మోదీ తన ఏడేండ్ల పాలనలో సాధించిందేమీ లేదు. వాగ్దాన భంగాలు సరేసరి, నిష్క్రియాపరత్వమే విధానంగా మారిపోయింది. నాటి వృద్ధ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి నేటి వృద్ధ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎన్నో సారూప్యతలున్నాయి. ఆశ్రిత పక్షపాతం, అవినీతిలో అగ్రస్థానమే. మోదీ ప్రభుత్వ ప్రత్యేకత ఏమంటే.. జాతీయత, దేశభక్తి పేరుతో దేశ సార్వభౌమ త్వానికే భంగకరంగా ప్రభుత్వరంగ ఆస్తులను ప్రైవేటుపరం చేయటం.
నాటి కాంగ్రెస్ పాలనను అన్నింటా విఫలమైనదని విమర్శిస్తూ.. సమర్థ, స్వచ్ఛ, అవినీతిరహిత పాలన అందిస్తామంటూ బీజేపీ ముందుకొచ్చింది. ఆ క్రమంలో ఏటా 2.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న 75 లక్షల కోట్ల నల్లధనం తిరిగి తెస్తామని, ప్రతి ఖాతాలో 15 లక్షలు ప్రజలకు జమజేస్తామని మోదీ చెప్పుకొచ్చారు. అవన్నీ ప్రచార ఆర్భాటాలేనని తేలిపోయింది. ప్రజల ఖాతాల్లోకి దమ్మిడి కూడా రాలేదు. ‘స్వచ్ఛ భారత్’ పేరుతో ప్రచార హోరే కానీ పేరుకుపోయిన చెత్త అలాగే మిగిలిపోయింది. ‘స్వచ్ఛ భారత్ సెస్’ పేరుతో ఏటా రూ.5 వేల కోట్లు జనాల చేతి చమురు వదులుతున్నది. అంబానీ, అదానీల ఆస్తులు నాలుగు రెట్లు పెరిగాయి. అణగారినవర్గాల ఆస్తి ఇసుమంతైనా పెరగలేదు, పై పెచ్చు 25 కోట్లమంది కొత్తగా పేదరికంలోకి జారిపోయారు. కానీ మోదీకి మాత్రం సూట్లు మార్చడం, ఎక్కే విమానం దిగే విమానంలా ఈ కాలం గడిచిపోయింది.
గంగా నది ప్రక్షాళన అంటూ రంగుల సినిమాను చూపించిన మోదీ అనుచర వర్గం పడకేసిన ప్రక్షాళన గురించి ఇప్పుడేమంటారు? కరోనా విలయంలో గంగానదిలో తేలిన అభాగ్యుల శవాలకు జవాబు చెప్పగలరా? మోదీ ఏడేండ్ల పాలనలో నిరర్థక ఆస్తుల నెపంతో లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కాలంలో ప్రజల కోసం లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయలేకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అట్టహాసంగా ప్రారంభమైన ‘మేక్ ఇన్ ఇండియా’ ఊసే లేదు. దేశం దాటిన నీరవ్ మోదీలు, విజయ్ మాల్యాలు దర్జాగా విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు. దేశంలో మూలమూలన అడుగడుగునా అత్యాచార బాధితుల ఆక్రందనలు వినిపిస్తున్నాయి. గో మాతను రక్షించాలంటూ గగ్గోలు పెడుతున్న నోర్లు చితికిపోతున్న చిన్నారుల హక్కుల కోసం పెకలడం లేదు. గ్యాస్ గ్రిడ్ కథ కంచికి చేరింది. ముఖ్యమంత్రులను ప్రధానమంత్రితో సమాన భాగస్వాములను చేస్తూ ‘టీం ఇండియా’ను నిర్మిస్తామన్న వాగ్దానం గాలిమాటే అయ్యింది. సీల్డ్ కవర్ రాజకీయాలంటూ కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోసిన బీజేపీ అసోంలో పార్టీని గెలిపించినవారిని కాదని మరొకరిని సింహాసనం మీద కూర్చోబెట్టడం ద్వారా, ఉత్తరాఖండ్‌లో, కర్ణాటకలో ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా తమది కూడా సీల్డ్ కవర్ పాలనే అని నిరూపించుకున్నది.
అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల కూల్చివేత; గోవా, మిజోరంలలో బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటు, పుదుచ్చేరి, ఢిల్లీ రాష్ర్టాల్లో గవర్నర్ గిరీతో పెత్తనం, ఏపీ, కర్నాటక, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో విపక్షనేతల ఇండ్లు, కార్యాలయాలపై సీబీఐ, ఆదాయపన్ను, ఈడీ సంస్థలతో దాడులు సమాఖ్యస్ఫూర్తికి గొడ్డలిపెట్టు, ఆధిపత్యానికి చిహ్నం కాదా? ఓడిపోయినా మాదే గెలుపన్నట్లు బెంగాల్లో సీబీఐ అరెస్టులు కక్షసాధింపు కాదా? పెద్దనోట్ల రద్దుతో కశ్మీర్లో రాళ్లు రువ్వడం ఆగిందన్నారు, నేడు గుండ్ల వర్షం కురుస్తున్నది నిజం కాదా? అయినా దేశం సురక్షిత చేతుల్లో ఉన్నదంటూ ప్రకటించడం ఎవరిని నమ్మించడానికి?
ప్రభుత్వరంగ సంస్థల్లో 90 శాతం ఎఫ్‌డీఐల మీద ఇన్నాళ్లూ స్వదేశీ ఉద్యమాలను ముందుండి నడిపించిన స్వదేశీ జాగరణ్ మంచ్ స్పందన ఏమిటి? ప్రపంచ సంతోషకర దేశాల సూచిలో దేశం ఏటా కిందకు పడిపోతూ 156 దేశాల్లో 140వ స్థానంలో నిలవడం దేనికి చిహ్నం? మాట్లాడితే 60 ఏండ్ల అరాచకం అంటారే తప్ప, 12 ఏండ్ల బీజేపీ పాలన గురించి ఎందుకు ప్రశ్నించుకోరు?
ప్రభుత్వ బ్యాంకులు లక్షల కోట్లు నష్టాలు ప్రకటిస్తుంటే, మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు లాభాలు ప్రకటించడం దేనికి చిహ్నం. ఇద్దరు రిజర్వు బ్యాంకు గవర్నర్లు రాజీనామా చేయడం ఆర్థికవ్యవస్థలోని ఒడిదుడుకులను చెప్పకనే చెప్పటం లేదా? నోట్ల రద్దుతో నష్టాల బారినపడ్డ చిన్న, మధ్యతరగతి, సూక్ష్మ పరిశ్రమలకు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు, ఆదాయాల్లో క్షీణత పొందిన వ్యాపారులకు జవాబుదారీ ఎవరు? ప్రపంచవ్యాప్తంగా 2014 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతుంటే దేశంలో మాత్రం 200 నుంచి 400 శాతం వరకు ఎక్సైజ్ సుంకం పేరుతో ధరలు పెంచటం ప్రజానుకూల ప్రభుత్వాలు చేసే పనేనా?
చివరికి.. వారి విద్యార్హత, వారు చెప్పిన సర్జికల్ స్ట్రైక్‌లు, ఖరీదైన రాఫెల్ ఒప్పంద వివరాలు, పీఎం కేర్ ఫండ్ జమలు, ఖర్చులు, చివరికి కొవిడ్ బాధితుల సంఖ్య, మరణాల వివరాలు కూడా గోప్యం! ఇంతకూ మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా లేక రాచరిక పాలనలోనా ప్రజాస్వామ్యంలో ఏకవ్యక్తి నిర్ణయాలు భవిష్యత్తుపై భయాందోళనలు కలిగిస్తున్నవి. దేశ ప్రజల సంక్షేమం, భద్రత కోసం మరో సమర్థ నాయకులే పూచీగా కనిపిస్తున్నది. ఆ రోజులు ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
గడిచిన రెండేండ్లలో నిరుపేదల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మధ్యతరగతి సంఖ్య తగ్గిపోయింది. రాబోయే ఆర్థిక మాంద్యానికి ఇవి ప్రమాద ఘంటికలు కాదా? మోదీ ఏడేండ్ల పాలనలో ప్రభుత్వరంగ సంస్థల వేలం పాటలే తప్ప కొత్తగా నెలకొల్పింది ఒకటి కూడా లేదు. నిరుద్యోగం 6.5 శాతంతో 40ఏండ్ల గరిష్టానికి చేరటానికి కారకులెవరు? మోదీ పాలనలో మాటలే తప్ప, ఆచరణ సాఫల్యాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు.‘మోదీ.. రిజైన్’ అన్న హాష్టాగ్కు ఒక్కరోజులో వచ్చిన ‘లైక్’లే మసకబారుతున్న మోదీ విశ్వసనీయతకు అద్దం పడుతున్నవి.
(వ్యాసకర్త: న్యాయవాది, సామాజిక విశ్లేషకులు)
– చందుపట్ల రమణకుమార్ రెడ్డి
94404 49392