జిలుగువెలుగుల కార్పొరేట్ ప్రపంచం అడుగున కులతత్వం కుళ్లు కంపు కొడుతున్నదా? మడతలు నలగని సూటూబూటూ కింద సంకుచిత కులాధిపత్యం పాకుతున్నదా? లేక వేళ్లూనుకొని కుక్కమూతి పిందెలు వేస్తున్నదా? ఇండిగో సంస్థలో ఓ ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంకా వెనుకబాటుతనం పూర్తిగా మాసిపోని పల్లెటూళ్లలోనో, ఆధిపత్యవాదం రాజ్యమేలే గొప్పగొప్ప విద్యాసంస్థల్లోనో కులతత్వం ఉందంటే నిజమే అనుకోవచ్చు. అందుకు సంబంధించిన వార్తలు మనం తరచుగా వింటూనే ఉంటాం. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో చాలా చోట్ల దళిత పెండ్లిళ్లలో వరుడు గుర్రమెక్కి ఊరేగడం ప్రాణాంతకమే. పేరుమోసిన వర్సిటీల్లో దళిత బిడ్డలు వేధింపులు భరించలేక ఉసురు తీసుకునే ఉదంతాలు మన దృష్టికి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇది నవభారతం మోస్తున్న నిన్నటి శాపం, రేపటి పాపం.
ఒక కార్పొరేట్ సంస్థలో ‘నువ్వు అధముడివి, విమానాలు నడపడంతో నీకేం పని.. పోయి చెప్పులు కుట్టుకో’ అని తోటి ఉద్యోగులు ఓ దళిత బహుజన పైలట్‌ను దారుణంగా అవమానించడం ఏమిటి? చెప్పులు కుట్టే చేతులు విమానాలు నడపొద్దని రాజ్యాంగం ఏమైనా చెప్తున్నదా? భారతదేశానికి కులవివక్ష కొత్త కాదు. కానీ, కార్పొరేట్ తెరమీద అది మరీ ప్రస్ఫుటంగా ప్రత్యక్షం కావడం ఆలోచింపజేస్తున్నది. ఉద్యోగి తన బాస్‌ల మీద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దాఖలైంది. విచారణలో ఏం తేలుతుందనేది వేరే సంగతి. కానీ, ఈ ఘటనతో కార్పొరేట్ ప్రపంచంలో కులతత్వంపైకి అందరి దృష్టి మళ్లింది.
ఆర్థిక సరళీకరణల భుజాలపై ఊరేగుతూ ప్రపంచీకరణ దూసుకొస్తున్న రోజుల్లో ప్రపంచం ఓ కుగ్రామంలా మారుతున్నదనే మాట తరచుగా వినిపించేది. అడ్డుగోడలు తొలగిపోతున్నాయన్న భావనలు పురివిప్పుకొన్నాయి. భారత్ అంతకంతకూ విశ్వ ఆర్థికవ్యవస్థతో పెనవేసుకుపోతున్న నేపథ్యంలో మన నేతలు తరచుగా వసుధైవ కుటుంబం అనే భావనను పదేపదే ఉల్లేఖించడం పరిపాటి అయిపోయింది. కానీ, ఆ ఉదాత్త భావనను సాధించడానికి భారత్ ఇంకా చాలాచాలా దూరంలో ఉన్నదని ఇటీవల ఈ గడ్డ మీద జరుగుతున్న సంకుచిత కుల వైషమ్యాలు సూచిస్తున్నాయి.
ప్రైవేటీకరణ జోరులో విస్తరించిన కార్పొరేట్ ప్రపంచంలో కులాతీత, ప్రజ్ఞ ఆధారిత ప్రోత్సాహమే ఉందనేది సాధారణ అవగాహన. కానీ, ఇండిగో ఉదంతం ఇదంతా భ్రమేనని అంటున్నది. కులవ్యవస్థ అనేది శ్రమ విభజన మాత్రమే కాదని, అది శ్రామికుల విభజన అని అంబేద్కర్ చేసిన సూత్రీకరణ ఇక్కడ గుర్తుకువస్తున్నది. కార్పొరేట్ ఆధిపత్య వ్యవస్థ అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థగా రూపొందేందుకు ప్రయత్నిస్తున్న మాట నిజమే. కానీ, ఆ దిశగా నిచ్చెనలు అందుకునేలోగా కులతత్వం పాములు కిందకు ఈడ్చేయకుండా చూసుకోవాలి.