కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల పునర్విభజన కోసం ప్రతిపాదిస్తున్న మూడు బిల్లులు పార్లమెంట్‌నే కాదు, దేశ భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేలా ఉన్నాయి. సీట్ల పెంపు కోసం మోదీ సర్కార్ 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుంటున్నది. అందువల్ల హిందీ బెల్ట్‌లోని ఆరు రాష్ర్టాల్లో లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 195 నుంచి 328కి పెరిగే అవకాశమున్నది. అదే సమయంలో దక్షిణాది ఐదు రాష్ర్టాల్లోని స్థానాలు 129 నుంచి 169కి పెరుగుతాయి. రెండింటి మధ్య వ్యత్యాసం మరింత పెరిగి 160 స్థానాల తేడాగా మారుతుంది.
దేశంలో లోక్‌సభ స్థానాల పెంపు దిశగా కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నేటి (16-04-26) నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నది. ఈ సమావేశాల్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేసింది. వాటిలో మొదటిది, కీలకమైనది రాజ్యాంగ సవరణ బిల్లు. దీనిని మనం తల్లి బిల్లు అని పిలవవొచ్చు. ఈ బిల్లు ప్రకారం ప్రజల సభగా పేర్కొనే లోక్‌సభలో వివిధ రాష్ర్టాల్లోని నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 815కు మించకూడదు. కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 35గా ఉండవచ్చు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపునకు రంగం సిద్ధం చేసిన కేంద్రం, జనాభా అనే మాటకు కూడా అర్థాన్ని నిర్వచించింది. పార్లమెంట్ చట్టం ద్వారా అధికారికంగా ప్రచురించిన జనగణన అని తెలిపింది. అంటే ఇప్పటివరకు అధికారికంగా అందుబాటులో ఉన్నవి 2011 జనాభా లెక్కలే. కాబట్టి ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు పెంచనున్నదని స్పష్టమవుతున్నది.
మరోవైపు 2026 తర్వాత జరగనున్న జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఆర్టికల్ 82లోని మూడవ క్లాజు చెప్తున్నది. అయితే ఈ ఏప్రిల్ 1న కొత్తగా జనగణన ప్రారంభమైంది. ఈ లెక్కల వివరాలు వచ్చే వరకు కేంద్రం ఆగకుండా ఆగమేఘాలపై సీట్ల పెంపుపై ఎందుకు దృష్టి పెట్టిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అది కూడా 15 ఏండ్ల క్రితం నాటి పాత లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం అసంబద్ధంగా ఉన్నది. పాత గణాంకాలను డీలిమిటేషన్‌కు వర్తింపజేసే సమయానికి అవి మరింత పాతబడిపోతాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ర్టాలు, ఐదు దక్షిణ రాష్ర్టాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, తమిళనాడు) మధ్య వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంటుంది.
నియోజవర్గాల పునర్విభజన బిల్లు. ఇది డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించింది. రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాల పునర్విభజన, రాష్ర్టాల శాసనసభల్లోని మొత్తం స్థానాల సంఖ్య సర్దుబాటు వంటి విషయాలు ఈ బిల్లులో పొందుపర్చి ఉన్నాయి. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం చేయాల్సిన ప్రక్రియ. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలేమీ ఉండవు.
ఇక మూడో బిల్లు విషయానికి వస్తే ప్రధానంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఇదే విధమైన నిబంధనలను వర్తింపజేస్తుంది. అయితే, డీలిమిటేషన్ కమిషన్ నిర్మాణం ఎలా ఉంటుంది? అందులోని సభ్యుల ఎంపిక ఎలా జరుగుతుంది? అనేవి అసలు ప్రశ్నలు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లును పరిశీలిస్తే కమిషన్ నిర్మాణం మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందనే విషయం స్పష్టమవుతున్నది. ఏ రాష్ర్టానికి ఎన్ని సీట్లు కేటాయించాలనేది డీలిమిటేషన్ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారని బిల్లులో పేర్కొన్నది. దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై, ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరుతెన్నులపై అనేక సందేహాలు, విమర్శలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలతో బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాల ప్రయోజనాలకు విఘాతం కలిగే ప్రమాదమున్నదని విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కేంద్రం చెప్తున్న దాని ప్రకారం 20011 జనాభా లెక్కల ప్రకారమే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలిద్దాం. నాటి లెక్కల ప్రకారం సీట్ల సంఖ్యను పెంచితే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉదాహరణకు ఆరు హిందీ బెల్ట్ రాష్ర్టాలైన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గణాంకాలు చూసుకుంటే దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే ఆ ఆరు రాష్ర్టాల్లో జనాభా వేగంగా పెరిగినట్టు స్పష్టమవుతున్నది. ప్రస్తుతం ఆ ఆరు రాష్ర్టాల్లో 195 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ డీలిమిటేషన్ కమిషన్ 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే, దేశంలో మొత్తం 800 సీట్లుగా ఖరారు చేస్తే ఆ ఆరు రాష్ర్టాలకే 328 సీట్ల కేటాయింపు జరుగుతుంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, తమిళనాడులోని 129 స్థానాలు 168కి పెరుగుతాయి. అంటే విద్యా, వైద్య రంగాల్లో చైతన్యం, అభివృద్ధి కారణంగా జనాభా నియంత్రణను అద్భుతంగా అమలు చేసినరాష్ర్టాలకు కేవలం 39 సీట్లు మాత్రమే అదనంగా లభిస్తే, జనాభా నియంత్రణలో వెనుకబడిన రాష్ర్టాలు అదనంగా 133 స్థానాలను పొందుతాయి. సీట్ల సంఖ్యలో ఈ వ్యత్యాసం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి కీలక అంశంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీసుకుంటున్న చర్యల పట్ల దక్షిణాది రాష్ర్టాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, ఇదే తుది హెచ్చరిక అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేల్చిచెప్పారు. కేంద్రం ప్రతిపాదనలు దక్షిణాదికి అన్యాయం చే సేలా, ఉత్తరాది రాష్ర్టాలకే ప్రయోజనం చేకూర్చే లా ఉన్నాయని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అన్నారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని పలువురు నిపుణులు, దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును ఓటింగ్ ద్వారా ఆమోదించుకోవాలంటే మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తే బిల్లుల అమోదం అసాధ్యం.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కసరత్తును వేగవంతం చేస్తున్నామని చెప్పుకొనేందుకు ప్రభుత్వం హడావుడి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వం చెప్తున్నట్టుగా 800కు పైగా స్థానాలు పెరిగితే ప్రపంచంలోనే అత్యధికంగా ఎన్నికయిన సభ్యులు గల చట్టసభగా లోక్‌సభ గుర్తింపు పొందుతుంది. కానీ మహిళా బిల్లు, డీలిమిటేషన్, జనగణనను కలిపి కసరత్తు చేయడం అసంబద్ధంగా ఉన్నది. కేంద్రం తీరు పార్లమెంటు, ప్రజాస్వామ్య అనిశ్చితికి దారితీసేలా కనిపిస్తున్నది. కేంద్రం వైఖరి సమాఖ్య స్పూర్తికి విరుద్ధం. ఈ ధోరణి చూస్తుంటే హంగరీ నియంత ఓర్బన్ తరహా నిర్వాకంలాగానే కనిపిస్తున్నది. ఇటీవలే ఆయనను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.
(వ్యాసకర్త: జేఎన్‌యూలో ప్రొఫెసర్)
(‘ది వైర్’ సౌజన్యంతో)
– సంతోష్ మెహ్రోత్రా