భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా అనేక చోట్ల రోడ్లు దెబ్బతినగా, ఆయా రూట్లలో వెళ్లే ప్రయాణికులు నిత్యం నరకం అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది. అడుగడుగునా గుంతలు పడి.. బురదమయంగా మారి అడుగు తీసి అడుగవేయలేని పరిస్థితి దాపురించింది. ఇక పలుచోట్ల వంతెనల నిర్మాణాలు నిలిచిపోగా, చిన్నపాటి వానలకే వాగులు.. వంకలు ఉప్పొంగి మారుమూల పల్లెలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఏళ్లకేళ్లు ‘దారి’ద్య్రం వెంటాడుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడని, ఇకనైనా ప్రభుత్వం చొరవ చూపి రోడ్లకు మరమ్మతులు చేయించి.. బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని ప్రజానీకం వేడుకుంటున్నది.
నాసిరకం పనులు..తారు రోడ్డుకు పగుళ్లు
భీమిని, సెప్టెంబర్ 28 : భీమిని మండల కేంద్రంలో ఇటీవల వేసిన తారు రోడ్డు పగుళ్లు తేలింది. కాంట్రాక్టర్ నాసిరకం మట్టి వాడడం.. సరిగ్గా తారు వేయకపోవడం వల్ల రోడ్డు ఇలా తయారైంది. రాజకీయ నాయకుల అండదండలుండ డంతో గుత్తేదారు ఇష్టారీతిన రోడ్డు వేశాడంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో సింగిల్ రోడ్డు వేయడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టడమేగాక.. రోడ్డు విస్తరణ పనులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు సరిగా లేక.. ఆర్టీసీ బస్సు రాక..
వేమనపల్లి, సెప్టెంబర్ 28 : వేమనపల్లి మండల కేంద్రం నుంచి నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లికి కనీసం బీటీ రోడ్డు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 45 కిలోమీటర్ల దూరంలోనున్న బెల్లంపల్లి పట్టణానికి సరైన రోడ్డు లేక ఆర్టీసీ బస్సులు కూడా రావడం లేదు. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తున్నది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బుయ్యారం నుంచి వేమనపల్లి వరకు 16 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు మంజూరై పనులు పూర్తయినప్పటికీ నాగారం నుంచి మంగెనపల్లి వరకు నాలుగున్నర కిలోమీటర్ల రోడ్డుకు అటవీ అనుమతులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వర్షాలు పడినప్పుడుల్లా రోడ్డంతా బురదమయంగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రానికి జిల్లెడ, జక్కెపల్లి, నాగారం, సూరారం , లక్ష్మీపూర్, బద్దెంపల్లి, బమ్మెన గ్రామాల ప్రజలు వెళ్లడానికి నరకం చూడాల్సి వస్తున్నది.
ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సిందే..
కాసిపేట, సెప్టెంబర్ 28 : కాసిపేట మండలం తిరుమలాపూర్ గ్రామానికి వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సి వస్తున్నదని ప్రయాణికులు చెబుతున్నారు. తిరుమలాపూర్ గిరిజనులు ఏ అవసరం వచ్చినా వాగు దాటాల్సిందే. చిన్నపాటి వర్షాలకే వాగు ఉప్పొంగుతుండ డంతో గ్రామస్తులు-ఉద్యోగులు నరకం అనుభవించాల్సి వస్తున్నది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అంగన్వాడీ, టీచర్, ఆయా విధులకు హాజరయ్యారు. తిరిగి వచ్చే సమయంలో వర్షం పడడంతో వాగు ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో స్థానికుల సాయంతో వారు వాగు దాటాల్సి వచ్చింది. ఇకనైనా అధికారులు స్పందించి బ్రిడ్జితో పాటు రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
అంతర్గత రహదారులు అధ్వానం
చెన్నూర్, సెప్టెంబర్ 28: చెన్నూర్ పట్టణంలోని అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షాలకు బురదమయంగా మారి నడవలేని పరిస్థితి నెలకొంది. పద్మనగర్ కాలనీలోని ఏడీఎంఎస్ షోరూం ఎదురు నుంచి వెళ్లే అంతర్గత రహదారి గురించి చెప్పనవసరం లేదు. 15వ వార్డులోని మూలమలుపు వద్ద వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రిళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
లెక్కలేనన్ని గుంతలు
బెజ్జూర్, సెప్టెబర్ 28 : ఇటీవల కురిసిన వర్షాలకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్-సోమిని రోడ్డులో లెక్కలేనన్ని గుంతలు ఏర్పడ్డాయి. ఆయా రూట్లో వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు, బైకులు కూడా నడపలేని పరిస్థితి ఉంది. సుమారు 12 గ్రామాల ప్రజలు బెజ్జూర్ మండల కేంద్రానికి రాలేని దుస్థితి నెలకొంది. అధికారులకు మొరపెట్టినా స్పందించకపోవడంతో స్వయంగా ఆటో యూనియాన్ నాయకులు ట్రాక్టర్ల ద్వారా మొరం పోసి రోడ్డును బాగు చేయించారు.
దౌడపల్లి-చెల్లంపేట రోడ్డుకు మరమ్మతులేవీ..?
లక్షెట్టిపేట, సెప్టెంబర్ 28 : లక్షెట్టిపేట మండలం దౌడపల్లి-చెల్లంపేట రోడ్డు అధ్వానంగా మారింది. 5 కిలోమీటర్ల మేర 6 గ్రామాలుండే ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతున్నది. తలమల, మన్నెగూడం, చందారం, హన్మంతుపల్లె, రంగపేట, పోచంపల్లి గ్రామాల ప్రజలు నిత్యం ఈ దారి గుండానే ప్రయాణిస్తుంటారు. ఈ రూట్లో చిన్నయ్య, పెద్దయ్య దేవుళ్ల గుళ్లు కూడా ఉన్నాయి. ప్రతీ ఆది, గురువారాల్లో జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వందల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తుంటారు. కనీసం ఎడ్ల బండ్లు కూడా నడిచే వీలు లేకుండా పోయింది. కనీసం మరమ్మతులు చేపట్టే దిక్కు కూడా లేదు.
రోడ్లు బురదమయం..
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 28 : నస్పూర్ ఏరియా శ్రీరాంపూర్ ఆర్కే-6 గుడిసెల్లోని 17 వార్డు గాంధీనగర్లోని రోడ్లు పూర్తిగా చెడిపోయి, నడవలేని పరిస్థితికి చేరాయి. వర్షాలకు రోడ్లు బురదగా మారి అడుగు తీసి అడుగే వేయలేని పరిస్థితి ఉంది. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు.