2014 జూన్ 2న సంబురాలు జరుపుకొంటూనే పునర్నిర్మాణానికి ముగ్గులు పోసుకుంటూ ముందుకుసాగాం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో ముందుకుసాగింది తెలంగాణ ఉద్యమం. ‘తెలంగాణ నా స్వప్నం- స్వరాష్ట్ర సాధనే ధ్యేయం’ అన్న ఏకవాక్య నినాదంతో టీఆర్ఎస్ రాజకీయ ఉద్యమ పార్టీని నెలకొల్పి, మడమతిప్పని పోరుతో 14 ఏండ్లు ఉద్యమించి కేసీఆర్ రాష్ట్రసాధకుడయ్యారు.
2014 నుంచి దశాబ్దకాలం పాటు కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కరువునేలపై నీళ్లు పారించేందుకు మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవనం కలిగించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కోటి ఎకరాల మాగాణానికి అపర భగీరథుడు కేసీఆర్ నీళ్లందించడంతో తెలంగాణ పచ్చబడింది. గ్రామస్వరాజ్యం తిరిగి ఊపిరిపోసుకుని నిలిచింది. హైదరాబాద్‌ను ఐటీ కేంద్రంగా కేటీఆర్ తీర్చిదిద్దారు. కేసీఆర్ తెలంగాణలో రైతు రాజ్యం నిర్మించారు. దేశానికే తెలంగాణను మోడల్‌గా నిలిపింది కేసీఆర్. దీన్ని చరిత్ర ఎన్నటికీ కాదనలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ తెలంగాణను తల్లి కోడిలా తన రెక్కల కింద కాపాడారు కేసీఆర్. గంగాజమునా తెహజీబ్ సంస్కృతిని చెక్కుచెదరకుండా కాపాడింది బీఆర్ఎస్. కేసీఆర్ హయాంలో ఈ నేలపై ఎన్కౌంటర్లు లేవు. తెలంగాణను ఆకలితో అల్లాడే స్థితి నుంచి బయటపడేసిన ఖ్యాతి తెలంగాణ తొలి ప్రభుత్వానికే దక్కుతుంది.
జూన్ 2 స్ఫూర్తితో ఇప్పుడు రెండు విషయాలను మనం గుర్తుచేసుకోవాలి. 2014 జూన్ 2కు ముందు తెలంగాణను అన్ని రకాలుగా ధ్వంసం చేసిందెవరు? తెలంగాణ ఏ ఆధిపత్యవాదుల పాదాల కింద నలిగింది? తెలంగాణలో బడులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని దుంపనాశనం చేసిన పార్టీలేవి? కోట్లాది ఎకరాల బంగారు పంటభూములను కరువు నేలగా మార్చిన విలన్లు ఎవరు? ఏ పార్టీలు? నల్లగొండను ఫ్లోరోసిస్ పెనుభూతంలా పట్టిన పెత్తందార్లెవరు? తెలంగాణను ఎన్కౌంటర్ల నెత్తురు ముద్దను చేసి వేలాదిమంది ప్రాణాలు పోవటానికి కారకులెవరు? ఏయే పార్టీలన్నది ఈ తరం తెలుసుకోవాలి. మొత్తంగా తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేసి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వికాసంపై పెత్తనాలు చేస్తూ, తొక్కేసిన పార్టీలెవరివి? ఆ పార్టీల పెద్దలెవరు? 1969 స్వరాష్ట్ర ఉద్యమానికి, 1997 నుంచి మొదలైన అస్తిత్వ పోరు 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్గా ఏర్పడటానికి ఏయే పార్టీలు కారణం? ఏ పార్టీల పెద్దలు కారకులు? 14 ఏండ్ల మలిదశ తెలంగాణ ఉద్యమంపై విషం కక్కిన పార్టీలు, ఆధిపత్య పెత్తందార్లెవరు? స్వరాష్ట్రం వచ్చాక కూడా పునర్నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందెవరు? నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని, నేటి తొలి, మలి దశల స్వరాష్ట్ర ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేసి తెలంగాణను తల్లడిల్లేలా చేసిన పెత్తందార్లెవరు? ఆనాడు, ఈనాడు తెలంగాణకు విలన్ ఎవరు? విధ్వంసకారులెవరు? తెలంగాణ వలసపోయి వలవల ఏడ్వటానికి కారకులెవరు? 60 ఏండ్లు తెలంగాణ ప్రగతిని, సాంస్కృతిక వికాసాన్ని అణగదొక్కినవాళ్లే ఇపుడు స్వరాలు మార్చి మాట్లాడుతుండటాన్ని కొత్త తరం గమనించాలి. తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసినవాళ్లే తెలంగాణ విముక్తి ప్రదాతలమని చెప్పడాన్ని ఈ నేల ఎప్పటికీ జీర్ణించుకోలేదు.
