ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పులిలా ఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారు. అలా ఎందుకయ్యారని ఆయనను మీడియా ప్రశ్నించగా.. ‘2021లో రాహుల్‌గాంధీ నా నుంచి మాట తీసుకున్నారు. ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు.. అంతేకానీ మీడియాకు ఎక్కొద్దని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటున్నా’ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లోకి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? అని గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా ప్రశ్నించగా.. ‘ఆ విషయాలు సీఎం చూసుకుంటారు. నాకు తెలిసినా మీకెందుకు చెబుతా? రాహుల్‌గాంధీకి చెవిలో చెబుతా’నంటూ దాటవేశారు.
‘కుక్క పిల్లా.. సబ్బుబిళ్లా.. అగ్గి పుల్లా కాదేదీ కవితకనర్హం’ అన్న శ్రీశ్రీ మాటలను కరెంటోళ్లు అక్షరాల పాటిస్తున్నారు. ‘మా కాలనీలో కరెంట్ పోయింద’ని ఎవరైనా ఫోన్ చేస్తే.. వైర్ల మీద తొండ పడిందని, ట్రాన్స్‌ఫార్మర్‌లో బల్లి ఇరుక్కుపోయిందని విచిత్రమైన సాకులు చెప్తున్నారని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో ఉన్న రాధాకిషన్‌రావుకు పిల్లి కరవడంతో తీవ్ర రక్తస్రావం అయినట్టు మీడియాకు ఉప్పందింది. దీంతో ‘అధికారులు వేటినీ వదలిపెట్టడం లేదు, చివరికి తొండలు, పిల్లులు, బల్లులనూ బలి పశువులను చేస్తున్నారు పాపం’ అని సెటైర్లు వేస్తున్నారు.
కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది తెలంగాణ కమలనాథుల వైఖరి. తెలంగాణకు విభజన చట్టంలో చట్టబద్ధంగా కేంద్రం ఇచ్చిన హామీలపై ఏనాడూ నోరు మెదపని బండి సంజయ్.. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’గా మారుస్తానని చెప్పడం కూడా అచ్చం అలాగే ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
అధికార ప్రతినిధుల ద్వారా రాజకీయ పార్టీలు.. సమాచార, పౌరసంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు అధికారిక సమాచారం ఇవ్వడం ఆనవాయితీ. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ లీకులపై అధికారికంగా వివరణ ఇచ్చేందుకు ఏకంగా ఇద్దరు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నియమించడం మాత్రం విడ్డూరం.