సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో మరో మరుపురాని రోజు. కోట్లాది మంది అభిమానుల ఆశలు, ఆశయాలు మోసుకుంటూ భారత జట్టు కొత్త అధ్యాయం లిఖించింది. మేటి జట్లను మట్టికరిపిస్తూ ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ టోర్నీని సగర్వంగా ముద్దాడింది. గత రికార్డులను తిరుగరాస్తూ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకున్నది. కుర్రాళ్లు, అనుభవజ్ఞుల కలబోతతో కూడిన టీమ్ఇండియా..అంతగా అచ్చిరాని అహ్మదాబాద్‌లో నయా శకానికి నాంది పలికింది.
మూడేండ్ల క్రితం మొతెరాలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన దారుణ పరాభవాన్ని మరిపిస్తూ కలల కప్‌ను సొంతం చేసుకున్నది. సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్సీలో భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ అద్భుత ప్రయాణంలో ఒక్కొక్కరు తమవంతు పాత్ర పోషించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతమ్ గంభీర్ కాంబినేషన్లో జట్టు కూర్పు జరిగింది. ఇందుకోసం 2024 వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడే అడుగులు పడ్డాయి. ప్రతిభ చాటిన కుర్రాళ్లకు అవకాశమివ్వడంతో దిగ్గజ ద్వయం రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ రిటైర్మెంట్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.
ఓవైపు ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన వారికి చాన్స్ ఇవ్వడంతో పాటు దేశవాళీలో పరుగుల వరద పారించిన వారిపై సెలెక్టర్లు నమ్మకముంచారు. డాషింగ్ ఓపెనర్ అభిషేక్‌శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, తిలక్‌వర్మ, రింకూసింగ్ ఈ కోవలోకే వస్తారు. ఈ రెండేండ్ల ప్రయాణంలో వారివారి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ కోర్‌టీమ్‌ను తయారు చేయడంలో సూర్యకుమార్, గంభీర్ సఫలీకృతమయ్యారు.
ఫామ్‌లో ఉన్నప్పుడు ప్లేయర్లను మరింత ప్రోత్సహించడం, విఫలమైనా వెన్నుతట్టడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మెగాటోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ డక్ ప్రదర్శన కనబరిచినా అభిషేక్‌శర్మకు మేనేజ్మెంట్ అండగా నిలిచింది. టీమ్ కాంబినేషన్లో శాంసన్‌కు అవకాశం రాకపోయినా అతను ఏ మాత్రం నిరుత్సాహపడకుండా వచ్చిన చాన్స్‌ను మ్యాచ్ విన్నర్‌గా మలుచుకున్న తీరు అద్భుతం. చివరి మూడు మ్యాచ్‌ల్లో తనలోని చాంపియన్ ఆటతీరును ప్రపంచానికి పరిచయం చేస్తూ శాంసన్ ఆడిన ఆటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
బ్యాటర్ల వరకే పరిమితం గాకుండా బౌలింగ్‌లో బుమ్రా మరోమారు తాను ఎంత విలువైన బౌలరో నిరూపించుకుంటే తాను నిఖార్సైన ఆల్‌రౌండర్ అని అక్షర్‌పటేల్ చేతల్లో చూపెట్టాడు. అర్ష్‌దీప్‌సింగ్, హార్దిక్‌పాండ్యా తమదైన పాత్ర పోషించారు. దెబ్బతిన్న పులిలా పుంజుకున్న శాంసన్ విరుచుకుపడ్డాడు. ఇలా ప్రతీ ఒక్కరు ఒక్కో చేయి వేస్తూ అహ్మదాబాద్‌లో కొత్త చరిత్ర లిఖించారు.
లక్ష మందికి పైగా అభిమానులతో కిక్కిరిసిన స్టేడియంలో త్రివర్ణ పతకంతో సంబురాల్లో మునిగిపోయారు. కివీస్‌ను మరోమారు రన్నరప్‌కు పరిమితం చేస్తూ టీమ్ఇండియా మూడోసారి కప్‌ను ముద్దాడగా, దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పిన్న, పెద్ద జాతీయ పతకాలతో ధూంధాం చేశారు. టీ20 ప్రపంచకప్ విజయంతో దేశంలో సమైక్య స్ఫూర్తిని కనబరిచిన తీరు అనిర్వచనీయం.