నా పేరు దానెపెల్లి లింగమ్మ. నాకు టొంబయైదేండ్లు ఉంటయ్. మా అమ్మమ్మకు నా కన్న అరువై ఏండ్లన్నా ఎక్కువుంటయ్ గదా! అంటే నూటయాభై ఏండ్ల కింది నుంచి ఆడోళ్ల పెద్ద పండుగు బతుకమ్మ పండుక్కు బతుకమ్మ పాటలు మా పెద్దోళ్ల నుంచే నేర్సుకొని పాడుకునేది. వందలేండ్ల నుంచి సదువు రాని మేమేమో వందల పాటలు నేర్సుకొని పాడుకుంటే, ఇప్పటి ఆడిపిల్లలేమో వందల పుస్తకాలు సద్వుకొని ఎన్నో డిగిరీలు పాసైతుండ్రు, నౌకర్లు జేత్తుండ్రు గానీ, ఒక్క బతుకమ్మ పాట గూడ నేర్సుకుంటలేరు, పాడుతలేరు.
గవ్వెందో డీజేలు వెట్టి, కోలలు వట్టి ఎగురుతుండ్రు. నా కండ్ల ముందట్నె వందలేండ్ల ఆషారం పాడైపోతంటే బాధపడుకుంట మా ఎనుకట మేము ఎట్లెట్ల బతుకమ్మ పాటలు నేర్సుకొని పాడుకునేదనే ముచ్చట జెప్తున్న. కనీసం నాడు గట్లుండెనట అనన్నా తెల్సుకుంటరు గదా!
రామగుండం దగ్గరి మంతినిలో ఉండే మా అమ్మమ్మ వాళ్ల చెల్లెకు పిల్లలు పుట్టకపోతే మా తల్లిని పెంచుకొని పెద్దగైనంక పెండ్లి జేసి ఎగులాసపురం ఇచ్చింది. మంతినిలో బాగ మందికి బాగ బతుక మ్మ పాటలు అచ్చేటియట. మా అమ్మ కొన్ని పాటలు నేర్సుకున్నది. ఆమె నుంచి నేను నేర్సుకున్న. ఎనుబయైదేండ్ల కింద మా ఎగులాసపురంలో మురళయ్య దొర ఇంటి ముందటే ఊర్లె ఆడిపిల్లలందరం ఆడుకునేటోళ్లం. దొర తల్లి కిట్టవ్వ ఆడిపిచ్చేది. పెత్రమాసకు ముందుగాళ్ల చ్చే పున్నాన్ని బొడ్డెమ్మ పున్నం అనేటోళ్లు.
ఆనాటి నుంచి బొడ్డెమ్మలు ఆడుకునేటోళ్లం. అట్ల సద్దుల బతుకమ్మ నాటికి మూడు వారాలు ఆడుకునేటోళ్లం. మాకు పిల్లలకు బొడ్డెమ్మ పాటలు గాని, బతుకమ్మ పాటలు గాని అంత ఎక్కువ రాకపోవు. రాకపోతే మా ఊర్లె ఒక మన్నె పు ముసలోడు రోజుకు అరసోడు జొన్నలిత్తె పాడెటోడు. ఆయనెనుక మేం పాడేటోళ్లం. అట్లనే ఇంకో మన్నెపు ముసలవ్వ గూడ రోజుకు అరసోడు జొన్నలిత్తె పాడేది. ఆళ్ల నుంచి కొన్ని బతుకమ్మ పాటలు నేర్సుకున్న – రజాకార్ల జమానాకు ముందుగాల్నె.
ఇగ రజాకార్ల జమానా అయిపోయి మన దేశానికి గాంధీ, నైరు సతంత్రం దెచ్చినంక నాకు లగ్గమయి ఎల్గటూరు మండలం మంగలిగడ్డకు అచ్చి పది పన్నెండేం డ్లు అయినంక శెగ్యామ పటేండ్ల చేన్లు, పొలాలకు కయికిలికి కలువపోతుంటి. నా తీర సుట్టుపక్కల ఊళ్లు ఉండెడ, యెమునూరు కాన్నుంచి కూడ మాదిగి మన్నెపోళ్లు కయికిలికి అచ్చేటోళ్లు. మన్నెపు ఆడోళ్లు బతుకమ్మ పాటలు బాగ పాడుతుండిరి. అయ్యి ఇని నేర్సుకున్న.
మా మామ పెద్ద సాలీడు/ పెద్దకులస్థుడు కాబట్టి, మా ఇంటి ముందట్నే బతుకమ్మ బాయి తోడుతుండిరి. మా వాడకట్టోళ్లందరు అక్కడనే బతుకమ్మలాడుతుండిరి. నేను ముందు పాడితే నా ఎనుక అందరూ పాడుతుండిరి. మా అత్తమామ కాలం జేసినంక ఆళ్లున్న ఇంటి పై కప్పు పోయి గోడలే మిగిల్నయి. నా నడిపి బిడ్డ సూరక్క, సుట్టుపక్కల ఆడిపిల్లలు బతుకమ్మలను తీసుకపోయి బతుకమ్మబాయి కాడ పెట్టి పాటలు పాడరాక ఆ గోడలకానుకొని బీరిపోయి నిల్సునేటోళ్లు.
