“ఈయన సావు మా సావుకే వచ్చినట్టుంది.. సచ్చిండని ఏడ్వాల్నా.. లేదా సచ్చినోన్ని ఎట్లా సాగనంపాలి.. ఏడ కాలేయాలని ఏడ్వాల్నా ? సచ్చినోడు మంచిగనే పోతడు.. ఉన్నోడే సచ్చినోన్ని ఎట్ల పంపించాలో తెలియక సచ్చే సావచ్చిపడుతాంది. సావు కట్టాలు ఎప్పుడు తీరుతాయో.. సచ్చిన మనిషికి సంతృప్తి ఎప్పుడు దొరుకుద్దో..”
– తెలంగాణ రాక ముందు ప్రజల దుస్థితి ఇది.
“సచ్చిన వారి గురించి బెంగ తప్ప బాధ లేదు! అయినవారిని ఆత్మీయంగా.. గౌరవంగా సాగనంపేందుకు సకల సౌకర్యాలున్న వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి. భయం గొలపాల్సిన మరు భూములు ప్రశాంతంగా.. ఆహ్లాదంగా ఉద్యానవనాలను తలపిస్తున్నాయి. చనిపోయినవారి ఆత్మలు శాశ్వతంగా ఇక్కడే నిద్రించే పరిస్థితులు ఏర్పడ్డాయి.”
– స్వరాష్ట్రంలో ప్రజలు సంతృప్తితో అంటున్న మాటలివి.
జోరున వాన.. మోకాళ్ల లోతు నీళ్లు.. ఇంటి ముందు జీవిడ్సిన మనిషి. వచ్చేవారు వస్తూనే ఉన్నారు.. చూసెళ్లేవారు వెళ్తూనే ఉన్నారు. ఎంత ఏడ్చినా పోయిన మనిషి రాడు.. ఎంతసేపు ఆగినా దహన సంస్కారాలు చెయ్యక ఆపేవి కాదు. ఇంటి పెద్దను అందరూ ఓదారుస్తున్నారు.. ధైర్యం చెబుతున్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎంత వెన్నంటి నిలుస్తామన్నా ఆయనలో మాత్రం ఎక్కడో ఏదో తెలియని భయం వెంటాడుతూనే ఉంది. పెద్దాయన కండ్లలో ఆ బాపతు కార్యాలు ఎలా జరపాలనే దిగాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. తెరిపిలేని వానతో శవాన్ని కదిలించి ఏడికి తీసుకెళ్లాలనే బాధ వెంటాడుతూనే ఉంది. తగలేయడానికి కట్టెలు లేవు… అంతిమయాత్రగా వెళ్దామంటే రోడ్లు లేవు.. ఆ మాటకొస్తే ఆఖరి తంతు జరిపించడానికి ఎలా ఏర్పాట్లు చేయాలో తెలియని గందరగోళ స్థితి అతడిలో సుస్పష్టం. పోయిన వ్యక్తిని తల్చుకుని బాధపడాలా.. జరగాల్సింది ఎలా చేయాలని కుమిలిపోవాలా తెలియని గందరగోళం.
రాష్ర్టావిర్భావానికి ముందు తెలంగాణలో అంతిమ కార్యాలను తలుచుకుని ఉలిక్కి పడని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో. గ్రామాల్లో అయితే పట్టా భూములు, సర్కార్ భూముల్లో పట్నం తుమ్మల్లో చేయాల్సిందే. కాస్తో కూస్తో భూమున్న వారికైతే సరే గానీ, అస్సలే భూమి లేని వారైతే ఏ చెరువు గట్టునో.. కాలువ ఒడ్డునో దహనం చేయాల్సిందే. ఆ పూటకైతే అయిపోయింది అనిపిచ్చుకున్నట్టే గానీ ఆ తర్వాత పిట్టముట్టుడు, ఐదొద్దులు, తొమ్మిదొద్దులు, ఆఖరి దినం అనే సంప్రదాయ తంతు జరిపే వరకు బొక్కలుంటాయో.. కుక్కలు ఎత్తుకెళ్తాయో అనే భయంతోనే గడిపిన దుర్దినాలు. అందరికీ అన్నీ అయినా వ్యక్తికి అనాథగా అన్నీ జరిపించాల్సిన దయనీయమైన పరిస్థితులుండేవి. భూములున్న రైతులు కూడా గెట్టు పంచాయితీలనో, భూములు తడిసినాయనో అంతిమ కార్యం చేయడానికి నానా ఇబ్బందులు పడేవారు.
