కాంగ్రెస్ పాలనలో రైతన్నలు కాడి వదిలేస్తు న్నారు. రేవంత్ అసమర్థ పాలనలో సాగు నీళ్లు రాక, పెట్టుబడికి పైసల్లేక దిక్కుతోచని స్థితిలో అన్న దాతలు వ్యవసాయం చేయలేక చేతులెత్తేస్తున్నారు. సాగు నీరు లేక ఇళ్లు విడిచి మళ్లీ వలసబాట పడుతున్నారు. తిం డి గింజలకూ పంట చేతికొచ్చే పరిస్థితులు లేక పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు, నగరాలకు బైలెల్లుతున్నారు.
ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్తున్న మాట కాదు.. స్వయంగా కాంగ్రెస్ సర్కారు ఇటీవల విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక-2025 చెప్తున్న వాస్తవం. కేసీఆర్ హయాంలో తెలంగాణలో 47.34 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. కానీ, రేవంత్రెడ్డి పాలనలో ఈ సంఖ్య 42.7 శాతానికి పడిపోయింది. అంటే, గత 15 నెలల కాలంలో 4.64 శాతం మంది రైతులు కాడి వదిలేశారు. రేవంత్ ప్రభుత్వం చేసిన ఘనకార్యాల వల్ల రైతన్నలతో పాటు యావత్ తెలంగాణ పడుతున్న కష్టాలకు ఆ నివేదిక దర్పణం పట్టింది.
పదేండ్ల క్రితం ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ ప్రాంతంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఉండేవి. పరాయి పాలకులు తెలంగాణ సాగు సడుగులు విరగ్గొట్టారు. నీళ్లు, కరెంటు ఇవ్వకుండా రైతన్నల నడ్డివిరిచారు. నాడు తెలంగాణలో బంగారం లాంటి భూము లన్నీ బీడువారాయి. తినేందుకు తిండి లేక, దూప తీర్చుకునేందుకు గుక్క నీళ్లు లేక ఆకలితో తెలంగాణ బిడ్డలు అలమటించారు. ఆకలికి తట్టుకోలేక బక్కచిక్కిన డొక్కలను చేత పట్టుకొని పొట్ట పోసుకునేందుకు వలసపక్షులు అయిపోయారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలకుల నిర్వాకం వల్ల ఇలా మన బిడ్డలు చెల్లాచెదురై తెలంగాణ ఆగమైంది.
తెలంగాణ బిడ్డల కష్టాలను కండ్లారా చూసిన కేసీఆర్ ఉద్యమ జెండా ఎత్తి.. పట్టుబట్టి స్వరాష్ట్రం సాధించారు. సాధించిన రాష్ర్టాన్ని సుసంపన్నం చేశారు. ప్రాజెక్టులు కట్టి, పథకాలు పెట్టి ఎవుసాన్ని చక్కదిద్దారు. తెలంగాణలో స్వర్ణయుగం తీసుకువచ్చారు. భగీరథుడిలా పంతం పట్టి వలసలను వాపస్ తీసుకువచ్చారు. ముంబయి, దుబాయి బాటపట్టిన బిడ్డలు తెలంగాణకు తిరిగివచ్చి కాడి పట్టి, దుక్కి దున్నడం మొదలుపెట్టారు. బీడు భూముల్లో బంగారం పండింది.
పుట్లకు పుట్లు వడ్లు పండాయి. కానీ, ఆ స్వర్ణయుగాన్ని కాంగ్రెస్ మార్పు కాటేసింది. రైతన్నను కాటగల్పింది. రేవంత్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి తెలంగాణ రైతన్నలు ఆగమవుతున్నారు. సాగు నీళ్లు లేక కండ్ల నీళ్లు తీస్తున్నారు. పెట్టుబడికి పైసలు లేక అప్పుల పాలవుతున్నారు. సాగు చేద్దామంటే నకిలీ విత్తనాలు మోపైనయ్. కష్టనష్టాలకోర్చి పంట పండిస్తే కొనే దిక్కులేదు. బోనస్ బోగసైంది. రుణమాఫీ కోతలు, కొర్రీల పాలైంది. వందల ఫీట్లు బోర్లు వేస్తూ ఊరికో బోర్ల రామిరెడ్డి తయారైండు. కనుమరుగైపోయిన తెలంగాణ రైతన్నల కష్టాల పాటలు మళ్లీ జోరందుకున్నాయి.
‘ఆరు అరకలు కట్టే పెద్ద రైతు కూడా అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము.. పేడ ఎరువు లేక భూమి సారము బోయే పొలము.. సూడ సక్కని నేల మోడు వారిపాయె.. తేమ ఒండు తగ్గిన భూముల సీమ కంపలు పెరిగేరా.. వయ్యారి భామచ్చి వరి మల్లే మొలిసింది.. లొట్టపీసు సెట్లు గెట్టున పెరిగినయ్. తరి పొలం తగ్గింది వెరికలం మిగిలింది.. సెలకంతా మొరమై గులుకుగులుకైంది.. కలబంద జెమ్ముండ్లురా తెలంగాణ కరువుకు గుర్తాయెరా…’ అని గోరటి వెంకన్న శాసనమండలి సాక్షిగా పాటందుకోవడం రైతుల దీనస్థితిని తెలియజేస్తున్నది.
– సర్దార్ రవీందర్ సింగ్, కరీంనగర్ మాజీ మేయర్