పాక్‌తో జరిగిన యుద్ధంలో ఎవరు, ఎంత మేరకు నష్టపోయారనే చర్చ జరుగుతున్న వేళ దాయాదిని భారత్ తీవ్రంగా నష్టపరిచినట్టు స్పష్టమైంది. భారత దళాలు సాంకేతికతలో, వైమానిక శక్తిలో ఆధిక్యతను చాటాయి. భవిష్యత్తులో తమపై ఉగ్రదాడి జరిగితే భారీ మూల్యం చెల్లించేలా చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని మన దళాలు నిరూపించాయి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరులో భారత్‌కు అంతర్జాతీయంగా ఎందుకు మద్దతు లభించలేదు? పహల్గాం ఉగ్రదాడి తర్వాత వచ్చిన సింపతీ అతి తక్కువ సమయంలోనే ఎందుకు సన్నగిల్లింది? పాక్‌కు చైనా, టర్కీ, అజర్బైజాన్లు తోడుగా నిలిచినట్టు.. కీలకమైన ఆ నాలుగు రోజుల పాటు ఏ దేశమూ మనకు ఎందుకు మద్దతుగా నిలవలేదు? అణ్వాయుధాలతో పాక్ బెదిరింపులకు దిగినప్పటికీ ఐఎంఎఫ్ మరోసారి బిలియన్ డాలర్ల రుణం ఎందుకు ప్రకటించింది? ఇలాంటి ప్రశ్నలెన్నో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి.
మే 13న కరణ్‌థాపర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, సీనియర్ జర్నలిస్టు అరుణ్ శౌరి చెప్పినట్టుగా.. అంతర్జాతీయంగా మన విశ్వసనీయతను భారతీయ మీడియా తీవ్రంగా దెబ్బతీసింది. తత్ఫలితంగా అంతర్జాతీయంగా జరిగిన అభిప్రాయ యుద్ధం (పర్సెప్షన్ వార్)లో మనం ఓడిపోయాం. అరుణ్ శౌరి అభిప్రాయపడినట్టు.. ఓ వర్గం మీడియా (ప్రత్యేకించి న్యూస్ చానళ్లు) ‘ఒక దేశానికి వ్యతిరేకంగా నేరం’ అన్నట్టుగా రిపోర్టింగ్ చేశాయి. ఉగ్రవాదులు, పాక్, ముస్లింలను ఒకే గాటన కట్టి నాలుగైదు చానళ్లు వాస్తవాన్ని వక్రీకరించి కథనాలను వండివార్చాయి. తద్వారా దేశంలోని రెండు అతిపెద్ద సమాజాల మధ్య సంఘర్షణను మరింతగా పెంచాయి.
ఆయా చానళ్ల యాంకర్లు ఉపయోగించిన భాష కూడా అసభ్యకరంగా ఉంది. ఓ చానల్లో ఒక వీడియో క్లిప్ ప్రసారమైంది. అందులో తనను తాను రిటైర్డ్ మేజర్‌గా చెప్పుకొన్న ఓ వ్యక్తి.. మన దేశానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఓ ఇస్లామిక్ దేశ విదేశాంగ మంత్రిని తీవ్ర పదజాలంతో దూషించారు. ఆయన వాడిన అభ్యంతరకరమైన మాటను సదరు టీవీ స్క్రీన్‌పై చాలాసేపు చూపించారు. ఇది ముమ్మాటికీ విదేశాలతో శత్రుత్వాన్ని సృష్టించడమే. తీవ్ర నేరం కూడా. కానీ, ఆ యాంకర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని పర్యవసానంగా రెండుమూడు రోజుల తర్వాత సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ లాంటి దేశాలు పాక్‌కు ఐఎంఎఫ్ రుణం మంజూరుకు మద్దతిచ్చాయి.
యుద్ధ సమయంలో మీడియా అన్ని పరిమితులను దాటివేసింది. యుద్ధ రిపోర్టింగ్ అబద్ధాలు, యుద్ధోన్మాదంతో నిండిపోయింది. టీవీ చానళ్ల స్టూడియోలు తప్పుడు కథనాల వార్ రూమ్‌లుగా మారిపోయాయి. కల్పిత కథనాలను మీడియా ప్రసారం చేశాయి. గంటగంటకూ తప్పుడు కథనాలను ప్రసారం చేసి గందరగోళం, భయాందోళనలు సృష్టించాయి. వాస్తవాలను ప్రసారం చేసి దేశంలో నెలకొన్న పరిస్థితులను చల్లార్చకుండా.. శాంతి ఒప్పందం జరిగిన వారం తర్వాత కూడా యుద్ధోన్మాదాన్ని కొనసాగించాయి.
భారత్‌కు దౌత్యపరంగా ఇబ్బందులు ఎదురవడానికి, అంతర్జాతీయంగా ఒంటరిగా మారడానికి విదేశాంగ శాఖ మంత్రిగా జైశంకర్ విఫలమవడమే ప్రధాన కారణం. అతని దూకుడు, మన కంటే ఉన్నత స్థాయిలోని దేశాలతో మాట్లాడే విధానం, విశ్వగురు ఆశయాలు అంతర్జాతీయ అంశాల్లో మన స్థాయికి సరిపోలవని గుర్తించేందుకు నిరాకరించడం, ప్రజాస్వామ్యాన్ని గుర్తించడంలో అసమర్థత, అవకాశవాదం కలగలిసి.. ప్రపంచ దేశాలు మన రాజకీయాలను, మన విధానాలను అనుమానించడానికి, మన నుంచి దూరం కావడానికి దారితీశాయి. మన పొరుగు దేశాల్లోనూ మనకు మిత్రులు లేరని పాకిస్థాన్ యుద్ధం స్పష్టం చేసింది.
ప్రపంచం ఇలాంటి ఘటనలను గమనించి భారతదేశం నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదం అనే ప్రధాన కారణం వెనక్కి వెళ్లిపోయి.. హిందూ భారత్ వర్సెస్ ఇస్లామిక్ పాకిస్థాన్ అనే నెరేటివ్ తెరపైకి వచ్చింది. రాజకీయ, మీడియా వైఫల్యాల వల్ల యుద్ధభూమిలో మన సైనికులు సాధించిన విజయాలు వృథా అయ్యాయి. అవకాశవాదం, మానవ హక్కుల అణచివేత, విద్వేషం, మత జాతీయవాదంలో కూరుకుపోయిన దేశం.. నైతికంగా ఉన్నత స్థానాన్ని, అంతర్జాతీయ మద్దతును ఆశించడం కుదరదు. దీని కోసం కాదు మన సైనికులు పోరాడింది. మన సైనికులు గెలిచారు, కానీ ఒక దేశంగా మనం వారిని తీవ్రంగా నిరాశపరిచాం.
-వ్యాసకర్త: రిటైర్డ్ ఐఏఎస్ అవయ్ శుక్లా