ఇగ నేనే పొయ్యి పాడితే అప్పుడు పిల్లలందరూ సంబురపడుకుంట నా ఎనుక పాడుతుండిరి. నలుపయ్యేడేళ్ల కింద నా పెద్ద బిడ్డ సుగుణ యాడాది కొడుకు చచ్చిపోయి, నా తల్లి గూడ అదే యేడు చచ్చిపోయి దుః ఖంల ఉండి నేను ఆడకపోతే బతుకమ్మ బాయి కాడ గూడ అందరూ ఆడుకోకుండ ఉత్తగనే నిల్చున్నరు- పాటలు రాక. మళ్ల నేనే పొయ్యి దేవునికి శమించుమని మొక్కి పాడితే అందరూ నా ఎనుక పాడిండ్రు.
ఒక్కసారి బతుకమ్మ పండుక్కు మా తల్లిగారింటికి పోయిన. అప్పుడు ఓ రోజు కయికిలికి కలువపోయినకాడ ఒకరు బతుకమ్మ పాటలు పాడుమంటే పాడిన. అది ఇన్న ఓ పెద్ద మనిషి శాలోల్ల ఇండ్లకాన్నే బతుకమ్మ పాటలు పాడుమన్నడు. అట్లనే శాలోల్ల వాడకట్టుకే పాడుకుంట ఉన్న. దొరగారి కిట్టవ్వ ఆడిపిల్లల్ని మా దగ్గరికి రానియ్యలే. కానీ ఆళ్ల దగ్గర పాడేటోళ్లు ఎవ్వరు లేక ఒకరెనుక ఒకరు అందరూ మా బతుకమ్మకాడికే ఉరికచ్చిండ్రు. ఇగ అటెనుక తప్పక కిట్టవ్వ నన్ను అచ్చి పాడుమని మనిషిని పంపితే నేను ఆనాడు పోలేదు గానీ తెల్లారినాడు పోయి పాడిన.
45 ఏండ్ల కింద గోదారి వరదలకు బయపడి మా సొంతూరు మంగలిగడ్డను ఇడిసిపెట్టి పక్కూరు శెగ్యామకచ్చినంక గూడ మా వాడకట్టుకు నేనే పాడు డు. పతి వాడకట్టుకొక్కరే పాడేటోళ్లుందురు. ఐతే శెగ్యామ మన్నెపు ఆడోళ్లకు గూడ బాగనే పాటలత్తయ్. గానీ, నాడు ఆ మాదిగి మన్నెపోళ్లు, రెడ్లు, ఎల్మలు గూడ బతుకమ్మ ఆడకపోతుండిరి. తరువాత్తరువాత పెద్ద కులపోల్లు గూడ ఆల్ల ఇండ్లల్లనే బతుకమ్మలు పెట్టి చిన్న కులపోల్లను ఆడుమంటుండిరి. ఈ మద్దె అందరాడుతున్నరు.
బతుకమ్మ పాటలు ఎన్ని పాటలైన పాడచ్చు. కథ తెలిత్తే అల్లుకుంట పోవుడే. అట్ల నేను ఎన్నో కథలను బతుకమ్మ పాటల తీర కైగట్టి పాడేది. పురాండెం, రామాండం, భారతం, సతీసావిత్రి పాము పాట, ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, ఒగ్గు పట్నాల కథ, పసుపు బండారి తెచ్చే కథ… ఇట్ల ఎన్నో పాటలు పాడేది. ఊల్లెకే అచ్చి మాదిగి మన్నెపోళ్లను అడుక్కునేటోళ్లు చిందోళ్లు, మాట్లోళ్లు… ఇట్ల ఎందరో ఎన్నో కథలు ఆడేటోళ్లు, పాడేటోళ్లు గదా! ఆళ్ల నుంచి ఎన్నో కథలు నేర్సుకొని బతుకమ్మ పాటల తీరుగ కైగట్టి పాడేది.
నా నుంచి నా చిన్నబిడ్డ దేవక్క బతుకమ్మ పాట లు బాగ నేర్సుకున్నది. ఆమెను ధర్మపురి మండలంల రాయపట్నంకు ఇచ్చినం. ఆమె అత్తగారింటికి పోయినంక మళ్లిన్ని పాటలు నేర్సుకున్నది. పెద్ద పెద్ద పాటలు, గురువమ్మ పాట నాకు అచ్చినట్టే దేవక్కకు గూడ అచ్చు. గానీ, నాకు రాని గుర్రం మీది రాజు పాట కొత్తగ నేర్సుకున్నది. మస్తు పాటలు పాడుతది. ఇగ అట్ల ఆమెతో పాడిచ్చి కొన్ని ముక్కెమైన పాటల్ను నా చిన్న కొడుకు సత్యనారాయణ రాత్తే ఆ పుస్తకాన్ని మూడేండ్ల కింద పబుత్తమే చెపాయించింది. అయన్ని ఎనుకటి నుంచి అత్తన్న పాటలు. గసొంటియి పాడుకోవాలె, గమ్మతుంటది.
