ఒక ప్రాంతంలో అభివృద్ధి అంటూ జరిగిందనుకుంటే, అందువల్ల ప్రజల ఆర్థిక స్థితి ఎట్లా మెరుగుపడిందో తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, వారి జీవితంలో, సమాజంలో, పరిసరాలలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో పరిశీలించటం కూడా అంతే ముఖ్యం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగు ఎత్తిపోతల పథకాల ప్రాంతాలను మొదట 2016 అక్టోబర్‌లో తిరిగి చూసిన ఈ రచయిత, ఈ ఫిబ్రవరిలో మళ్లీ వెళ్లి చూసినప్పుడు, గత ఆరేండ్లలో ఈ రెండు విధాలుగానూ వచ్చిన మార్పులు నమ్మశక్యం కాకుండా తోచాయి. అప్పటికి ఇప్పటికి పోలికే లేదన్నది స్వయంగా ప్రజలు ప్రతిచోటా అన్నమాట.
తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా పేరుపడిన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ల ఎత్తిపోతల పథకాలను ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేయదలచినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే ప్రకటించడం తెలిసిందే. ఆ ప్రకారం, శీఘ్రగతిన మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని- చనఖా-కోరట పనులు పెన్‌గంగపై ఆదిలాబాద్‌లో మొదలయ్యాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలుగా విభజించగా, వీటిలో నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి పథకాలను పునరుద్ధరించి శరవేగంతో ముందుకుసాగించారు.
వీటిలో మొదట చనఖా-కోరటను 2016 సెప్టెంబర్‌లో చూసినప్పుడు ప్రాజెక్టు, కాలువల పనులు జరుగుతున్నాయి. మరుసటి నెల ఉమ్మడి మహబూబ్‌నగర్ పథకాల ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఆ స్వల్ప కాలంలోనే వాటి ఫలితాలు ఒక మేర కన్పించటం మొదలైంది. కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను ఉపయోగించుకోవటం గతంలో నిర్లక్ష్యానికి గురికాగా, 2014 నుంచి పూర్తి శ్రద్ధ చూపుతూ నిర్మిస్తుండిన ఆ నాలుగు పథకాలు ముందుకుసాగటం, అందువల్ల కాలువల్లో నీళ్లు పారటం, బోర్లలో నీటి మట్టాలు పెరగటం, కొత్త బోర్లు విఫలం కాకపోవటం, ఎండినవాటిలో తిరిగి నీళ్లు రావటం, మిషన్ కాకతీయ కింద బాగైన చెరువులూ కుంటలను ఇంజినీర్లు కాలువ నీళ్లతో నింపుతుండటం, పంటలతో పచ్చబడుతుండిన భూములు, వలసలు తగ్గుతుండటం, కూలీ పనులు పెరగటం, నింపిన చెరువుల్లో చేపల పెంపకం, కొద్దిచోట్ల రెండవ పంట సైతం సాగు చేయటం, దీనంతటి ఫలితంగా రైతుల్లో, కూలీల్లో, గ్రామీణుల్లో నెమ్మదిగా పెరుగుతుండిన ఆత్మ విశ్వాసం- ఇవన్నీ 2016 అక్టోబర్‌లో ఆ తొలి దశలోనే నాకు కన్పించిన దృశ్యాలు.
అప్పటి నుంచి ఆరేండ్లు గడిచాయి. ఆ నాలుగు ప్రాజెక్టు ప్రాంతాల్లో అప్పుడు తిరిగిన 12 గ్రామాలకు ఇప్పుడు మళ్లీ వెళ్లి వందల మందితో మాట్లాడినప్పుడు ఈ రచయితకు అర్థమైందేమిటి? ఆ వందల మందిలో పెద్ద రైతులు, చిన్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులవారు, మత్సకారులు, దళితులు, చిరు వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులు, ముస్లిం, క్రైస్తవ మైనారిటీ తరగతుల వారున్నారు. మాటలు వేరైనా అందరు చెప్పినదాని సారాంశం ఒకటే. ఇది ప్రతిచోటా గమనించి ఆశ్చర్యమైంది నాకు. ఆ సారాంశం ఏమిటి? ‘ఆరేండ్ల కిందటికి ఇప్పటికి పోలికే లేదు’ అన్నారు వారంతా. నా దగ్గర వారి పేర్లు, ఊర్ల సమాచారం ఉంది. మరిన్ని వివరాల కోసం వారితో మాట్లాడగోరేవారు తీసుకోవచ్చు. ఊర్లు చెన్నారెడ్డిపల్లి, మార్లబీడు, ర్యాలంపాడు, మరికల్, చినచింతకుంట, బండర్‌పల్లి, ఉంద్యాల, పూసల్ పహాడ్, గుడిపల్లి, మహదేవుని పేట, నిర్వేణి, కానాయిపల్లి.
