గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగ సారం ఒక్కముక్కలో తేల్చి చెప్పాలంటే.. మిగతా పార్టీలకు తెలంగాణ అంటే రాజకీయం; మనకు తెలంగాణ అంటే టాస్క్ అని! మిగతా పార్టీలకు వాటి పుట్టుక మాత్రమే చరిత్ర; మనకు తెలంగాణ జీవనయానమే చరిత్ర. మన ప్రస్థానం, మన బతుకు చిత్రం వేర్వేరు కాదు. మనం అధికారంలోకి మరలా వస్తం, అది కాదు విషయం. తెలంగాణను తిరిగి యెట్లా నిలబెట్టాలె అన్నదే అసలు విషయం. ఇది ఉత్తి మాట కాదు. ఒక మహా స్వాప్నికుడు తన ప్రజల కోసం రాసుకున్న మ్యానిఫెస్టో.
తాను నేడేమి కోల్పోతున్నదో ఎరుకతో ఉన్నది తెలంగాణ; గాయపడి ఉన్నది తెలంగాణ; తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నది తెలంగాణ. పదేండ్ల కేసీఆర్ పాలనలోఅన్ని అభివృద్ధి సూచీలలో, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలించింది తెలంగాణ. కేంద్ర ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, ఆర్బీఐ తెలంగాణ ప్రగతి నివేదికలు బయట పెడుతూ మన రాష్ర్టానికి ఎన్నో అవార్డులూ, రివార్డులూ ఇచ్చిన సంగతి విదితమే! ఇటీవలే ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సురేశ్‌రెడ్డి రాజ్యసభలో సగర్వంగా ఎలుగెత్తి చాటిన్రు. నిత్యం కేసీఆర్‌ను ఆడిపోసుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలోనే పదేండ్ల తెలంగాణ అద్భుత ప్రగతిని ఆర్బీఐ మాజీ గవర్నర్, బ్రిటన్ మాజీ ప్రధాని కొనియాడిన్రు. ఇంతటి ఘనకీర్తి గల్ల తెలంగాణను బీజేపీ ఎంపీ తేజస్విసూర్య లోక్ సభలో తూలనాడుతూ ఉంటే మన రాష్ట్ర ఒక్కరంటే ఒక్కరు అడ్డు చెప్పకపోవడం మన రాష్ట్రం చేసుకున్న దురదృష్టం.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెరి ఎనిమిది మంది, మజ్లిస్ ఎంపీ ఒకరు మొత్తంగా 17 మందిలో ఏ ఒక్కరూ పన్నెత్తి పలుకలేదు, కన్నెత్తి చూడలేదు. ‘ఇంతమంది వీరులూ శూరులూ ఉన్నారు, కులసతికి ఘోర అవమానం జరుగుతూ ఉంటే ఒక్కరూ మాట్లాడరా? అంటూ (అ)గౌరవ కౌరవ సభలో ఆక్రందనలు చేసిన ద్రౌపది పరిస్థితి తెలంగాణది. తెలంగాణపై ఏనాడూ ప్రేమ చూపని ధృతరాష్ట్రుడంటి రాజకీయ పుట్టుగుడ్డి మోదీ; అన్నీ తెలిసి మౌనం దాల్చే గాంధారి లాంటి కట్టుగుడ్డి రాహుల్ గాంధీ. హస్తి(న) నలిపేస్తున్న మశకం మనం!
ఎంతకాలం సాగాలి ఈ దాష్టీకం? తెలంగాణ పల్లెల నుంచి పాలనా సౌధం దాకా; మార్చేస్తున్న విగ్రహాల నుంచి కోల్పోతున్న నిగ్రహాల దాకా అసమాన కీర్తి నేడు అవమానపడటం ఎంతటి నమ్మక ద్రోహం! పార్టీలు ఏవైనా, ఆత్మ మిగిలితేనే కదా అస్తిత్వం?
గత వైభవం ఒకసారి పరికిద్దాం… ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలోనే ప్రకటించిన్రు 2014-24 మధ్యకాలంలో తెలంగాణ జీడీపీ 15 లక్షల కోట్లు దాటిందని. కేసీఆర్ పాలనలో రూ.3.25 లక్షల కోట్ల పెట్టుబడులు; ఐటీ ఎగుమతుల్లో 31% వాటా; జీఎస్డీపీ, తలసరి ఆదాయం, సాగువిస్తీర్ణం అన్నింట్లోనూ తెలంగాణ రికార్డ్ అని MSME-EPC కితాబిచ్చింది.
