రాష్ట్రం సాధించి తొమ్మిదేండ్లు అవుతున్నది. ఈ తొమ్మిదేండ్లలో మన రాష్ట్రం, మన సర్కారు ఏం సాధించిందో ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాలి. తెలంగాణ ఏం సాధించిందో తెలుసుకోవడమే కాదు. కాలర్ ఎగరేసి.. గర్వంగ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా… ఏ రాష్ట్రమూ సాధించనన్ని గొప్ప లక్ష్యాలను మన తెలంగాణ సాధించింది.
మనం ఇవాళ ఇలా స్వేచ్ఛగా జీవిస్తున్నామం టే దానికి కారణం రాజ్యాంగం. ఆ రా జ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల విగ్రహం కట్టించింది మన ప్రభుత్వం. ఆయన పేరుతో దేశంలోనే అత్యద్భుతమైన, అతిపెద్దదైన సెక్రటేరియట్ మనకు ఉన్నది. రాష్ట్ర పరిపాలనా సౌధమే కాదు. ప్రతి జిల్లా పరిపాలనా సౌధాలు కూ డా అత్యద్భుతంగా కొలువుదీరాయి. అతిపెద్ద సమీకృత కలెక్టరేట్ భవనాలతో ప్రజలకు అన్ని సేవలు మరిం త చేరువయ్యాయి.ప్రతి నియోజకర్గంలో ఎమ్మెల్యేల కు క్యాంపు ఆఫీసులు నిర్మించి.. ప్రజలకు ప్రజాప్రతినిధులను చేరువ చేసింది మన సర్కారు. పాలనే కాదు భద్రతలోనూ మనకు ఎవరూ పోటీరారు. దేశంలోనే ది బెస్ట్ పోలీసింగ్ మనది. అతిపెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ మనకున్నది. భద్రతలో భాగంగా మన రాష్ట్రం లో 2,82,558 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పట్టేసే టెక్నాలజీ మన సొంతం. దీనికోసం సైబ ర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. సైబర్ క్రైమ్స్ బ్యూరో ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నది.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మన తెలంగాణలోనే ఉన్నది. ఇంత పెద్ద ప్రా జెక్ట్ కట్టిన మనలను డిస్కవరి ఛానల్ మెచ్చుకున్నది. ఓ డాక్యుమెంటరీని నిర్మించింది. కాళేశ్వరంతో ఎర్రటి ఎండల్లోనూ మన చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా సా గు విస్తీర్ణం పెరిగింది. ధాన్యం సేకరణలో తెలంగాణే నంబర్ వన్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారి దేశానికి అన్నం పెడుతున్నది. అంతేకాదు.. మన రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా అవతరించింది. దేశంలోని 65 శాతం విత్తన అవసరాలను తీరుస్తున్నది. 18 దేశాలకు విత్తనాలు సరఫరా చేస్తున్నది. ఈ స్థాయిలో ఉత్పత్తి పెరగడానికి నీటి వసతితో పాటు..24 గంటల ఉచిత కరెంట్, సర్కారు ఇస్తున్న రైతు బంధు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి.
వ్యవసాయమే కాదు ఐటీ రంగంలోనూ విశేష ప్రగతి నమోదైంది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రోపాలిటన్
నగరాలను పక్కకు తోసి.. ఐటీలో తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. 2013-2014లో తెలంగాణ నుంచి
ఐటీ ఎగుమతుల విలువ రూ.57,528 కోట్లు. 2021-22 ఏడాదికి అది రూ. 1,83,569 కోట్లకు పెరిగి ఐటీ ఎగుమతుల వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానాన నిలిచింది. తెలంగాణ ఐటీ రంగంలో 1,49,506 ఉద్యోగాలు వచ్చాయి.
టీ హబ్‌తో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, టీ వర్క్స్ తో ఆవిష్కర్తలకు ఓ వేదిక కల్పించిన ఏకైక రాష్ట్రం కూడా మనదే. పారిశ్రామిక రంగంలో టీఎస్ ఐపాస్ తో విప్లవాత్మక మార్పులు తెచ్చి.. ఒక్క క్లిక్ తో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం కూడా మన తెలంగాణే.
సంక్షేమంలోనూ మనమే టాప్‌లో ఉన్నాం. వృద్ధు లు, వికలాంగులు, ఒంటరి మహిళలు.. ఇలా అందరికి అత్యధిక పింఛన్ ఇస్తున్నది మన రాష్ట్రమే. ఇలా ఏ రంగం తీసుకున్నా తెలంగాణ నంబర్ వన్. ఇది మనం చెప్పుకుంటున్నది కాదు. దేశం, ప్రపంచం చె బుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం 20 అవార్డులకు గాను 19 అవార్డులు మన పల్లెలకే వచ్చాయి. 20 బెస్ట్ మున్సిపాలిటీలకు 10 మున్సిపాలిటీలు మనవే. పల్లెల అభివృద్ధి విభాగంలో కేంద్రం 46 అవార్డులు ప్రకటిస్తే అందులో 13 గ్రా మాలు మనవే. ఈ లెక్కన దేశంతో పో లిస్తే 3 శాతం జనాభా ఉన్న రాష్ర్టానికి 30శాతం అవార్డులు వచ్చాయి. 100 శాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలు ఉన్నది ఒక్క తెలంగాణలోనే అని కేంద్రమే చెప్పింది.
ప్రతి గ్రామానికి ఓ ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామా న్ని ఏర్పాటు చేసింది. హరితహారం తో పల్లె, పట్నం తేడా లేకుండా పచ్చదనాన్ని పెంచిపోషిస్తున్నది. అందుకే మన దగ్గర 4.7 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది. రాజకీయాల కోసం విమర్శలు, ఆ రోపణలు చేసినా..మన మంచి పనులకు అవార్డులు ఇవ్వకుండా ఉండలేకపోతున్నది కేంద్ర ప్రభుత్వం. పొరుగు రాష్ర్టాలకు మన సంక్షేమం రోల్ మాడల్ అయ్యింది. కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డలకు వరమైంది. కంటివెలుగై బాధలుబాపింది. దళితుల సంక్షేమానికి దళితబంధువై.యువత తమకాళ్ల పై తాము నిలబడేలా చేసింది. ఇంటింటికి నీరు వచ్చింది. పల్లెలకు కొత్త కళ వచ్చింది. 2014-15 లో తలసరి ఆదా యం రూ.1,24,000 ఉంటే 2022-23 నాటికి రూ. 3,17,000కు పెరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. మనం సాధించిన ప్రతీది ఒక మైలు రాయే.
హైదరాబాద్ నడిబొడ్డున నిలబడిన అంబేద్కరుడిని చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇది తెలంగాణకు గర్వకారణమంటూ వీరేంద్రశర్మ అనే బ్రిటన్ ఎంపీ స్వయంగా మన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అమెరికాలో స్థిరపడి ఈ మధ్యే హైదరాబాద్ వచ్చిన తెలుగు నటి లయ.. హైదరాబాద్ ముందు న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ లాంటి పట్టణాలు కూడా దిగదుడుపేనని స్వ యంగా చెప్పారు. అది మనకు ఎంత గర్వకారణం. సర్కారు మంచి పను లు అన్నీ కలిసి ఇవాళ తెలంగాణ వెలిగిపోతున్నది. భావి భారతానికి ఓ ఆశాకిరణంలా మారింది. ఈ గొ ప్ప విషయాన్ని.. ఓ తెలంగాణ బిడ్డగా మనం గర్వంగా చెప్పుకోవాలి. సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పాలి.
వై.సతీష్ రెడ్డి: 9641466666
(వ్యాసకర్త : తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్)