సమాజం అవసాన దశలో ఉన్నప్పుడు సమాజాన్ని చైతన్యం చేసేది మేధావులు. అలాంటి మేధావులు మౌనంగా ఉంటే సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే బాధ్యత మేధావులపై ఉంటుంది. కానీ నేటి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమవుతున్నా ఈ మేధావులు కిమ్మనకుండా ఉంటున్నారు. వారికి ప్రభుత్వ వైఫల్యం కనిపించటం లేదా?
తెలంగాణ రాష్ట్ర సాధనలో మేధావుల పాత్ర ప్రధానమైన దే కాకుండా ప్రేరణాత్మకమైనది కూడా. ఈ ఉద్యమంలో మేధావులు తమ ఆలోచనలు, రచనలు, ప్రసంగాలతో ఉద్యమాన్ని బలోపేతం చేశారు. 201 4లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనంతరకాలంలో ఈ మేధావులు ప్రభుత్వ విధానాలపై పలు విమర్శలు చేశారు. పలు రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విజయంలో మేధావుల పాత్ర కీలకంగా నిలిచింది. వారు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న వాగ్దానాల ను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, కాంగ్రెస్ పథకాల అమలు విషయంలో మేధావులు ఇప్పుడు మౌనంగా ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత వంటి పథకాలు అమలు కావడం లేదు.
రాష్ట్రంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 2 లక్షల ఉద్యోగాల జాడలేదు, నిరుద్యోగ భృతి లేదు. రైతు భరోసా, రైతుబీమా లేదు. రుణమాఫీని అరకొరగా చేసి వదిలేశారు. బోనస్ బోగస్ అయింది. రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. 24 గంటల ఉచిత కరెంటు లేదు, పంటకు మద్దతు ధర లేదు. ప్రభుత్వం రైతులను ఇన్ని రకాలుగా గోస పుచ్చుకుంటున్నా ఈ మేధావులు ఎందుకు ప్రశ్నించడం లేదనేది పెద్ద ప్రశ్న.
మూసీ సుందరీకరణ పేరుతో దాని చుట్టుపక్కల దాదాపు 15 వేల ఇండ్ల కూల్చివేతకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ కుటుంబాలకు అండగా ఉండి ధైర్యం చెప్పే మేధావి లేకపోయాడు. హైడ్రా బాధితులు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సాయం పొందలేకపోతున్నారు. ఆటో కార్మికుల పరిస్థితి కూడా దుర్భరంగా ఉంది. ఎన్నికల ముందు ఆటో కార్మికులకు నెలకు రూ.12,000 ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చాక ఆ దిశగా ప్రయత్నం చేపట్టలేదు. పలువురు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఒక్క మేధావీ నోరెత్తడం లేదు. ఆశావర్కర్లు, మాజీ సర్పంచ్ల సమస్యలు ప్రభుత్వ ప్రామాణికతను దెబ్బతీసే విషయాలు. పింఛన్లు రాకపోవడంతో వృద్ధుల పరిస్థితి దారుణంగా మారింది. అయినా మేధావులు మౌనంగా ఉన్నారు తప్పితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. నాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసిన మేధావులు నేడు తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో ఉంటే కనీసం మాట్లాడకపోవడం బాధాకరం. మేధావి మౌనం సమాజానికి చాలా ప్రమాదం.