మన తాతల, తండ్రుల ఏడు తరాలను యమగోసలు పెట్టినవాళ్లే ఇప్పుడు తెలంగాణ ప్రదాతలుగా మాట్లాడుతున్న విషయాన్ని నవతరం, యువతరం సంపూర్ణంగా అర్థం చేసుకోకపోతే తెలంగాణకది తీరని నష్టంగానే మిగిలిపోతుంది. జూన్ 2ను సంపూర్ణంగా అవలోకనం చేసుకుంటే తెలంగాణకు కాపలాదారులెవరో? కుట్రదారులెవరో? తెలిసిపోతుంది.
తెచ్చుకున్న తెలంగాణ తెర్లుకాకుండా చూసే బాధ్యతను భుజానికి వేసుకున్నవాడే నేటి హీరో. ఆ పాత్ర పోషించగలిగిన దమ్మున్న మొనగాడు కేసీఆర్. అందుకే ఆయనను ఉటంకిస్తూనే ‘దటీజ్ కేసీఆర్’ అని తెలంగాణ నేల చెప్పుకొన్నది. ఆ బక్క మనిషే బడుగుల తెలంగాణకు అండగా నిలువగల మహాశక్తి. 2014 జూన్ 2కు ముందు తెలంగాణను విధ్వంసం చేసిందెవరో? 2014 తర్వాత మా నడిగూడెం చివరి భూములదాకా నీళ్లందించిన చరిత్ర ఎవరిదో ఏ ఊరినడిగినా చెప్పుద్ది. నలుగురు కూర్చునే చావళ్ల కాడ చర్చించండి. ఊరుకు కావాల్సిన అన్ని వసతులు ఎప్పుడొచ్చాయో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఇంటా చర్చించుకోవడమే స్వరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇది నేను బీఆర్ఎస్ను సమర్థిస్తూ మాత్రమే రాయటం లేదు, యావత్ తెలంగాణ సమాజంలో అతితక్కువ సమయంలో వేగవంతంగా జరిగిన పునర్నిర్మాణాన్ని నిరంతరంగా రాసిన రచయితగానే రాస్తున్నాను. ఇంద్రవెల్లిని నెత్తురుటేర్లలో ముంచిందెవరో ఇంద్రవెల్లి స్థూపం సాక్షిగా చెప్పకపోతే తెలంగాణ అర్థం కాదు. తాగు, సాగు నీళ్లు లేని తెలంగాణ తెలియకపోతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అర్థం కావు.
‘బోలో స్వతంత్ర భారత్‌కి జై’, జైజై తెలంగాణ.. జై వీర తెలంగాణ’ అంటూ చిన్నప్పుడు నడిగూడెం వీధుల్లో తిరిగిన నాడు, ఆ రెండింటి గురించి తరగతి గదిలో సార్లు మాకు పాఠంలాగా చెప్పారు. తెలంగాణను ధ్వంసం చేసిందెవరు? సిరిసిల్ల, జగిత్యాల జాతరలు జరగటానికి కారకులెవరు? వీరతెలంగాణ సాయుధ పోరు ను నెత్తురుటేర్లలో ముంచిందెవరు? 1969 ఉద్యమంపై తూటాలెక్కుపెట్టి వందలాది మంది ని చంపిన పాలకులెవరు? మలిదశ ఉద్యమం మొదలవుతుంటే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసిన పార్టీలు, పాలకులెవరు? 2001 ఏప్రిల్ 27 నుంచి 14 ఏండ్ల సుదీర్ఘ పోరును రాజకీయ ప్రక్రియ ద్వారా నడిపిందెవరు? ఆ బక్క మనిషి ఒక్కడే పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అని దిక్కులు పిక్కటిల్లేలా అరుసుకుంటూ పోతుంటే స్వరాష్ట్ర ఉద్యమాన్ని అణచివేసిన దొరలెవరు? 14 ఏండ్ల పోరులో తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకునేందుకు కారకులెవరు? ఆ పార్టీలేవి? అసెంబ్లీలో తెలంగాణ పదం ఉచ్ఛరిస్తే అడ్డుపడ్డదెవరు? అసలు తెలంగాణకు విలన్లు ఎవరు? హీరోలు ఎవరు? ఈ తరం పిల్లలు అడిగే ప్రశ్నలకు గత చరిత్ర సమాధానం చెప్పాలి. స్వరాష్ట్రం కోసం జరిగిన సమర చరిత్రను పిల్లలకు తరగతి గదుల్లో చెప్పాలి.