‘కాళేశ్వరం ప్రాజెక్టు’ తెలంగాణ నిర్మించుకున్న దేవాలయం. ఆ గుడి మీద రాళ్లు విసురుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా.. మీ పతనం మొదలైంది. తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. మా కంచంలో మట్టి పోయాలని చూసే మిమ్మల్ని తెలంగాణ సమాజం చెద పురుగుల్లా చూసే అవకాశం మీకు మీరే ఇచ్చుకున్నారు. నీచ, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయ గోపురం లాంటి ప్రాజెక్టు మీదికెక్కి అబద్ధాల కథలల్లారు. స్లాబ్‌లు కొట్టుకోకుండా పెట్టుకొనే ‘గ్యాప్’ను పగుళ్లుగా చూపిస్తూ పైశాచికానందాన్ని పొందారు.
రాష్ర్టానికే కాదు, దేశానికి అన్నం పెడుతున్న దేవతను పరిహాసమాడి పరవశించారు. ‘కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు రెండూ ఎందుకూ పనికిరావు, కూలగొట్టాల్సిందే..’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఛానెల్‌కు వచ్చి మాట్లాడుతున్నాడు. అవును, నిర్మించడం మీకేం తెలుసు, కూలగొట్టడమే తెలుసు. వీళ్లు ప్రకటించడం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మేమెక్కడ వెనకబడిపోతామోనని వెంటనే పరిశీలన బృందాన్ని పంపడం, మూడు రోజుల్లో వాళ్లు నివేదిక పంపడం.. ఆహా, ఎంత వేగం? ఎలక్షన్ టైం గనక వెంటవెంటనే తలా ఒకరాయి విసిరితే లాభం పొందవచ్చని ఇరు పార్టీల భ్రమ. మేడిగడ్డ కట్టిన ఎల్ అండ్ టీ సంస్థ పరిశీలించి దాన్ని సరిచేసే బాధ్యత తీసుకుంది. ఎల్ అండ్ టీ ఎన్నో పెద్ద నిర్మాణాలు చేసిన పేరున్న పెద్ద సంస్థ.
వీళ్ల పాలనాకాలంలో నిర్మించిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎంత మింగారో తెలువంది ఎవరికి? అదే పని సొంత రాష్ర్టాన్ని అద్భుతంగా నిర్మించుకుంటున్న మనమూ చేశామని నిందలు వేస్తే నమ్మేదెవరు? ఏదో మాయ చేసి కుర్చీ ఎక్కడానికి ఎంతకైనా దిగజారుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ నాయకులు పవర్ కోసం ఎంతకైనా తెగిస్తారని గత చరిత్ర చెప్తున్నది. నగరంలో ఎన్ని హత్యలు జరిగేవి. రక్తమోడిన రోడ్లు, ఎన్నో కన్నీటి గాథలు. వీళ్ల అధికార దాహానికి ఉన్న సీఎం అసమర్థుడనీ, అశాంతిని అరికట్టలేకపోతున్నాడని నిరూపించడానికి రోడ్లపక్కన పళ్లమ్ముకునే వాళ్లనీ, కూరగాయలమ్ముకునే వాళ్లనీ కత్తులతో పొడిచి పొడిచి చూపించి హిందూ, ముస్లిం గొడవలుగా ప్రచారం చేయించేవాళ్లు. ఢిల్లీ అధిష్ఠానానికి నివేదికలు పంపి ఉన్న సీఎంను దించే కల్చర్ వీళ్లది. ఎప్పుడు కర్ఫ్యూ అంటారో తెలీక భయంతో చచ్చేవాళ్లు ప్రజలు. అన్నెం, పున్నెం ఎరుగని పేదలెందరో వీళ్ల క్రూరత్వానికి బలయ్యారు.
కృత్రిమంగా ప్రభుత్వ వ్యతిరేక వేవ్ సృష్టించి అధికారంలోకి వచ్చేస్తున్నట్టు హంగామా చేస్తున్నారంటే కారణం మన తెలంగాణ ఆదాయం పెరగడం. ఆదాయం తక్కువున్న రోజుల్లోనే ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ పెద్దలకు సంచుల నిండా, సూట్‌కేసుల నిండా నోట్ల కట్టలు మోసి వాళ్ల పదవులను భద్రపరచుకున్న చరిత్ర కాంగ్రెస్ నాయకులది. ఇప్పుడు మనం పెంచుకున్న ఆదాయం మన రాష్ర్టాభివృద్ధికీ, పేద ప్రజల సంక్షేమానికి వాడుకుంటున్నాం, ఎదుగుతున్నాం. పల్లెల్లో వేదన లేని జీవనం గడిపే స్థాయికి వచ్చాం. మూటలు విమానమెక్కే రోజులు లేవు ఇప్పుడు. ఢిల్లీలో ఉన్న జాతీయపార్టీల చూపంతా మన ఆదాయం మీదే. నిండుగా ఉన్న మన కంచంలో మట్టి కొట్టడానికి అందరూ ఏకమై వస్తున్నారు. ‘పొరపాటున మనం గెలవకపోతామా, ఈ భాండాగారాన్ని కొల్లగొట్టకపోతామా’ అని ఊహల పల్లకీలో ఊరేగుతున్నారు. మనం అధికారంలోకి వచ్చేస్తున్నామని అవకాశవాదులకు ఆశలు పుట్టిస్తున్నారు.
తిని కడిగిన చెయ్యిని కూడా ప్రేమతో ముద్దాడే సంస్కారం తెలంగాణ ప్రజలది. తమ జీవితాల్లోకి నక్కలు చొరబడాలని చూస్తే తరిమి తరిమి కొట్టే సాహస చరిత్ర తెలంగాణది. రాష్ర్టాన్ని, ప్రజలను ప్రేమతో కాపాడుకునే బాహుబలి లాంటి ‘బాపు’ కేసీఆర్. ఆయన ముందు కుప్పిగంతులేస్తున్న కుక్కమూతి పిందెలు ఈ కాంగ్రెస్ మరుగుజ్జులు. విజయం ఎవరివైపో విడిగా చెప్పనక్కర్లేదు. అభ్యర్థులను ప్రకటించి మన బాహుబలి బాపు రాష్ట్రమంతా తిరుగుతుంటే.. కాబోయే ఎమ్మెల్యేలు జనంలో మమేకమై కదులుతుంటే.. వాళ్లింకా అభ్యర్థులను వెంపర్లాడుతున్నారు. గొడవలు పడి, క్యాడర్ మల్లయుద్ధాలు.. అంతా గందరగోళ పరిస్థితులే. అది ఆ పార్టీల పరిస్థితిని కళ్లకు కడుతున్నది. ఏదేమైనా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, తపన పడి నిర్మించుకుంటున్న తెలంగాణలో దొంగలు పొరపాటున దూరినా ప్రమాదమే. రాష్ర్టాన్ని ప్రేమించే ప్రతి పౌరుడూ అప్రమత్తంగా ఉండవలసిన తరుణమిది. దొంగలకు ‘దొంగ’ తెలివి ఎక్కువ. మన పచ్చని వనంలో రాకాసి జాతి చొరబడి చిందర వందర చేయ్యాలనుకుంటే పులుల్లా విజృంభించాల్సిందే. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నినా.. చివరికి జనమే గెలుస్తారు. తెలంగాణను గెలిపిస్తారు.
– రావులపల్లి సునీత 99857 99966