ఈ మద్దె ఆడిపిల్లగాండ్లు ఏందేందో పిచ్చి పిచ్చి పాటలు, ఏందో డీజేలని పెట్టుకుంట పిచ్చిపిచ్చిగ ఎగురుతుండ్రు, దునుకుతుండ్రు. కోలలు కొడుతండ్రు. కోలలు గొట్టుడు ఎక్కడ్నుంచి అచ్చిందో! మాకైతే ఎరుకనే లేదు. ఇప్పుడు సెల్పోన్లల్ల, డీజేలల్ల పెట్టుకుంటున్న పాటలు గూడ నాటి ఆషారపు పాటలు కాదు. ఏవో పిచ్చిపిచ్చి పాటలు. ఆటివల్ల పిడిపిడీల నుంచి అత్తన్న మన ఆషారాలు బౌషత్
పిల్లలకెట్ల తెలుత్తయ్?
నాడు తంగెడుపూలు, గునుకపూలు, కట్లపూలు, గోరంటపూలు, బంతిపూలు, గుమ్మడిపూలు, బీరపూలు… ఇట్ల ఎన్నో తీరొక్క పూలు తెచ్చి బతుకమ్మను ఎంతో శుంగారంగ పేరిచ్చుకునేది. బతుకమ్మ ఎంత పెద్దగుంటే అంత గొప్ప అని పోటీవడి పేరిచ్చుకునేది. చవితి తెల్లారి నుంచి శిబ్బిల పూలేసుకొని పోయి వాడకట్టుకు ఆడుకునేది. ఇరువయైదొద్దులు అట్ల ఆడుకున్నంక పెత్రమాసనాడు పొద్దుగాల పెద్దలకు బియ్యమిచ్చి పూలు, పత్రి పెట్టి పూజించి తిన్నంక ఇగ మిగిల్న పూలు ముందటేసుకొని చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మల పేరిచ్చుడు. అందుకే ఆటిని ఎంగిలి పూల బతుకమ్మలంటరు.
ఆనాడు బతుకమ్మ బాయి తవ్వి, అండ్ల ఎంపలి చెట్టు నాటి, ఆనాటి నుంచి బాయి చుట్టూ సప్పట్లు కొట్టుకుంట తిరుక్కుంట ఆడిపాడుకునుడు. ఆనాడు గూడ ఆడిపిల్లలు, పెద్ద మనుషులు అందరాడేది. అట్ల అర్రెం (ఆరో దినం) ఇడిసి ఏడు దినాలు ఆడుకున్నంక ఎనిమిదో దినం సద్దుల బతుకమ్మ నాడు ఆడోళ్లందరూ ఒగలకొగలు చెంపలకు పసుపు బెట్టుకొని, బతుకమ్మల మీది గౌరమ్మల దగ్గర అన్నం, పెరుగు, నెయ్యి, శక్కరి కలిపి సేసిన సద్దులు వెట్టేది. అందుకే ఆ బతుకమ్మలను సద్దుల బతుకమ్మలు అనేది. మా తల్లి మక్కపిండిల బెల్లం, పాలు కలిపి మక్క సత్తు సేసేది. మా కమ్మగుండు.
ఇప్పుడేందో పిలాస్టిక్ బతుకమ్మ, లేపోతే ఇన్నన్ని బంతిపూలను చిన్న తట్టలేసుకొని దాన్నే బతుకమ్మ అంటుండ్రు. ఇయ్యన్ని ఇచ్చంత్రాలు జూత్తె కడుపు కోసుకపోతంది గానీ ఏం జెయ్యాలె? నాటి బతుకమ్మలు ఎంత ముద్దుగుండేటియి! ఎంత ఆరోగ్గెంగ ఉండేటియి! అప్పటి ఆతావరణమే ఎంతో మంచిగుండె.
ఇప్పుడు గూడ పిలాస్టిక్ను బంద్ జేత్తున్నట్టు పిలాస్టిక్ బతుకమ్మలను గూడ బంద్ వెట్టి పబుత్తం మంచిగ నాటి పాటలను పషారం జేత్తె అందరికీ మంచిగుంట ది. ఇప్పుడు పతొక్కల సేతుల్ల సెల్లు పోన్లేనాయే. పషారం జేత్తె అయిపాయె.
రాసింది: డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, 94909 57078
చెప్పింది: ద్యావనపల్లి లింగమ్మ