ఎట్లుండే తెలంగాణ? ఇప్పుడెట్లున్నది! ఔ.. బరాబర్ ఇది బరి గీసి అడగాల్సిన సవాల్! బరిగీసి కొట్లాడినోళ్లం కదా బరాబర్ అడిగి తీరాల్సిన ప్రశ్నే ఇది! ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల కోసం, నిధుల కోసం, అంతెందుకు, ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం అంగలార్చినోళ్లం కదా మనమంతా? మరి ఇప్పుడు నా తెలంగాణ, సిరిగల్ల మా బంగారు తెలంగాణ అంటూ గల్లా ఎగరేసి మరీ చెప్తలేమా? ఈ గర్వం కేసీఆర్ ఇచ్చిందే కదా? నాడు తెలంగాణ అంటే రాళ్లు రప్పలు, తెలివి లేనోళ్లు, పొద్దున లేవలేనోళ్లు, తాగుబోతులు అంటూ పనిగట్టుకొని ఇజ్జత్ తీసినోళ్లే ఇప్పుడు ఈ తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారంటే కేసీఆర్‌ది క్రెడిట్ కదా? తీసివేతలు చా లా ఉన్నాయంటారా? సరే కూడికలు ఏమి లేవా? బరాబర్ ఉన్నాయి! తీసివేతలున్నాయి, కూడికలున్నాయి లెక్కలున్న చోట అన్నీ ఉంటాయి.
తెలంగాణను కేసీఆర్ కుటుంబం మాత్రమే పరి పాలిస్తోందని, కుటుంబ పాలన అని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. సరే అసలు ఈ దేశంలో కుటుంబ పాలనకు అంబాసిడర్ కదా కాంగ్రెస్. అలాంటప్పుడు వారసత్వ రాజకీయాలను విమర్శించే హక్కు ఆ పార్టీ కెక్కడిది? వాళ్లు గర్వంగా ప్రకటించుకున్న ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌నే తెగనరికి భార్యాభర్తలకు టిక్కెట్లు ఇచ్చుకున్న గురివింద నీతి కదూ కాంగ్రెస్‌ది? మాట్లాడితే కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేస్తమని కాంగ్రెస్ నేతలు చెప్తున్నరు. కరెంట్ లేక ఆ కన్నడ రైతులు ఆక్రందనలు చేస్తున్నరు. సబ్స్టేషన్లలో మొసళ్లు వదిలి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు! హామీలు, గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం మన్నించండి మహాప్రభో అంటూ కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ముక్కు నేలకు రాస్తున్నారు! అంతెందుకు కర్ణాటక రైతులు కొడంగల్ నుంచి హైదరాబాద్ వరకు నిరసనలు వ్యక్తం చేస్తే వాళ్లపై దాడి చేసింది ఇదే కాంగ్రెస్ కాదా? ఎట్ల నమ్మాలి వీళ్ల జూఠా మాటలను? ఎట్ల నమ్ముతం కాంగ్రెస్ పసలేని గ్యారెంటీలను, హామీలను? జర సోచో!
కేసీఆర్ మాత్రమే తెలంగాణను పరిపాలించాలా? వేరెవ్వరూ వద్దా? అంటే వై నాట్? ఇది ప్రజాస్వా మ్యం! మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నిరాటంకంగా అమలవుతున్న దేశం మనది! ఎవరైనా అధికారంలోకి రావచ్చు! నిర్ణయించాల్సింది ప్రజలు. ఎందుకంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు, న్యాయనిర్ణేతలు. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయనేది వాస్తవం! లోపాలున్నాయి నిజమే సరిచేసుకుందాం! సమాధానాలు రావాలి నిజమే ప్రశ్నిద్దాం!
తెలంగాణ మేమే ఇచ్చినం అంటూ మైకులు విరిగిపోయే స్పీచ్‌లు ఇచ్చేటోళ్లకు ఉండేది అధికార దాహం! ఊపిరిని అడ్డువేసి తెలంగాణ తెచ్చుకున్నోళ్లకు ఉన్నది, ఉండేది మమకారం. వేరేవరికి లేని మమకారం! అందుకే మరోసారి కేసీఆర్‌కు సహకారం అందిద్దాం. తప్పైయినా ఒప్పైయినా సరే మనమే చూసుకుందాం! మనం మాత్రమే చూసుకుందాం!
– విజయ్ సాధు