ప్రజాపాలన అంటూ బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు వరుస అవమానాలు ఎదురవుతుండటం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రొటోకాల్ నిబంధనల విషయంలో సముచిత గౌరవం దక్కడం లేదు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం కలిగిన పేద వర్గాల ప్రజాప్రతినిధుల విషయంలో.. ‘నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించిన’ చందంగా రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుండటం అత్యంత బాధాకరం. ఇక, ఇందిరమ్మ రాజ్యంలో మొదటి పార్టీ బహిష్కరణ వేటు కూడా దళిత సామాజికవర్గానికి చెందిన నాయకుడిపై పడటం గమనార్హం.
హస్తం ప్రభుత్వంలో జరిగిన వరుస పరిణామాలను గమనిస్తే.. ‘కులం కేవలం తన రూపం మార్చుకుంది తప్ప, దాని సారం అలానే ఉంది?’ అనే అనుమానం కలుగుతున్నది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరగడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా జరిగిన వేదపండితుల ఆశీర్వచన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు పెద్ద పీటలు వేశారు. ఉప ముఖ్యమంత్రిని కించపరిచేలా క్యాబినెట్ మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో చిన్న పీటపై కూర్చోబెట్టడం పట్ల దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజుల్లో జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ భట్టి ఫొటోకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి.
ఇక వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఓ సందర్భంలో అవమానం ఎదురైంది. 2024 మార్చి 7న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జగ్జీవన్‌రామ్ భవన్ ప్రారంభ కార్యక్రమ అధికారిక ఆహ్వాన పత్రికలో విశిష్ట అతిథుల జాబితాలోనూ మంత్రి రాజనర్సింహకు కనీసం చోటు కల్పించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు స్వాగతం పలికేందుకు విచ్చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు చేదు అనుభవం ఎదురైంది. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ దళితులకు చుక్కెదురైంది. మొత్తం 34 మందితో కూడిన తొలి జాబితాను జూలై 8న ప్రభుత్వం ప్రకటించగా, అందులో దళిత సామాజికవర్గానికి ఒక్క పదవిని మాత్రమే కేటాయించారు. అది కూడా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి.
ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ఎంపీ టికెట్లు ఇవ్వడం సరికాదని దళిత సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ బాహాటంగా తన అభిప్రాయాన్ని తెలపగా.. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనపై ఆరేండ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. గతంలో ఏకంగా రాష్ట్ర వ్యవహారాల కమిటీ ఇన్చార్జీని పలువురు కాంగ్రెస్ నేతలు దూషించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు పార్లమెంట్ ఎన్నికల సీట్ల కేటాయింపు సమయంలో కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా రేవంత్ ఇష్టపడలేదు. ఇటీవల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సరస్వతి పుష్కరాల ప్రారంభ ఆహ్వాన పత్రికలో స్థానిక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోను ముద్రించకుండా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి అవమానపరిచారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను సహచర మంత్రి, బలహీనవర్గాల నుంచి ఎదిగొచ్చిన పొన్నం ప్రభాకర్ తీవ్ర పదజాలంతో దూషించడం విస్మయానికి గురిచేసింది.
ఒకవైపు దళిత ప్రజాప్రతినిధులకు వరుస అవమానాలు.. మరోవైపు దళితుల అభ్యున్నతికి పాటుపడతామంటూ ‘అభయహస్తం- 2023 ఎన్నికల మ్యానిఫెస్టో’లో ప్రకటించిన చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ హామీలను తుంగలో తొక్కారు. సచివాలయం ముందు అనూహ్యంగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని నెలకొల్పిన రేవంత్.. ఆ పక్కనే ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహ ప్రాంగణాన్ని ఇప్పటివరకు ఎందుకు సందర్శించలేదు? ఆ ప్రాంగణాన్ని ఎందుకు ప్రజలకు అందుబాటులోకి తేవడం లేదు? బాధితవర్గం నుంచి ప్రజాప్రతినిధులుగా ఎదిగొచ్చిన నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు హేయమైనది.
దళిత ప్రజాప్రతినిధుల అవమానాల కట్టడికి ఆదిలోనే చర్యలు తీసుకొని ఉంటే ఈ పరంపర కొనసాగేదా? ప్రజాపాలనలో దళిత ప్రజాప్రతినిధులే ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటుంటే ఇక, అతి సామాన్య దళితుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిది. లేదంటే, రానున్న కాలంలో భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు అనే ఆయుధంతో ‘మార్పు’ అనివార్యమవుతుంది.
– నరేష్ పాపట్ల 95054 75431