ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు అవసరమే. కానీ, పర్యావరణాన్ని నాశనం చేసి, ప్రజల ఆరోగ్యానికి హాని చేసే పరిశ్రమలు మాత్రం కాదు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం, ఓజోన్ పొరను కాపాడుకోవడం కోసం దేశదేశాలు గొంతెత్తున్న ప్రస్తుత తరుణంలో అభివృద్ధి మాటున, పారిశ్రామికీకరణ పేరిట ఇథనాల్ లాంటి ఉత్పాతాలను కొని తెచ్చుకోవడం భావ్యం కాదు.
మోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం 2021లో ఇథనాల్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీలో భాగంగా తెలంగాణలోనూ 30కి పైగా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో ఇంధన అవసరాల నిమిత్తం ఈ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం చెప్తున్నది. కానీ, పెట్రోల్లో 20 శాతం దాకా ఇథనాల్ కలపడం లాంటి కార్పొరేట్ కంపెనీల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ పరిశ్రమలకు కేంద్రం పచ్చజెండా ఊపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ రసాయనం మూలంగా గాలి, నీరు కలుషితమై, తద్వారా వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు పెను నష్టం వాటిల్లుతుందనే వాస్తవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తుండటం శోచనీయం.
ఒక లీటర్ ఇథనాల్ తయారీకి నాలుగు లీటర్ల నీళ్లు అవసరమని నిపుణులు చెప్తున్నారు. ఏడాదికి సుమారు రెండు లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను నెలకొల్పేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ లెక్కన ఒక్కో పరిశ్రమకు ఇథనాల్ ఉత్పత్తి అవసరాలకే ఎనిమిది లక్షల లీటర్ల నీళ్లు అవసరం. దీని వల్ల ఆ చుట్టూ గ్రామాల్లో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
రాజోలి మండలం పెద్ద ధన్వాడ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపించాలని ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీచేసింది. నడిగడ్డలో చాన్నాళ్ల నుంచి దీనిపై ఉద్యమం నడుస్తున్నది. అయితే, ఈ ఉద్యమానికి నాయకులెవ్వరూ లేరు. అక్కడి పది గ్రామాల ప్రజలే సంఘటితమై బలోపేతమైన ఉద్యమం ఇది.
ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే విష వాయువుల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కన్ను, ముక్కు, గొంతు, చర్మ సమస్యలతోపాటు తలనొప్పి, వికారం, వాంతులు వంటి ఇబ్బందులు వస్తాయి. పలు రకాల క్యాన్సర్లు కూడా సోకే ప్రమాదముంది. ఈ ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యం గర్భస్థ శిశువులపైనా ప్రభావం చూపుతుంది. ఆ ప్రాంతంలోని పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుడతారు. ఈ మేరకు ఇప్పటికే అనేక నివేదికలు స్పష్టం చేశాయి.
ఈ పరిశ్రమల వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా జనావాసాలు, పచ్చని పొలాల మధ్య ఇథనాల్, ఫార్మా లాంటి కాలుష్యకారక పరిశ్రమలు నెలకొల్పడం భావ్యం కాదు. ప్రజాభిప్రాయ సేకరణను విస్మరిస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తూ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. పాలకులు చేస్తున్న ఈ అన్యాయం గురించి, ఫ్యాక్టరీ వల్ల జరిగే అనర్థాల గురించి కొందరు మేధావులు, యువత, చైతన్యవంతులు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
రచ్చబండల వద్ద సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రజా సంఘాలు, నాయకుల మద్దతు కూడగట్టి ప్రజలను సంఘటితం చేశారు. పరిశ్రమలు నెలకొల్పవద్దని సంబంధిత అధికారులను కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. అందుకే, గత కొద్దిరోజులుగా ఉద్యమం ఉధృతమైంది. కంటైనర్లు, వాహనాలను ధ్వంసం చేసి సామాన్య రైతులు అసామాన్యమైన పోరాటం చేసి తెలంగాణ మట్టికున్న ఉద్యమ స్ఫూర్తిని చాటారు. అయితే, ఈ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూడటం హేయం. ప్రజలపై పోలీసులు దాడులు చేయడం, అమాయకులపై కేసులు బనాయించడం సరికాదు. ఓ ప్రభుత్వ ఉద్యోగి మీద, ఒక జర్నలిస్టు మీద కూడా కేసులు పెట్టారు.
ప్రజాస్వామ్య హక్కులు అమలయ్యేలా చూడటమే తమ ఏడో గ్యారెంటీ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటకు ఇప్పటికైనా కట్టుబడాలి. పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలి. ప్రజలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. పోలీసులు అరెస్టు చేసిన 12 మందిని బేషరతుగా విడుదల చేయాలి. భయం గుప్పిట్లో ఉన్న రాజోలి మండలంలోని గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. పరిశ్రమ అనుమతులను వెంటనే రద్దుచేసి తుంగభద్ర పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను కాపాడాలని మనవి.
-నడిగడ్డ సాహిత్య వేదిక అధ్యక్షుడు అవనిశ్రీ