స్టాక్ మార్కెట్ దేశ ఆర్థికవ్యవస్థకు అద్దం లాంటిది. డాలర్ విలువతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం కావడం, ఎప్పుడూ లేనివిధంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిధులు తరలించుకుపోవడం, ఇండియా ఎగుమతులపై అమెరికా 50 శాతం అపరాధ రుసుం విధించడం వంటి కారణాలతో స్టాక్ మార్కెట్ నిజానికి కుప్పకూలిపోవాలి. ఈ మూడు ప్రధాన కారణాలే కాదు, గతంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఇదే స్థాయిలో నిధులు తరలించుకుపోవడం వంటి ఒక్క కారణం చాలు మార్కెట్ నిట్టనిలువునా కూలిపోవడానికి. కానీ, ఏకంగా మూడు బలమైన అంశాలున్నా మార్కెట్ పడిపోకుండా నిలబడింది. ఈ మూడు బాణాలకు ఒకే ఒక్క సమాధానం మన దేశ యువశక్తి.
జెన్‌జీ గతంలో ఎప్పుడూ లేనివిధంగా పెద్దఎత్తున స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ పడిపోకుండా నిలదొక్కుకుంటున్నది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఏడాది కాలంలో ఏ స్థాయిలో నిధులు తరలించుకెళ్తున్నారో.. జెన్‌జీ అదే స్థాయిలో మార్కెట్లో మదుపు చేస్తున్నది. యువశక్తిలో మార్కెట్ పట్ల పెరిగిన ఆసక్తి, పొదుపు చేయాలనే ఆలోచన ఈ కష్ట సమయంలోనూ స్టాక్ మార్కెట్‌ను నిలబెడుతున్నది.
నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఇరుగు పొరుగు దేశాల్లో జెన్ జీ తరం విప్లవం పేరుతో విధ్వంసం సృష్టిస్తే మన దేశంలో మాత్రం ఇంతకుముందు ఎప్పుడూ లేనిస్థాయిలో ఆర్థిక విప్లవం సృష్టిస్తున్నది. ఈఎంఐల వలలో చిక్కుకుపోవడం, అప్పు చేసైనా ఐఫోన్ కొనడం, అభిమాన హీరోల పేరుతో రోడ్డునపడే యువత మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న మాట వాస్తవమే. అదే సమయంలో అంతకన్నా ఎక్కువ సంఖ్యలో పొదుపు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న యువత కూడా ఉన్నది.
దేశంలోని ఆర్థిక సంస్థలు అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారమే గతంలో ఎప్పుడూ లేనివిధంగా జెన్ జీ తరం పొదుపు చేస్తున్నది. 2025, డిసెంబర్ 16 నాటికే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1.61 లక్షల కోట్ల నిధులు మార్కెట్ నుంచి తీసుకువెళ్లారు. అదే సమయంలో రూపాయి విలువ ఒక డాలర్‌కు రికార్డు స్థాయిలో 91కి పడిపోయింది. మన దేశం నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తరలించుకుపోతున్న నిధులు ఎంత పెద్ద మొత్తమో అర్థం కావాలంటే అంతకు రెండేండ్ల ముందు లెక్కలు చూడాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,08,212 కోట్ల ఇన్‌ఫ్లో ఉంది. ఇప్పుడు దీనికి పూర్తి రివర్స్‌లో ఔట్ ఫ్లో అడ్డుకట్ట లేకుండా సాగుతున్నది. 2024 అక్టోబర్ నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. 2025లో ఈ అమ్మకాలు మరింత ఉధృతమయ్యాయి. ఈ డిసెంబర్లో కూడా రోజూ 2-3 వేల కోట్ల రూపాయల వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిధులు తరలించుకుపోతున్నా మార్కెట్ పెద్దగా క్రాష్ కాలేదు.
ఒకవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలు సాగిస్తూ నిధులు తరలించుకుపోతుంటే అంతకన్నా ఎక్కువ మొత్తంలో స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మార్కెట్లోకి నిధులు తరలిస్తున్నారు. 2025లో రికార్డు స్థాయిలో రూ.7.44 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో ఉన్నది. కొత్త తరానిదే ఇందులో ప్రధాన పాత్ర. మన దేశంలో 37 కోట్ల మంది యువశక్తి ఉన్నది. జనాభా నిష్పత్తితో చూస్తే ప్రపంచంలో అన్నిదేశాల కన్నా యువత సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. గత ఐదేండ్లలో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం బాగా పెరిగింది. యువతలో ఆర్థిక అవగాహన పెరగడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల ఇది సాధ్యమైంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్- రిజిస్టర్డ్ పెట్టుబడిదారుల్లో 30 ఏండ్లలోపు వారు 40 శాతం ఉన్నారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే సంస్కృతి యువతలో బాగా పెరిగింది. కొత్త సిప్‌లు 55-60 శాతం వరకు టాప్-30 నగరాల నుంచి వస్తున్నది. టైర్-2 నగరాల్లో ఈ వృద్ధి ఎక్కువగా కనిపిస్తున్నది. ఏంజిల్ వన్, నెల్సన్ సర్వే ప్రకారం.. 2024లో 93 శాతం మంది జెన్‌జీ యువత క్రమం తప్పకుండా పొదుపు చేస్తున్నది. నెలవారీ ఆదాయంలో 20-30 శాతం పొదుపు చేస్తున్నది. 2025లో ధరల పెరుగుదల వంటి కారణాలతో 50 శాతం మంది పొదుపు చేశారు. 79 శాతం మంది 20 శాతం కంటే తక్కువ పొదుపు చేస్తున్నారు.
