పశుగణాభివృద్ధిలో కీలకమైన గోపాలమిత్రలపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. నెలవారి లక్ష్యాలు మాత్రం విధిస్తూ పనులు చేయించుకుంటున్నా.. నెలనెలా వేతనాలు ఇవ్వకుండా గోస పెడుతున్నది. చివరకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ పూట పస్తులుండే పరిస్థితులు వచ్చినా దయచూపకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : మూగ జీవాలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు పశుసంవర్ధక శాఖలో గోపాలమిత్రలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో కొందరు వెటర్నరీ వలంటరీ వర్కర్లుగా 1998లో విధుల్లో చేరగా, మరికొందరు గోపాలమిత్రలుగా 2001 నుంచి పనిచేస్తున్నారు. పశు వైద్యశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పాడి రైతుల ఇండ్లకే వెళ్లి వీరు సేవలందిస్తున్నారు. 24 ఏండ్లుగా గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు.
2022 వరకు అరకొర వేతనాలతో దుర్భరమైన జీవితాలు గడిపారు. అప్పటి వరకు కేవలం 8,500 మాత్రమే గౌరవ వేతనం ఉన్న వీరిని బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. ఒకేసారి 30 శాతం పెంచి వేతనం 11,050కు పెంచింది. నెల నెలా సక్రమంగా అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఐదారు నెలలకు ఒక సారి కూడా వేతనాలు రావడం లేదు. ఒక్కోసారి తొమ్మిది, పది నెలల సేవలు అందిస్తే మూడు, నాలుగు నెలలు వేతనాలు ఇస్తున్నది. దీంతో గోపాల మిత్రల పరిస్థితి అధ్వానంగా మారింది.
ఎన్ని రకాల సేవలందించినా..
పశువులకు కృత్రిమ గర్భదారణ సేవలందించడంతోపాటు పశు సంవర్ధక శాఖ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో గోపాలమిత్రలు పాల్గొంటున్నారు. పశు గర్భకోశ చికిత్సలు, వైద్య శిబిరాలు, గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ, టీకాలు వంటి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. నెలవారీగా లక్ష్యాలకు అనుగుణంగా సేవలు పనిచేస్తున్నారు. దీంతో ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది.
అయినా, నెలవారి లక్ష్యంలో ఒక్కోసారి వెనుకబడిపోతే వేతనాల్లో కోతలు విధిస్తున్నారని గోపాలమిత్రలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి బతుకులు దినదిన గండంగా మారిపోతున్నాయి. సుమారు 24 ఏండ్లుగా సేవలు అందిస్తున్న గోపాలమిత్రలకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయింది. పశుగణాభివృద్ధిలో రాత్రనకా పగలనకా సేవలందిస్తున్న వీరికి ఇప్పటికీ గౌరవ వేతనం కిందనే చెల్లింపులు జరుగుతున్నాయి.
1,200 గౌరవ వేతనంతో మొదలైన గోపాలమిత్రలకు క్రమంగా వేతనాలు పెంచుతూ వచ్చారు. నిత్యం రైతుల మధ్య ఉండి, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు సైతం వెళ్లి పశువులకు సేవలందిస్తున్న గోపాలమిత్రలకు కనీస వేతనం ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉన్నది. తమని పశుసంవర్ధక శాఖలో విలీనం చేయాలని, ఆఫీస్ సబార్డినేటర్లుగా నియమించేందుకు 50 శాతం కోటా ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, తమని ఓఎస్ ఉద్యోగులుగా గుర్తించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌గా ఉన్నది.
కానీ, అర్ధాకలితో విధులు నిర్వహిస్తున్న గోపాలమిత్రల వేదన వర్ణనాతీతంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ర్టాల్లో గోపాల మిత్రల సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వాలు, ఉద్యోగాల్లో మెరిట్ మార్కులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. కానీ, ఇక్కడ మాత్రం వీరికి కనీసం నెల నెలా వేతనాలు కూడా అందని పరిస్థితులున్నాయి.
కుటుంబ పోషణకూ కష్టాలు
ఏదో ఒకనాడు తమకు మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో గోపాలమిత్రలు, వేతనాలు వచ్చినా.. రాకున్నా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇచ్చే అరకొర వేతనమైనా నెలనెలా చెల్లిస్తే తమ కుటుంబాలకు ఆసరాగా నిలిచేదని, నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నామని వాపోతున్నారు.
అప్పులు చేసి నెట్టుకురావాల్సి వస్తున్నదని, కనీసం పండుగ పూట కూడా వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం తమను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువుల ఫీజులు చెల్లించలేక, ఎదిగిన పిల్లలకు పెండ్లిళ్లు చేయలేక పోతున్నామని, కనీసం పండుగ పూటనైనా పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చే పరిస్థితిలో తాము లేమని మదనపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు విని వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.