కుట్ర‘దారు‘ల్లోకి తెలంగాణను మళ్లించగలమని మళ్లీ మునుపటి శత్రు మూకలు భ్రమ పడుతున్నాయి. పెట్టుబడిదారులు పన్నాగంతోనే పవన్ కల్యాణ్ పాత్రను ప్రవేశపెడుతున్నారు. కాకపోతే నరేంద్రమోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి వేసిన పాచిక ప్రారంభంలోనే తెలంగాణ సమాజానికి పట్టుబడిపోయింది. తెలంగాణ రాష్ర్టానికి పవన్ కల్యాణ్ కొత్త మొఖమేం కాదు కదా! రాష్ట్రం ఏర్పడి నాలుగు కోట్ల మంది పండుగ జరుపుకుంటుంటే, కడుపు మండి ముద్ద సహించక ఉపవాసంతో నిద్రలేని రాత్రులు గడిపినవాడు. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారంటూ పార్లమెంట్లో నరేంద్రమోదీ మాట్లాడినట్టే, పవన్ కూడా కడుపు మంటను ఎప్పుడో బయటపెట్టుకున్నడు. తెలంగాణకు ఉన్న విలన్ల సరసన పవన్ కల్యాణ్ ఏనాడో చేరిపోయాడు.
తెలంగాణలో తమ ఆటలు సాగడానికి పవన్ పావుగా పనికొస్తాడని ముగ్గురు నేతలు పగటి కలలు కంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే పవన్ కల్యాణ్ సభకు సిద్ధపడ్డట్టు, శిష్యుడు అనుమతి నిరాకరించినట్టు నాటకాన్ని ప్రదర్శించారు. నరేంద్రమోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఊహించినట్టే రచ్చ జరిగింది. కడుపు మంట చల్లారని పవన్ కల్యాణ్ మాత్రం మళ్లీ తెలంగాణపై నోరు పారేసుకొని విలనిజం ప్రదర్శించాడు. త్యాగాల తెలంగాణను ఉద్దేశించి ‘ఎవరయ్య జాగీరో’ చర్చకు పెట్టాడు. దేశ సమైక్యతకు పెను ముప్పంటూ తెలంగాణ పరిరక్షణ వాదంపై విషం చిమ్మాడు. సూత్రధారులు ఫ్యాక్షనిస్ట్ ధోరణిలో ఎవరి ప్రయోజనాల కోసం పవన్‌తో రాజకీయ ఏకపాత్రాభినయం చేయిస్తున్నారనే అంశంపై భిన్న కోణాల్లో చర్చ జరుగుతున్నది.
వాస్తవానికి పవన్ కల్యాణ్ తెలంగాణలో చేస్తున్న హడావుడిపై చర్చించాలంటేనే వికారం కలుగుతున్నది. ఆధారాలతోపాటు దొరికిన దొంగపై లోతైన విచారణ జరిపి, ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చాలని అన్నట్టుగా అర్థం లేని పనిలా అనిపిస్తున్నది. పవన్ కల్యాణ్ వరకే చూస్తే ఇలా తోయడం మామూలే. కానీ దశాబ్దం నుంచి తెలంగాణపై పేనుతున్న కుట్రలు, గడిచిన రెండున్నరేండ్లుగా వాటి అమలు కోసం దుస్సాహసం చేస్తున్న శక్తులను తెలంగాణ సమాజం స్పష్టంగా గమనిస్తూనే ఉన్నది. జరుగుతున్నవి అన్నీ కూడా ఒక పెద్ద కుట్రలో భాగమేనని ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే సమైక్య పాలనలో ఇలాంటివి ఎన్నో చూసి ఉన్న సమాజమిది.
మరీ ముఖ్యంగా రేవంత్‌రెడ్డి సర్కార్ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, అభివృద్ధికి చేసిన నష్టాన్ని అనుభవంలో నుంచి అర్థం చేసుకున్నది. పవన్ కల్యాణ్ తన సొంత రాష్ట్రంలో ఎవరికి ఎలా ఉపయోగపడ్డాడో, గడిచిన ఎన్నికల్లో ఏ పాత్రలు పోషించాడో మన రాష్ట్రంలోని ఆలోచనాపరులందరికీ అవగాహన ఉన్నది.