2024-25 డేటా ప్రకారం.. మ్యూచువల్ ఫండ్స్‌లో నెల నెలా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) చేసేవారిలో 48 శాతం మంది 18-30 ఏండ్లలోపు వారే. వీరు మార్కెట్‌ను నిలబెడుతున్నారు. 92-95 శాతం వరకు యంగ్ ఇన్వెస్టర్స్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెలకు 500 నుంచి ఎంత మొత్తమైనా సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. 84 శాతం మంది మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ డేటా ప్రకారం.. 69 శాతం మంది ఇన్వెస్టర్లు 40 ఏండ్లలోపువారే. ఆర్థిక అక్షరాస్యత పెరగడం, భవిష్యత్తు కోసం అవసరమనే అవగాహన పెరగడం ఇందుకు కారణం. పాత తరం వాళ్లు బంగారం, రియల్ ఎస్టేట్, బ్యాంక్‌లలో ఫిక్స్డ్ డిపాజిట్లనే పెట్టుబడి సాధనాలుగా భావిస్తే కొత్త తరం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంతకన్నా ఎక్కువ లాభాలు పొందవచ్చని భావిస్తున్నారు. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా తాము ప్రయోజనం పొందడమే కాకుండా, దేశ ఆర్థికాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. యువతరం ఎక్కువగా ఖర్చు పెడుతున్నా మొత్తమ్మీద గ్లోబల్ జెన్‌జీ కన్నా భారత జెన్‌జీ ఎక్కువ పొదుపు చేస్తున్నది, ఇన్వెస్ట్ చేస్తున్నది.
అదే అమెరికాలోని జెన్ జీ పరిస్థితి దయనీయంగా ఉన్నది. అమెరికాలో చాలామంది జెన్‌జీకి అత్యవసర ఖర్చు కోసం చేసే పొదుపు 500 డాలర్ల కన్నా తక్కువట. అమెరికాలో డూమ్ స్పెండింగ్ అంటే భవిష్యత్తుపై ఆశల్లేకుండా ఇప్పుడే ఖర్చు చేసే ట్రెండ్ ఎక్కువ. అదే భారత జెన్ జీ మాత్రం పొదుపు విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నది.
నెలకు రూ.30 వేల కోట్ల వరకు సిప్ల ద్వారా పొదుపు చేసి మార్కెట్లోకి తెస్తున్నారు. దీనిలో సగం వాటా జెన్ జీలదే. ఈ సంవత్సరం సిప్ ద్వారా ఇప్పటివరకు 3.04 లక్షల కోట్లు వచ్చాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1.6 లక్షల కోట్లు మార్కెట్ నుంచి తీసుకువెళ్తే అంతకు రెట్టింపు సిప్ల ద్వారా మన ఇన్వెస్టర్లు మార్కెట్లోకి నిధులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో రూ.29,361 కోట్లు, అక్టోబర్‌లో రూ.29,529 కోట్లు, నవంబర్‌లో రూ.29,445 కోట్లు కేవలం సిప్ల ద్వారా మార్కెట్లోకి వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పిల్లలతో ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. జీతం రాగానే కొంత మొత్తం సిప్ చేయమని ప్రోత్సహిస్తున్నారు. సిప్ వల్ల జెన్‌జీలో చిన్న వయసులోనే పొదుపు చేసే క్రమశిక్షణ ఏర్పడుతున్నది. జెన్‌జీలో మొదలైన ఈ పొదుపు, ఇన్వెస్ట్మెంట్ అలవాటు దేశ ఆర్థికవ్యవస్థ పరిపుష్టికి దోహదం చేస్తున్నది. ఇరుగుపొరుగు దేశాల్లో జెన్‌జీ విధ్వంసాన్ని నమ్ముకొని దేశాన్ని అస్థిరపరుస్తుంటే, భారతీయ జెన్‌జీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా దేశ ఆర్థిక పునాదులను పటిష్ఠపరుస్తున్నారు.