ఇప్పుడు ప్రధానంగా మూడు విషయాలు చూద్దాం. ఒకటి, అభివృద్ధి. రెండు, సంక్షేమం. మూడు, వీటి
ప్రభావంతో వస్తున్న ఆర్థిక, సామాజిక, పరిసర మార్పులు. ఇందులో మొదటి రెండు ప్రజలు స్వయంగా చెప్పటంతో పాటు నేను కూడా చూసినవి. మూడవది నేను గమనించినవి, విన్నవి. వీటిలో ముందుగా అభివృద్ధిని చూద్దాము. ఇదంతా ఆరేండ్లలో వచ్చిన మార్పు అని ముందే చెప్పుకున్నాం.
అభివృద్ధిలో భాగంగా మొత్తం నాలుగు ఎత్తిపోతల పథకాలు కూడా ఈసరికి పూర్తయ్యాయి. భూ సేకరణ చిక్కుల వల్ల కాలువ పనులు కొద్దిగా అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. కాలువల్లో నీరు నిరంతరం ఉంటున్నది. చెరువులు, కుంటలు వేసవిలోనూ నిండి కనిపిస్తున్నా యి. భూగర్భ జలాలు గణనీయంగా పెరగటం వల్ల బో ర్ల నీటికి కూడా కొరత లేకుండా పోయింది. వాటికి కరెంటు సమస్యా లేదు. ఎప్పుడైనా స్థానిక సమస్యల వల్ల కొద్ది గంటల అవాంతరం తప్ప. చెక్‌డ్యామ్‌లు కూ డా గతంలో వలె గాక ఇప్పుడు బాగుంటున్నట్లు చెప్పా రు. ఈ పరిస్థితుల్లో నాలుగైదేండ్లుగా నీరు సమృద్ధిగా ఉందని, అందుకు తగినట్లు మంచి వర్షాలు తోడవుతున్నాయని నాలుగు జిల్లాలలోనూ రైతులందరూ అన్నా రు. దాని ఫలితంగా తరి, కుష్కి పంటలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయన్నది వారి ఏకగ్రీవాభిప్రాయం.
గతంలో కుష్కిగా ఉండిన భూములను రైతులు తమ అవసరాలను బట్టి పూర్తిగానో, లేక కొంతమేరకో తరిగా మార్చుకున్నారు. అట్లా చిన్న రైతులు కూడా రేషన్‌బియ్యం వస్తాయి గనుక తక్కిన అవసరానికి వరి పండించి, మిగిలిన భూమిలో మెట్ట పంటలు వేసి కుటుంబ ఖర్చులకు సంపాదిస్తున్నారు. లోగడ వలె గాక కూలీ పనులు ఉన్నచోటనే విరివిగా దొరుకుతున్నందున చిన్న రైతులు, ఇతర కూలీలకు ఆ మార్గంలోనూ తగినంత ఆదాయం వస్తున్నది. పంట దిగుబడి పెరుగుతుండగా ధాన్యం ధర మార్కెట్లో ఎప్పుడు తగ్గినా వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని మంచి ధరకు మొత్తం ఖరీదు చేస్తున్నదని, ఇటువంటిది కేసీఆర్ కన్న ముందు ఎప్పుడూ లేదని పలువురు రైతులన్నారు. తమకు రైతుబంధు, ఉచిత విద్యుత్తు, సమృద్ధిగా నీరుండటంతో పాటు విత్తనాలు, మందులకు ఇప్పుడు కొరత లేకపోవటం, రైతుబీమా సదుపాయం కూడా ఉండటం వల్ల భరోసా మరింత పెరిగిందన్నారు వారు. ధాన్యం కొనుగోళ్లు ఊరిలోనే జరుగుతున్నందున మార్కెట్‌కు రవాఖా ఖర్చులు, అక్కడ కమీషన్లు, రెండురోజుల భోజనాల ఖర్చులు అన్నీ తప్పటం వారికి సంతోషంగా ఉన్నది. పైగా రైతుబంధు వంటి వివిధ పథకాల నుంచి మొదలుకొని, ధాన్యం సొమ్ము చేతికిరావటం వరకు అన్నీ నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి రావటం తప్ప ఎక్కడా లంచాల మాట లేకుండా పోయిందని ఉత్సాహంగా చెప్పారు.
రైతులలో అధికులు వరితో పాటు వేరుశనగ, కంది, మక్కజొన్న, మినుము, ఆముదాలు, మిర్చి, పత్తి వంటి మెట్ట పంటలు కూడా సాగు చేస్తున్నారు. వాటన్నింటి మీద రాబడి బాగానే ఉందన్నారు. పామాయిల్ కొద్దిచోట్లనే కన్పించింది. అక్కడ ఫలితాలు బాగుంటే తాము ఆలోచిస్తామన్నారు ఇతర ప్రాంతాల వారు. నీళ్లు, పంటలు, పనులు పెరుగుతున్నందున ఇప్పుడు లోగడ వలె వలసలు లేకపోగా, పని ముమ్మరంగా ఉన్నప్పుడు బీహార్ వంటి చోట్ల నుంచి తామే కూలీలను రప్పిస్తున్నామన్నారు. అయితే దీనంతటితో వ్యవసాయ ఆదాయాలు బాగానే పెరుగుతున్నాయి గాని ఎరువుల, మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం బాగా పెంచుతుండటం వల్ల ఆదాయం చాలావరకు తుడిచిపెట్టుకుపోతున్నదని పలువురు ఫిర్యాదు చేశారు.
నేను చూసినంత మేర ఈ సీజన్లో ప్రతిచోటా యాసంగి బాగా సాగవుతున్నది. 2016 అక్టోబర్‌లో వెళ్లినప్పుడు, ప్రాజెక్టులు పూర్తయి నీళ్లు వస్తే రెండవ పంట వేయగలమంటూ కలలు కన్నట్లుగా మాట్లాడారు రైతులు. ఇప్పుడు వారి కలలు నెరవేరాయి. ఇద్దరు ముగ్గురైతే మూడో పంట అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఈ ఆరేండ్లలో కూలీ రేట్లు రెట్టింపై రూ.500 వరకు పోతున్నందున రైతులతో పాటు వారూ సంతోషంగా కన్పించారు.
హైదరాబాద్‌లో వినవచ్చేదానికి భిన్నంగా నాకు కొత్తగా తెలియవచ్చిన విషయం కౌలు రైతులు సైతం సంతృప్తిగానే ఉన్నారు. రైతుబంధు వారికి కాకుండా భూమి యజమానులకు పోవటంపై గల విమర్శల గురించి నేను పలువురు కౌలు రైతులను అడిగాను. ఆ సొమ్ము యజమానికి చెందటమే సబబు అని కొందరు నైతికతా కోణం నుంచి మాట్లాడగా, ఆ సొమ్ము తమకు కావాలంటే రైతులు కౌలుకు భూమి ఇవ్వబోమంటే తాము ఎటు పోవాలన్నారు కొందరు. ఇప్పుడు నీళ్లు, కరెంటు బాగుండి ధాన్యం అమ్మకాలు బాగున్నందున కౌలు సొమ్ము పోను కూడా మిగిలింది బాగానే ఉంటున్నదనేది మరికొందరి మాట. ఈ పరిస్థితుల్లో మొత్తమ్మీద కౌలు లావాదేవీలు 2016 కన్న చాలా పెరిగి సజావుగానే నడుస్తున్నాయి. అయితే రైతులు, కౌలుదారుల్లో కూడా కొందరి అభిప్రాయం కాలువల్లో నిరంతరం నీళ్ల వల్ల గట్ల పక్కన ఉన్న భూముల్లో నీళ్లు ఊరి వరి తప్ప వేరే సాగు చేయలేకపోతున్నామని. భూములు చౌడు బారే ప్రమాదం కూడా ఉందని. అందుకు వారు సూచించే పరిష్కారం కాల్వలకు లైనింగ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి.
మొత్తమ్మీద ఈ రకరకాల అభివృద్ధి ఫలితంగా గ్రామీణుల చేతిలో ఇప్పుడు తగినంత డబ్బు ఆడుతున్నది. కేసీఆర్ వల్ల అందరికీ లాభాలవుతున్నాయని, అంతా సంతోషంగా ఉన్నారన్న వ్యాఖ్యలు తరచూ వినిపించాయి. ప్రత్యేక అవసరాలకు తప్ప ఆర్థిక వ్యాసంగాలు, జీవితాలు గడవటానికి ఇప్పుడు వారు అప్పులు చేయటం లేదు. వెనుకటి అప్పులు తీర్చేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలతో జీవితాలు బాగానే సాగుతున్నాయని అనేకులు అన్నారు. ఈ మాట మహిళలది, దళితులది కూడా. ఒక యాక్టివిస్టు దళితుడు తామిప్పుడు ఆత్మగౌరవంతో బతుకుతున్నామన్నాడు. ఇటువంటి సామాజిక మార్పులకు బహుశా ఒక పెద్ద గుర్తు, ఇప్పుడు కుల వివక్షలు పోయాయని పలువురు చెప్పటం.
ఆర్థికాభివృద్ధికి పర్యవసానంగా కనిపించిన ఒక విషయం భూముల ధరల పెరుగుదల. ఎకరానికి 2016లో ఉండిన రూ.50 వేల నుంచి రూ.2 లక్షల ధర రూ.30 లక్షలు దాటింది. మెయిన్ రోడ్డు పక్కన అయితే కోటిన్నర దాకా. దీనితో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరిగాయి. సివిల్ నేరాలు అట్లుంచితే క్రిమినల్ నేరాలు తగ్గటం కూడా ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల మెరుగుదలకు రుజువుగా కన్పించింది. అదేవిధంగా సాధారణ రైతులు, కూలీలు, దళితుల పిల్లలు గతంలో వలె గాక ఎంతో కొంత చదువుకొని, పనులు నేర్చుకొని, ఏవో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు చేయూతగా ఉంటున్నారు.
ఉమ్మడి జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ నుంచి మొదలుకొని కొత్త జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు సైతం సరికొత్త రంగులు పులుముకొంటున్నాయి. చిన్నపాటి మాల్స్, వెలుగు జిలుగుల కన్జూమర్ గూడ్స్ దుకాణాలు, కొత్త రుచుల హోటళ్లు, రకరకాల కొత్త తరహా ఫంక్షన్లు, ఫంక్షన్ హాళ్లు, ఈటింగ్ ఔట్లతో ఈ గ్రామాలు, పట్టణాలు నేను ఆరేండ్ల కిందట చూసినవేనా అనిపించింది.
మత్స్యకారులకు సంబంధించి 2016 నాటికే బాగా మొదలైన చెరువుల్లో చేపల పెంపకం ఈసరికి ఇంకా పుంజుకున్నది. వారి ఆదాయాలు పెరిగాయి. అయితే కొద్దిచోట్ల సొసైటీ నాయకుల లావాదేవీల పట్ల సభ్యులు అసంతృప్తిగా ఉండటం కన్పించింది. మేకలు, గొర్రెల పెంపకందారులు 2016 కన్న ఎక్కువగా కన్పించటం ఒక్కటైతే, మందలను మేపేందుకు లోగడ వారాల తరబడి ఎక్కడెక్కడో తిప్పుతూ తిరిగేవాళ్లమని, ఇప్పుడు దగ్గర దగ్గర్లోనే మేత దొరుకుతున్నదని చెప్పారు వాళ్లు. పెంపకందారులు గతం కన్నా ఇప్పుడు ఇక్కడనే ఎక్కువ మంది కన్పించటానికి కారణం అదేననుకోవాలె. ఆర్థిక మార్పుల ప్రభావం కొన్ని గ్రామీణ వృత్తులపై పడింది. ఉదాహరణకు వడ్డెర్లు రాయి కొట్టడం లేదు. పందులను పెంచేవారు అరుదయ్యారు. గడ్డి బాగానే ఉన్నా పాడి చేసేవారు తగ్గారు. గోరటి వెంకన్న రాసినట్లు ‘కనిపించని కుట్రల’ పల్లె కన్నీరు పెట్టడం ఒక దశలోని పరిస్థితి అయితే, తెలంగాణ ఏర్పడినాక సానుకూలమైన ఆర్థిక మార్పులతో వృత్తుల పరిస్థితి మారుతుండటం కొత్త దశగా కన్పించింది. అప్పుడది ప్రతికూల కుట్ర కాగా ఇప్పుడిది ‘అనుకూల కుట్ర’ వంటిదన్న మాట.
