ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయం అయోమయంలో పడిపోతున్నది. ఓవైపు నీటి కటకటతో సాగు ప్రశ్నార్థకమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుతో చెలగాటమాడుతున్నది. ప్రాజెక్టుకు అవసరమైన చిన్నచిన్న మరమ్మతులు చేసి, పంపులు ఆన్చేయకుండా గోదారి చేజారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తున్నది. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ అసలు పని దాటవేస్తున్నది. ఈలోగా కాళేశ్వరం ద్వారా నిల్వ చేయగలిగే నీటిలో సుమారు 74 శాతానికి పైగా దిగువకు, అంటే.. ఏపీకి యథేచ్ఛగా వెళ్లిపోయింది. నాడు బరాజ్ లేకున్నా గోదావరి పక్కన దేవాదుల ప్రాజెక్టు పేరిట ఓ గొయ్యి తవ్వి అందులోంచి నీటిని పంపింగ్ చేసుకున్నారు చంద్రబాబు. అంటే ఏమీ లేకున్నా ఉత్తుత్తి ప్రాజెక్టు కింద నీటిని ఎగరేసుకుపోయారన్న మాట. కానీ తెలంగాణ సోయిలేని కాంగ్రెస్ పాలకులు నేడు మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్ హౌస్‌లు..సర్వస్వం సిద్ధంగా ఉన్నా ఎత్తిపోయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రాజెక్టులో నీరు నింపితే ముప్పు అని ఎన్డీఎస్ఏ చెప్పిందని, ఇంకోసారి భద్రాచలంతో సహా దిగువ ప్రాంతాలు మునిగిపోతాయని కహానీలు చెప్తున్నారు. ఒకసారి ప్రాజెక్ట్ సురక్షితమే అంటూ, మరోసారి సంపూర్ణ సాంకేతిక ఆడిట్ అవసరం అంటూ పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తున్నది. ఇదంతా చూస్తుంటే సమస్య తీవ్రతను అంచనా వేయడంలో పాలకులకు అసలు చిత్తశుద్ధి ఉన్నదా అనే సందేహాలు తలెత్తకమానవు. మరమ్మతులు తర్వాత చేసుకోవచ్చు.. ఇప్పటికిప్పుడు మేడిగడ్డను నింపకుండానే కేవలం కన్నెపల్లి పంపుహౌస్‌ను ఆన్‌చేసి నీటిని ఎగువకు పారించవచ్చు. కానీ అది కూడా చేయడం లేదు.
సాగు సంక్షోభంపై సత్వర చర్యలు చేపట్టాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో సభ పెట్టి గత ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలుతూ కాలక్షేపం చేస్తున్నారు. పంపులు నడిపిస్తే, రిజర్వాయర్లు నింపితే కేసీఆర్‌కే పేరొస్తుందనే అక్కసుతో తప్ప మరోటి కాదు. నిద్రపోతున్నవారిని లేపొచ్చు కానీ, నిద్ర నటిస్తున్న వారిని లేపడం కష్టమనే నానుడి ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నది. రాష్ట్రంలో సుమారు 60% వరకు సాగు వర్షాధారంగానే సాగుతుందనేది తెలిసిందే. మిగతా ప్రాంతాల్లో కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టుల ఆధారంగా వ్యవసాయం జరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు పలు జిల్లాల్లో వర్షపాతం 2030% వరకు తగ్గిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఫలితంగా, పత్తి, మిర్చి, వరి పంటల సాగు గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో మొత్తంగా సాగు విస్తీర్ణం 29 శాతానికి పడిపోయిందని తెలుస్తున్నది. కొన్ని మండలాల్లో రైతులు 3040% వరకు నష్టాలను ఎదుర్కొంటున్నారని అంచనాలు పేర్కొంటున్నాయి. సాగునీరందక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టి, నీరందక పంటలు ఎండిపోతుండటంతో దిక్కులు చూస్తున్నారు. బ్యాంకు రుణాలు, ప్రైవేట్ అప్పులు, అధిక వడ్డీతో రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ పరిస్థితి ఇంకా కొనసాగితే రైతులు దుర్భర సంక్షోభంలో చిక్కుకుంటారనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో వ్యవసాయానికి కరువు పరిస్థితుల్లాంటివి ఎదురైతే ఆదుకుంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ఎత్తిపోతలను నిర్మించారు. 244 టీఎంసీల నీటిని నిల్వ చేసే విధంగా రిజర్వాయర్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. సులభంగా నీటిని ఎత్తిపోసే సృజనాత్మక ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రపంచం మన్ననలు అందుకున్నది. కానీ కేసీఆర్ మీద కక్షతో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ జలభాండాన్ని పడావుపెట్టి రైతులను అష్టకష్టాలు పెడుతున్నది. తలాపున గోదావరి కథ మళ్లీ మొదటికొచ్చింది. కాళేశ్వరాన్ని పడావు పెట్టి, సాగు సంక్షోభాన్ని తెచ్చిన సర్కారే దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను గుర్తించాలి. ఇప్పటికైనా సర్కార్ మేల్కొని చర్యలు తీసుకోకపోతే రైతులు క్షమించరు.