2014 ఎపీ ఎన్నికల్లో అనుభవాన్ని గెలిపిద్దామంటూ పోటీకే నిలుపకుండా టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు చెమటోడ్చాడు. 2019 ఎన్నికల్లో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చి మళ్లీ చంద్రబాబుకు మేలు చేయాలనే పోటీ చేసి పల్టీలు కొట్టి భంగపడ్డాడు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎప్పటిలానే చంద్రబాబుకు చేదోడుగా నిలిచి కుర్చీనెక్కించాడు. జనసేనను సొంత రాష్ట్రంలోనే చంద్రబాబు పార్టీకి అనుబంధ విభాగంగా పనిచేయిస్తున్నాడు పవన్ కల్యాణ్.
అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు కలల సాకారం కోసం కాకుండా ప్రజల కోసమో, జనసేన కార్యకర్తల కోసమో పార్టీని నడిపిస్తాడని ఎవరైనా ఎలా అపోహ పడగలరు? కాకపోతే తెలంగాణ రాజకీయాల్లో కలకలానికి కష్టపడి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార రథారోహణ చేయవచ్చు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి నరేంద్రమోదీ, అమిత్‌షాకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కమలానికి మద్దతుగా ప్రచారం చేస్తుండవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర విరోధుల భుజాలపై నిలబడి వికసించాలని ఉవ్విళ్లూరుతున్న కమలం పార్టీకి మాత్రం రాష్ట్రంలో అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.
అయితే అనూహ్యంగా దక్కిన ముఖ్యమంత్రి పదవితో అందినకాడికి పని కానిచ్చేస్తున్న రేవంత్ మాత్రం, ఈ హడావుడితో తనకు జరుగుతున్న మేలును వెతుక్కుంటున్నట్టు కనిపిస్తున్నది. మళ్లీ ఎలాగూ గెలిచేదే లేదు. కనీసం పవన్ కల్యాణ్ లాంటి ఎక్స్ట్రా క్యారెక్టర్లు సృష్టించే రాజకీయ కాలుష్యంలో తాము చేస్తున్న మోసాలపై చర్చ పక్కదారి పడుతున్నదిలే అని మురిసిపోతున్నరేమో! కానీ ఉద్యమం నెలబాలుడులో జనం పదునెక్కారు/ నీ విద్రోహాన్ని నిలువునా కోస్తారు/ జనం పోరాటం చవి చూచారు/ నీ బూటకత్వాన్ని లోతుగా తవ్వితీస్తారు అని అన్నట్టుగా తెలంగాణ ప్రజలే కుట్రదారుల ఆశలన్నిటికీ గుణపాఠం చెప్పి తీరుతారు.
కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ అన్ని రంగాల్లో తల్లడిల్లుతున్నది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో కుదేలైంది. రైతు సంక్షేమం, మహిళా సాధికారత మృగ్యమయ్యాయి. అభివృద్ధి పనులు భూతద్దంలో చూసినా కనిపించడంలేదు. తెలంగాణలో ప్రజల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే పుండు మీద కారం చల్లినట్టుగా పవన్ కల్యాణ్ లాంటి వ్యతిరేకులు కూడా దూరి పరాచికాలాడే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధి నినాదంలో ఆత్మ గౌరవమే హృదయంలా ఉన్నది. తెలంగాణ చరిత్రలో యువతరం ఉద్యమ స్ఫూర్తి తెలిసిందే. నేడు కూడా అన్ని వర్గాలతోపాటు యువతరం క్రియాశీలకంగా ఉన్నది. తెలంగాణ బిడ్డలతోపాటు జీవితాన్ని ఈదుతూ వచ్చిన సెటిలర్లకూ కేసీఆర్ కల్పించిన అవకాశాలపై స్పష్టత ఉన్నది. కాబట్టి కుట్రదారుల కలలకు యావత్తు తెలంగాణ ఏకతాటిపై నిలిచి సమాధి కట్టడం ఖాయం.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయగౌడ్