జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ శాసనసభా నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన ఎన్నిక కాదు. మొత్తం తెలంగాణ ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నిక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలన మీద జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచనా విధానాన్ని తెలియజెప్పే ఎన్నిక ఇది. అక్కడ ఉన్న పేద, ధనిక, మధ్యతరగతి ప్రజలు ఈ ఉపఎన్నికలో ఇచ్చే తీర్పు మీద యావత్ తెలంగాణ రకరకాలుగా విశ్లేషణలు చేయడానికి ఉపయోగపడే వేదిక జూబ్లీహిల్స్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని పదేండ్ల పాలనకు, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రెండేండ్ల కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను విశ్లేషించే పరిణతిని జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రదర్శిస్తారని తెలంగాణ సమాజం ఆశిస్తున్నది.
ఒక ప్రభుత్వం మీద ఆగ్రహం ఉంటే ప్రజలు ఇప్పుడు రోడ్ల మీదికి వచ్చి నిరసన తెలియజేయడం కంటే, ఉపఎన్నికలు లేదా ఇతర ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ఒక బలమైన సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనకు, రెండేండ్ల కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడా ఏమిటనే దానిమీద ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్నది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారు. అందువల్ల 58 ఏండ్ల వలస పాలనలో తెలంగాణ ప్రజలు కోల్పోయిన శాంతి, సంక్షేమం, వ్యవసాయం, విద్యుత్తు సహా అన్ని రంగాల అభివృద్ధి మీద కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. తెలంగాణ మీద ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన ప్రజలకు మంచి చేసే అంశాల మీదనే దృష్టిపెట్టారు. కాంగ్రెస్ మీద ద్వేషం పెంచుకొని 2014కు ముందున్న పాలకులపై విచారణల పేరుతో కేసీఆర్ తన సమయాన్ని వృథా చేసుకోలేదు. తన పాలన కాలంలో తెలంగాణకు ఎక్కువ మేలు చేయడానికి ఉన్న అవకాశాల మీదే ఫోకస్ చేశారు. తెలంగాణలో ఉన్న పేదలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలకు వ్యూహరచన చేశారు.
తొలుత కాంగ్రెస్ హయాంలో ఉన్న రూ.200 పింఛన్‌ను ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు. మరోసారి ఆ పింఛన్‌ను రూ.2016కి పెంచారు. తెలంగాణకు గుండెకాయ లాంటి రైతు కోసం తాంబాలంలా ఉన్న 50 వేల చెరువులను గంగాళంలా మార్చి భూగర్భజలాల పెరుగుదలకు దోహదం చేశారు. లక్షలాది బోరుబావుల మీద ఆధారపడిన వ్యవసాయానికి ప్రాణం పోయడానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను ఇంకా పకడ్బందీగా అమలుచేశారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి తెలంగాణలో సాగు దిగుబడిని మూడున్నర కోట్ల టన్నులకు పెంచారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.పది వేల పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకానికి అంకురార్పణ చేశారు. సుమారు ఎనిమిది వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల విద్యాలయాలు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, పాల ఉత్పత్తికి ప్రోత్సాహం, వేల కోట్ల పారిశ్రామిక, ఐటీ పెట్టుబడుల కోసం టీఎస్ఐపాస్ అనుమతుల ప్రక్రియ, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు రావడానికి కేసీఆర్ ప్రభుత్వం విశేష కృషి చేసింది. హైదరాబాద్‌లో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు రావడానికి కేసీఆర్ మార్గదర్శనంలో నాటి ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన కృషి అసామాన్యమైనది.
పోలీస్ శాఖకు అన్ని రకాలుగా సాయమందించి శాంతిభద్రతల విషయంలో తెలంగాణ అగ్రభాగాన ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నరు. అన్ని రంగాల ఆదాయం పెంచడానికి ఎంతో శ్రమించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు దేశంలో ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేశారు. ఉద్యోగులకు 73 శాతం పీఆర్సీ పెంచి దేశంలో ఎక్కడా లేని విధంగా వేతనాలు అందించారు.
అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకొని సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేసీఆర్ రూపకల్పన చేశారు. అయితే, ఆరు గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలివ్వడంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చూసి తెలంగాణ ప్రజలు నిర్ఘాంతపోతున్నరు. తెలంగాణకు వెన్నుదన్నుగా నిలిచిన రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చిన హైడ్రా నిర్ణయం కూడా అందులో ఒకటి. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కుత్సిత బుద్ధితో వ్యవహరిస్తున్నది. మూడున్నర కోట్ల టన్నుల పంట పండించడంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన భూమిక పోషించింది. ఆ ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే దాన్ని వెంటనే మరమ్మతులు చేయకుండా.. రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, బీఆర్ఎస్ను బదనాం చేయడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నించింది. పైగా కేసీఆర్, బీఆర్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి తమ దుర్బుద్ధిని చాటుకున్నది. మిషన్ భగీరథ పథకాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. ఆసరా పింఛన్‌ను రూ.4 వేలకు పెంచకపోగా, రెండు నెలలు ఎగనామం పెట్టిండ్రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల నిర్వహణను కాంగ్రెస్ పాలకులు పూర్తిగా గాలికొదిలేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో, సభల్లో వాడుతున్న భాష గురించి చెప్పనక్కరలేదు. ఆర్థిక శాఖలో బిల్లుల మంజూరు విషయంలో పర్సంటేజీల గురించి కథలు కథలుగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో కరోనా సమయంలో మినహా ప్రతి ఏటా రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు పది శాతం పైనే నమోదైంది. ఇప్పుడు పెరుగుదల లేకపోగా మైనస్‌లోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆర్థిక పురోగతిలో దేశంలో నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ ఇప్పుడు చివరి స్థానంలో ఉండటం కాంగ్రెస్ అధమ పాలనకు నిదర్శనం.
ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆదరణ, కేసీఆర్ పాలన మీద సానుకూలత, గోపీనాథ్ ఎమ్మెల్యేగా అందించిన సేవలతో సునీతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నేపథ్యం గురించి పలు విమర్శలు ప్రచారంలో ఉన్నయి. బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నా అది నామమాత్రమే అనే చర్చ ఉంది. ప్రధానంగా ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత, అద్భుతంగా నడుస్తున్న కేసీఆర్ పాలనను దూరం చేసుకున్నామనే భావన తెలంగాణ ప్రజల్లో కలుగుతున్నది. అయితే జూబ్లీహిల్స్ ఓటర్లు ఇంకా చైతన్యాన్ని ప్రదర్శించి బీఆర్ఎస్కు భారీ మెజారిటీ అందిస్తే అది కాంగ్రెస్ పాలనపై కొంత వరకైనా ప్రభావం చూపుతుంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల తరఫున ఇంకా గట్టిగా నిలబడి కొట్లాడటానికి ఆ గెలుపు దోహదపడుతుంది. జూబ్లీహిల్స్ ఓటర్ల పరిణతితో కూడిన తీర్పు కోసం యావత్ తెలంగాణ ఆసక్తితో ఎదురుచూస్తున్నది.