యాభై మూడేండ్ల క్రితం పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడిన 1971 యుద్ధానికి, రెండు దాయాది దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణకు తేడాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదిద్దుకుంటున్న 2025 వేసవి పోరు మాదిరిగా అప్పటి యుద్ధం పూర్తిగా కశ్మీర్ వివాదం నుంచి రాజుకోలేదు. అందుకే దాన్ని చాలా మంది బంగ్లాదేశ్ యుద్ధం అంటారు. కానీ ప్రస్తుతం పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ మొదలుపెట్టిన దాడుల్లో పాకిస్థాన్ మూణ్ణాళ్లకే చతికిలబడే పరిస్థితి వచ్చింది. చేవలేక పోయినా దుర్మార్గపు ఎత్తుగడలకు పాల్పడి పాకిస్తాన్ ఈ దుస్థితిని తనంతట తానే ఆహ్వానించింది.
కేవలం మతం ఆధారంగా, ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలో మతాన్ని జాతిగా వర్ణించి, వాదించి పుట్టిన దుందుడుకు దేశం పాకిస్థాన్. తన ఉనికికి పునాదిగా ప్రకటించుకున్న మతానికి కూడా గౌరవం ఇవ్వకుండా తూర్పు పాకిస్థాన్ (తూర్పు బెంగాల్) లోని బెంగాలీ ముస్లింలపై భాషా వివక్షతో ‘పశ్చిమ పాకిస్తాన్ నాయకత్వం’ క్రూరంగా వ్యవహరించింది. ఫలితం పాక్ ఎడమ భుజం తూర్పు పాకిస్థాన్ లేదా తూర్పు బెంగాల్ పాకిస్థాన్ శరీరం నుంచి తెగిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించింది. రెండు అగ్రరాజ్యాల కనుసన్నల్లో నడిచిన ప్రచ్ఛన్న యుద్ధ ప్రపంచంలో రెండు భారత ఉపఖండ దేశాల మధ్య చివరగా జరిగిందే 1971 యుద్ధం. పుట్టినప్పటి నుంచీ ప్రచ్ఛన్న యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న విఫల రాజ్యం పాకిస్థాన్. ఎవరి మాటా వినని ‘రోగ్ స్టేట్’గా ప్రసిద్ధికెక్కింది ఈ సైనిక దేశం. మొదటి నుంచీ తన జనాభా నిష్పత్తికి అసమాన రీతిలో ఎక్కువ సైన్యాన్ని పెంచి పోషిస్తూ వస్తున్న పాక్‌లో దాని వల్ల సైన్యం, రాజకీయ నాయకులు, మతతత్వ శక్తులకే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదనే వాస్తవం ప్రపంచానికి తెలుసు. 1971 యుద్ధం నాటికే భారత్ అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో ఆ ఏడాది వేసవిలో కేవలం 13 రోజులకే పాకిస్థాన్ సైన్యం భారత సేనలకు లొంగిపోయింది. అయితే అప్పటి నుంచీ కేవలం సైనిక బలగంతో, ఒక అగ్రదేశం, కొన్ని ఆసియా, పాశ్చాత్య దేశాల తోడ్పాటుతో ఎలాగైనా పూర్తిస్థాయి యుద్ధం చేయకుండానే అడ్డదారుల్లో ఇండియాను నిరంతరం గాయాలతో బలహీనం చేయాలని, 1947, 1965 యుద్ధాల్లో ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పటికీ అమలవుతూనే ఉన్నాయి. కొన్ని ధూర్త శక్తులకు పాక్ భూభాగంలో శిక్షణ ఇచ్చి, కశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి అక్కడి సైనికప్రజా ప్రభుత్వాలు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాల ఫలితమే ప్రస్తుత యుద్ధం.
తన భూభాగంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులతో పహల్గాం ఊచకోతలో 26 మందిని పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్ ఆపరేషన్ సిందూర్‌తో విజయవంతంగా బుద్ధిచెప్పిన భారత సైనిక దళాలతో తల పడడానికి ప్రయత్నించడం దుస్సాహసం. దాదాపు 54 సంవత్సరాల తర్వాత జరుగుతున్న తాజా పూర్తిస్థాయి యుద్ధంలో పాకిస్థాన్ ఎవరూ ఊహించని విధంగా అన్నిచోట్లా ఓటములను, ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నది.
ఈ ఐదున్నర దశాబ్దాల్లో రక్షణపరంగా ఇండి యా తన వైమానిక దళం సహా యావత్తు రక్షణ వ్యవస్థను, సైనిక పాటవాన్ని ఎన్నో రెట్లు పెంచుకుందని గత మూడు రోజులుగా సాగుతున్న పోరాటం రుజువు చేస్తున్నది. కొద్ది రోజుల్లోనే భారత సేనలకు తిరుగులేని విజయాలు సొంతమవ్వడంతో ఎక్కడ చూసినా ‘భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం’ గురించే చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా భారీ వరదలు, కోలుకోలేని ఆర్థిక సంక్షోభం ఫలితంగా పాక్ ప్రజలు కనీసం గోధుమ పిండి, పాలు కొనుగోలు చేయలేని స్థితికి చేరుకున్నారు. దశాబ్దాల రాజకీయ అస్థిరత అలాగే కొనసాగుతోంది. చాలాకాలంగా బద్ధ శత్రువులైన పాకిస్థాన్ ముస్లింలీగ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలతో 2024 మార్చిలో ఏర్పడిన సంకీర్ణ సర్కారు ఇస్లామాబాద్‌లో కొలువుతీరిన అత్యంత బలహీన ప్రభుత్వం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ఆర్మీ సాయంతో వేటాడడం ఒక పని అయితే, ఇండియాను పూర్తిస్థాయి యుద్ధంతో కాకుండా ఉగ్రవాద తండాలతో కశ్మీర్లో గాయపరచడం ప్రధాని షాబాజ్ ఫరీఫ్ సర్కారు అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం చివరికి ఇండియాతో యుద్ధంలో ఘోర పరాజయం పాలయ్యే దుస్థితికి తీసుకొచ్చింది. మతానికి ఉగ్రవాదం అనే విషాన్ని జోడించి కశ్మీర్ పేరుతో పన్నిన పాక్ పన్నాగానికి ఇక శాశ్వతంగా నూకలు చెల్లాయని మన కళ్ల ముందే రుజువవుతున్నది. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కిందటి నెల 16న రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రవాస పాకిస్తానీయుల సమావేశంలో రెచ్చిపోయి మాట్లాడినప్పుడే రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే అనుమానం మొదలైంది. పాకిస్థాన్‌లో మతాన్ని బాహాటంగా, తన స్వార్ధం కోసం వాడుకున్న నాటి సైనిక పాలకుడు జనరల్ జియా ఉల్హక్ మాదిరిగానే ఇండియా నుంచి వచ్చిన కరుడుకట్టిన పంజాబీ ముస్లిం కుటుంబం నుంచి ఎదిగిన అసీం మునీర్ ఆరడుగులు ముందుకేసి ఈ ఏడాది ఏప్రిల్ సమావేశంలో మతం పేరిట రెచ్చగొట్టే ప్రసంగం చేశారు.
‘కశ్మీర్ పాకిస్థాన్‌కు ముఖ్యమైన రక్త నాళం (జుగులర్ వీన్). దాన్ని కాపాడుకుంటాం. కశ్మీరీలకు వారి పోరాటంలో అండగా నిలుస్తానం’ అని మునీర్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. అంతటితో ఆగకుండా, ‘ఇస్లాంకు ప్రాణప్రద లక్ష్యమైన కల్మా ఆధారంగా మొదటి ఇస్లామిక్ రాజ్యాన్ని 1300 ఏండ్ల క్రితం మదీనాలో స్థాపిస్తే 1947లో అదే కల్మా ప్రాతిపదికగా పుట్టిన దేశం పాకిస్థాన్ ’ అంటూ అసీం మునీర్ తోటి ముస్లింలను అడ్డగోలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
ఒక పక్క దేశంలోని కీలక భూభాగాలైన బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్‌క్వా ప్రావిన్సుల్లో వేర్పాటువాదులు, జిహాదీలే రాజ్యమేలుతున్నారు. పాక్ సైన్యం పరోక్ష సాయంతో బలపడిన ముస్లిం ఉగ్రవాదులకు పూర్వం వాయువ్య సరిహద్దు రాష్ట్రంగా పిలిచే పఖ్తూన్‌క్వాలో ఈమధ్య తలొగ్గి వారితో అవమానకర రీతిలో శాంతి ఒప్పందాలు చేసుకుంది పాక్ సర్కారు. బలూచిస్థాన్‌లో తిరుగుబాటుదారుల ధాటికి సైనిక దళాలు కుదేలవుతున్నాయి. ‘విఫలరాజ్యం’ పూర్తిగా విఫలమై ముక్కచెక్కలయ్యే దశకు చేరుకుందా? అనే అనుమానం బలపడుతున్న సమయంలో జనరల్ అసీం మునీర్ రెచ్చగొట్టే ధోరణి ఫలితమే కశ్మీర్లో పహల్గాం ఊచకోత. 2019 నాటి ఫుల్వామా మారణకాండ తర్వాత భారత సేనలు పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిక్షిణ శిబిరాలను ధ్వంసం చేసినా పాకిస్తాన్ సైనికరాజకీయ పాలక ముఠాకు బుద్ధి రాలేదు. బాలాకోట్ దాడుల నుంచి ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదు. ఈ ఆరేళ్లలో అన్ని విధాలా చిక్కిపోయిన పాకిస్తాన్‌కు తన పాలకుల బాధ్యతారాహిత్యం, మితిమీరిన పొగరు పెద్ద శాపాలయ్యాయి. ముందు ఇంటిని బాగుచేసుకోవాల్సిన పాలకులు దేశ అంతర్గత సంక్షోభాల నుంచి జనం దృష్టి మళ్లించడానికి పాత ఫార్ములానే ఎంచుకోవడం దాదాపు పాతిక కోట్ల పాకిస్థానీయుల దురదృష్టం. 1971 యుద్ధం తర్వాత నుంచి ఇప్పటి వరకూ ఇండియా అన్ని రంగాల్లో ఎనలేని విజయాలు సాధించింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నాలుగో స్థానానికి చాలా దగ్గర్లో ఉంది. ఏ రకంగా చూసిన భారత్‌తో పోటీపడడానికి ఎక్కడా అవకాశం పాక్‌కు లేదు. అందుకే మతతత్వం, ఉగ్రవాదంతో మిళితమైన కశ్మీర్ వివాదం అనే పాత ఆయుధమే పాక్ పాలకులకు దిక్కయింది.