ఊసర క్షేత్రాలు సస్యశ్యామలమై, సంపదభిరామమైన చరిత్ర మన కండ్లముందే ఉన్నది. రైతుబంధు సవ్యంగా, సకాలంలో ఇచ్చి, పండిన పంటను లాభసాటి ధరకు కొంటే… రైతులు అప్పులపాలు కారు; రుణాల ఊబిలో కూరుకుపోరు; సోనియమ్మ పుట్టిన రోజు గిఫ్ట్ కోసం ఏండ్ల తరబడి ఎదురు చూసే దౌర్భాగ్యంలోకి తోసివేయబడరు! పదేండ్ల బంగారు పాలనలో ప్రజానీకం పొందిన ఊరట గురించి నేను రాసే కంటే, ఇపుడు అది కోల్పోయిన జనం పెడుతున్న శాపనార్థాలు, బూతులు సవివరంగా చెపుతయి; హైడ్రా బుల్డోజర్ కింద నలిగిన పేదల ఆక్రందన ఎరుక చేస్తది; అంతులేని దాహంతో హిరణ్యాక్షుడిలా భూమిని చాపచుడుతున్న ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం, కొందరు క్యాబినెట్ మంత్రుల నిర్వాకం తేటతెల్లం చేస్తుంది!
సీఎం దగ్గర ఉన్న శాఖలన్నీ పడకేసినయి. అవి నానాటికీ తీసికట్టు అవుతున్న విద్య కావచ్చు, దారుణంగా విఫలమైన శాంతి భద్రతలు కావచ్చు, కటిక నేల మీద పడుకోబెట్టి లేదా చేతులకు బేడీలు వేసి అందిస్తున్న వైద్యం కావచ్చు! సాధారణంగా తండ్రి వంటి పాలకుడిని అన్నమో రామచంద్రా అని అర్థిస్తరు అన్నార్తులు. ‘మీరు పెట్టే అన్నం వద్దు మహాప్రభో’ అంటున్నరు హాస్టల్ విద్యార్థులు. రేవంత్‌రెడ్డి ద్వేషం నికార్సయినది కానీ ఆయన ఒలకబోసే ప్రేమ విషతుల్యం! కాబట్టే, నేడు ప్రజాభవన్ వెలవెల పోతున్నది; తెలంగాణ భవన్ జనజాతర అయితున్నది.
కాంగ్రెస్ పార్టీలోనూ తెలంగాణ పట్ల ప్రేమగల్ల కొందరు నేలు రేవంత్‌రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకు కుతకుత ఉడుకుతున్నరు. ఎందరో ఎమ్మెల్యేలు బాహాటంగానే సీఎంను విమర్శిస్తున్నరు. పెద్దలు తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శ, ఆవేదన అంతా ప్రజలకు ఏమీ ఒరగడం లేదని, తామిచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నదని. విధానపరంగా చూస్తే రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపు నిరోధక చట్టానికి తనయుడు తూట్లు పొడుస్తున్నాడని; కొత్త బిచ్చగాడంటి శిష్యుడు సమైక్యవాదులకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తూ.. అటు తెలంగాణను, ఇటు పార్టీని అమ్ముకుంటున్నడని! కాబట్టే, ఇంకా సగం పాలనాకాలం ఉండగానే అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వస్తున్నరు జీవన్‌రెడ్డి. అట్టడుగు స్థాయి నుంచి, ప్రజల మనసులు గెలిచి వచ్చి, నాలుగు దశాబ్దాల మచ్చలేని వ్యక్తిత్వం ఉన్నవారు కాబట్టే, తెలంగాణ క్షేత్రంలో ప్రజలు ఇప్పు ఏమి ఆశిస్తున్నరో తెలుసు కాబట్టే, కేసీఆర్ మరలా ముఖ్యమంత్రి కావాలని, అప్పుడే జనజీవన స్థితిగతులు మారుతాయని భావిస్తున్నరు, అందుకే వస్తున్నరు. రేపటి జగిత్యాల జైత్రయాత్ర 2.Oకు ఇంతటి ప్రాముఖ్యం ఉన్నది; నలభైయేండ్ల క్రితపు జైత్రయాత్రకు సామీప్యం ఉన్నది.