తప్పని సరే అయినా చావంటేనే ఏదో తెలియని భయం. బతికినప్పుడు పెనవేసుకున్న ఎంతటి ఆత్మీయ అనుబంధమైనా చచ్చిన తర్వాత మనిషి దగ్గరకు వెళ్లడానికే జంకే పరిస్థితి. శ్వాస విడిచిన జీవిని సాధ్యమైనంత త్వరగా సాగనంపడానికే చూస్తాం. సరిగ్గా ఆ సమయంలోనే అందరి మదిలో మెదిలేదే శ్మశాన వాటిక. ఎవరికీ నచ్చని ప్రాంతమే అయినా మనస్సు స్థిమితపర్చుకుని మరీ వెళ్లాల్సిందే. పోయిన ఆత్మకు శాంతి కలగాలంటే జరిపించాల్సిన తంతుక్రమం తప్పకుండా చేయాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చచ్చిన తర్వాత సాగనంపాలంటే ఓ సాహసమే. మిగతా దినకర్మలు చేయాలంటే తెగింపుగానే ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాధ పడకుండా, ఇబ్బందులు లేకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించే సౌకర్యాలు ఏర్పడ్డాయంటే.. దానికి సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవే కారణం.
ఎల్బీ నగర్ నాగోల్ పరిధి ఫతుల్లాగూడలో నిర్మించిన ఆధునిక శ్మశాన వాటిక నభూతో నభవిష్యత్. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వారు ఒకే చోట తమ అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే సౌకర్యాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దే. అత్యాధునిక వసతులతో నిర్మితమైన ఈ మరు భూమిలో జరిగే అంత్యక్రియల తంతును విదేశాల్లో ఉన్న బంధువులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు జరిగాయంటే ఎంత అద్భుతమైన పనితనమో అర్థం చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ, పంజాగుట్ట వంటి ఎన్నో శ్మశాన వాటికలు కొత్త రూపును సంతరించుకున్నాయి.
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఓ శ్మశాన వాటికలో ఉన్నతాధికారులు ప్రశాంతంగా విందు ఆరగించిన సందర్భాలనూ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతే చూశాం. హన్మకొండ జిల్లా కేంద్రంలోని 57వ డివిజన్ వాజ్‌పేయి కాలనీలో వైకుంఠ ధామం చూస్తే కండ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒకప్పుడు మొండి గోడలు, కచ్చా రోడ్లు, అంతంత మాత్రంగా నీటి సదుపాయం, వెలగాలా వద్దా అన్నట్టుండే లైట్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే శవం కూడా మొహం తిప్పుకునే అంతటి వికారమైన మరు భూమి. శ్మశాన వాటిక లంటేనే భయంకర ప్రాంతాలుగా, అటుగా వెళ్తే దయ్యాలు, భూతాలు తిరుగుతాయన్నంత దయనీయంగా గత ప్రభుత్వాలు ప్రచారం కల్పించిన దాఖలాలు కనిపించేవి. కానీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ మధ్యే అది రుద్రేశ్వర వైకుంఠధామంగా రూపాంతరం చెందింది. అందులో జరిగిన పనులు, చేసిన ఏర్పాట్లు, కల్పించిన వసతులు అత్యద్భుతం.
మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా స్నానపు గదులు, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సంస్కారాలకు అంతరాయం కలగకుండా నిర్మించిన ప్లాట్ ఫామ్స్, ఎల్లవేళలా నీటి వసతి, సోలార్ విద్యుత్తు వెలుగులు, కళ్లు జిగేల్మనేలా సెంట్రల్ లైటింగ్, ఎత్తు పెరిగిన గోడలు, వాటికి రక్షణ వలయాలు, మరుభూమి లోపల పార్క్ పరిశీలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం, చిత్తశుద్ధి అక్కడి ప్రతి ఏర్పాటులో, ప్రతి సౌకర్యంలో కనిపిస్తుంది. రూ.4 కోట్లతో జరిగిన పనులు చూసి రుద్రుడే పరవశ నాట్యం చేసే పరిస్థితి అంటే అతిశయోక్తి కాదు.
ఈ నెల 9న మంత్రి కేటీఆర్ నిజామాబాద్‌లో ప్రారంభించిన శ్మశానవాటికను చూస్తే ఎంతో సుందరంగా కనిపిస్తున్నది. ప్రాణం ఉన్నప్పుడే కాదు, శ్వాస విడిచిన తర్వాత కూడా మనిషి బతికుండేలా నిర్మించిన శ్మశాన వాటికలు తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఓ ప్రాంతం, అక్కడే అన్ని జరుపుకునేలా ఏర్పాట్లు, చచ్చిన వ్యక్తి సంబంధీకులు మా సావుకొచ్చింది అనే మాటలు మానేసే విధంగా ఆధునిక వైకుంఠ ధామాల నిర్మాణం ఇది వరకు వినని.. కనని సదుపాయం.
– రాజేంద్ర ప్రసాద్ చేలిక 99858 35601