1991 ఆర్థిక సంస్కరణలు, అప్పటి నుంచీ రాజకీయ సుస్థిరత కారణంగా భారతదేశం బలోపేతమైంది. ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగింది. అయినా 1999 వేసవిలో మంచు కొండల్లో కార్గిల్ ఘర్షణలకు పాక్ తెరతీసి దాదాపు మూడు నెలల పోరులో చతికిల పడింది. అయినా పాక్ పాలకులకు, సైనిక నేతలకు బుద్ధి రాలేదు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ తమతో పూర్తిస్థాయి యుద్ధానికి తలపడే సాహసం చేయదనే పిచ్చి ధీమాతో గత కొన్నేండ్లుగా కశ్మీర్ కల్లోలానికి పాక్ సర్కారు, ఆర్మీ విపరీతంగా ప్రయత్నించింది. ఫలితంగా యుద్ధం మొదలైంది. అర్థబలం లేకున్నా తన వద్ద ఉన్న అణ్యాయుధాలను బూచిగా చూపించి, కశ్మీర్‌ను రక్తంసిక్తం చేసే వ్యూహం ఎల్లకాలం పనిచేస్తుందనే పాకిస్థాన్ కాలం చెల్లిన వ్యూహాన్ని భారత సైన్యం పటాపంచలు చేసింది. ప్రస్తుత పాక్ పీపుల్స్ పార్టీ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్లో జర్దారీ తాత, దేశ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో 1965 యుద్ధ సమయంలోనే ‘ఇండియాతో వెయ్యి సంవత్సరాల యుద్ధాన్ని పాకిస్థాన్ చేస్తుంది’ అని అంతర్జాతీయ వేదికపై ప్రకటించారు. 1971లో తన సిద్ధాంతాన్ని మరింత విస్తరించి, భారతదేశం వెయ్యి తెగిన గాయాలతో రక్తమోడే విధంగా ఒక ఫార్ములా రూపిందించినట్టు సైనిక బలాన్ని నమ్ముకున్న భుట్టో చెప్పారు. చిరికి ఈ ఆరు దశాబ్దాల్లో తీవ్ర గాయాలతో మంచాన పడింది పాకిస్థానేగాని ఇండియా కాదు. ఆఖరికి తాను నమ్ముకుని ఆర్మీ చీఫ్‌ను చేసిన జనరల్ జియా సర్కారు కుట్రతో దిక్కులేని చావుతో చరిత్రహీనుడయ్యాడు భుట్టో. మతాన్ని, మార్షల్ లా లేదా సైనిక బలాన్ని మాత్రమే నమ్ముకున్న ఏ పాక్ ప్రభుత్వానికైనా భుట్టోకు పట్టిన గతి తప్పదు.
ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ తమతో పూర్తిస్థాయి యుద్ధానికి తలపడే సాహసం చేయదనే పిచ్చి ధీమాతో గత కొన్నేండ్లుగా కశ్మీర్ కల్లోలానికి పాక్ సర్కారు, ఆర్మీ విపరీతంగా ప్రయత్నించాయి. ఫలితంగా యుద్ధం మొదలైంది. అర్థబలం లేకున్నా తన వద్ద ఉన్న అణ్యాయుధాలను బూచిగా చూపించి, కశ్మీర్‌ను రక్తంసిక్తం చేసే వ్యూహం ఎల్లకాలం పనిచేస్తుందనే పాకిస్థాన్ కాలం చెల్లిన వ్యూహాన్ని భారత సైన్యం పటాపంచలు చేసింది.