదైనా విచారణ చేయాలని అనుకొంటే చేయాలి. కానీ రైతుల పంటలు, జీవనాధారాలు ఆగిపోకూడదు. కూలేశ్వరం అని హేళన చేసే రాజకీయ నేతలు, రైతు కష్టాలను అర్థం చేసుకోవాలి. రైతు బతుకులతో రాజకీయం చేయొద్దు. ఇప్పుడు తెలంగాణలో ఆధునిక ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే… ఆ సమయం ఆసన్నమైంది.
– సిరారె