ఈ ప్రాంతాలను మొదట 2016లో, తర్వాత తిరిగి ఇప్పుడు, నాలుగు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గమనించిన సామాజిక మార్పులు కొన్నింటిని ఇక్కడ పేర్కొంటాను. అభివృద్ధి అనే దానికి జీవితాల్లో, పరిసరాల్లో, సంస్కృతిలో వచ్చే మార్పులే అంతిమ గీటురాయి అయినందున వాటినిక్కడ క్లుప్తంగా మాత్రం సూచిస్తాను. గ్రామాల్లో కొత్తవి మంచి ఇండ్లు, రకరకాల సరుకుల మంచి దుకాణాలు, హోటళ్లు, బైక్‌లు, కార్లు, ఫ్లాట్ టీవీలు వస్తున్నాయి. లోగడ అతి అరుదుగా ఉండిన సెల్ఫోన్లు ఇప్పుడు దాదాపు ప్రతిచేతిలో కనిపిస్తున్నాయి. వైద్య సేవలు ప్రభుత్వానివి, ప్రైవేట్‌వి కూడా పెరుగుతున్నాయి. పెళ్లిళ్లూ వినోదాల ఖర్చులు, ఆడంబరాలు ఎక్కువవుతున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ నుంచి మొదలుకొని కొత్త జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు సైతం సరికొత్త రంగులు పులుముకొంటున్నాయి. చిన్నపాటి మాల్స్, వెలుగు జిలుగుల కన్జూమర్ గూడ్స్ దుకాణాలు, కొత్త రుచుల హోటళ్లు, రకరకాల కొత్త తరహా ఫంక్షన్లు, ఫంక్షన్ హాళ్లు, ఈటింగ్ ఔట్లతో ఈ గ్రామాలు, పట్టణాలు నేను ఆరేండ్ల కిందట చూసినవేనా అనిపించింది.
ఈ విధంగా గత ఆరేడేండ్ల ఆర్థిక మార్పులు అనేకం తెలంగాణలో ఉంటున్నాయి. వాటి ప్రభావంతో గ్రామీణ జీవితాలు, సంస్కృతి, సమీప పట్టణాలు వేగంగా మారుతున్నాయి. పట్టణాలలో ఈ ఆధునిక తరహా ఖర్చులు చేస్తున్నవారిలో, లేదా చేయగలుగుతున్న వారిలో తగినంత మంది గ్రామీణులు కనిపిస్తున్నారు.
ఈ మార్పులన్నీ తెలంగాణ అకడమీషియన్లు, పరిశోధకులు, రచయితలూ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కోణాల నుంచి, మాక్రో, మైక్రోస్థాయిలలో పరిశీలించి రాయవలసిన విషయాలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పట్టుదలతో సాగుతున్న కృషివల్ల సిద్ధిస్తున్న ఫలితాలకు, సామాజిక పరివర్తనకు అవి గీటురాళ్లుగా నిలుస్తున్నాయి. అందుకు మహబూబ్‌నగర్ వంటి అత్యంత వెనుకబడిన జిల్లాకు మించిన ఉదాహరణ ఉండగలదా? ఆ వెనుకబాటుతనం చూస్తూ చూస్తుండగానే నిన్నటిదిగా మారిపోతున్నదనేది వేరే విషయం!
రైతులలో అధికులు వరితో పాటు వేరుశనగ, కంది, మక్కజొన్న, మినుము, ఆముదాలు, మిర్చి, పత్తి వంటి మెట్ట పంటలు కూడా సాగు చేస్తున్నారు. వాటన్నింటి మీద రాబడి బాగానే ఉందన్నారు. పామాయిల్ కొద్దిచోట్లనే కన్పించింది. అక్కడ ఫలితాలు బాగుంటే తాము ఆలోచిస్తామన్నారు ఇతర ప్రాంతాల వారు.
టంకశాల అశోక్: 98481 91767