రేపు ఈ జాతర జగిత్యాల జైత్రయాత్ర 2.Oలా మారబోతున్నది. తెలంగాణ ప్రజల హృదయాధినేత జగిత్యాల గడ్డపై నుంచి గర్జించబోతున్నరు. 1978 సెప్టెంబర్ 9న లక్షలాది మంది రైతు కూలీల భారీ బహిరంగ సభ జగిత్యాల జైత్రయాత్రగా స్థిరపడింది. నాటి తెలంగాణ, అచ్చు నేటి రేవంత్ పాలనలోని తెలంగాణలానే ఉండింది. భూతగాదాలు, కుటుంబ తగాదాలు, చివరికి భార్యాభర్తల గొడవల పరిష్కారం పెద్దలే చూపాలి. ఇందుకోసం జనం పంచాయితీ పెద్దల వద్ద వేలాది రూపాయలు ‘దడువత్’ ముట్టజెప్పాల్సి వచ్చేది, నేటి సచివాలయంలో మంత్రుల ‘కమీషన్ పట్టిక’లాగ! తప్పొప్పులను, న్యాయాన్యాయాలను, ప్రశ్నించే సాహసం చేయకూడదు, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కానీ, న్యాయస్థానాలు కానీ వెళ్లవద్దు. ఇది గ్రామ పెద్దల హుకుం. నేడు ‘ప్రశ్నిస్తే అరెస్టులు; ప్రశ్నించకుండా హేట్ స్పీచ్ బిల్లు’లాగ.
నాటి జైత్రయాత్ర ముఖ్య ఉద్దేశం భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం! నేటి జైత్రయాత్ర దోపిడీ పాలకుల నుంచ తెలంగాణ విముక్తి కోసం. నాటి సభతో అణగారిన వర్గాల్లో ప్రశ్నించే దమ్ము ధైర్యం వస్తే నేటి సభ మూడేండ్ల సర్వభ్రష్టతను నిలదీసే స్ఫూర్తి ఇస్తుంది అనేది వాస్తవం. నాటి సభ మానవ హక్కులు, అస్తిత్వ సాహిత్యానికి పురుడు పోస్తే, నేటి సభ మౌన మునులుగా ఉన్న మేధావులను ఆలోచనలో పడవేస్తది, లేదా కొత్త మేధావులను తయారు చేస్తది. నాటి ప్రభుత్వం జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి, పోలీసు బలగాలను గ్రామ గ్రామాన దించి, క్యాంపులను ఏర్పాటు చేసింది. నేటి ప్రభుత్వం అంతకంటే అణచివేతను ప్రయోగిస్తున్నది.
కానీ పాలకుడికి తెలియనిది ఏమంటే, అరచేయి కాదు.. అబద్ధపు పూర్తి ‘చేయి’ అడ్డు పెట్టినా, ప్రజా సూర్యులను ఆపలేరు, తెలంగాణకు వెన్నెల వెలుగులు పంచే చంద్రుడినీ తాకలేరు!
భేషజాలు పక్కన పెట్టేస్తే ఎవరైనా అనగలిగే మాట తండ్రి లాంటి కేసీఆర్ మళ్ల ఎపుడు ఒస్తడో అని.. ఇపుడు తెలంగాణ తపిస్తున్నది. భూమి పుత్రుని ఏలుబడిలోని వసంతమాసం మరల రావాలని గ్రీష్మతాడిత వనంలా రాష్ట్రం ఎదురుచూస్తున్నది. మోసపోయిన జనం ఇపుడు జాగరూకులు అయితున్నరు.
ఫిబ్రవరి 20 నాటి ‘తెలంగాణ బిల్ ఈజ్ పాస్డ్ అన్న పార్లమెంట్ అమృత వాక్కులు రేపు ఏప్రిల్ 20న జగిత్యాల జైత్రయాత్రలో తెలంగాణ విల్ పాస్ అన్న నినాదం రూపంలో మనందరికీ కర్తవ్యం బోధిస్తుంది. వారం రోజుల్లో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జగిత్యాల సరైన Curtain Riser!
జై తెలంగాణ!
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల
90309 97371