2014 మే నెల దేశమంతటా ఒక కొత్త ఉత్సాహం, ఒక తెలియని ఆశ. ‘అచ్ఛే దిన్ ఆనే వాలే హై’ (మంచి రోజులు రాబోతున్నాయి) అనే నినాదం గల్లీగల్లీలో మార్మోగింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టినప్పుడు, సామాన్యుడు తన కష్టాలన్నీ తీరిపోతాయని, భవిష్యత్తు బంగారం అవుతుందని కలలుగన్నాడు.కేంద్రంలో మూడవ ఇన్నింగ్స్ నడుస్తున్న వేళ గుండెల మీద చేయి వేసుకుని ఒక నిజాన్ని మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ మంచి రోజులు నిజంగా సామాన్యుడి ముంగిట నిలిచాయా? లేదా నినాదాల హోరులో నిజాలు సమాధి అయ్యాయా? ప్రభుత్వ ప్రకటనలు చూస్తుంటే భారతదేశం వెలిగిపోతున్నట్లు కనిపిస్తున్నది.
ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియా విప్లవం, మేక్ ఇన్ ఇండియా గర్జన హోర్డింగ్‌ల మీద అక్షరాలు మెరుస్తుంటాయి. కానీ, ఆ రంగుల వెనుక ఉన్న చేదునిజాలను తడిమితే సామాన్యుడి గుండె బరువెక్కుతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో సమర్పించిన లెక్కలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఒక దేశంగా మనం ఎంత గర్వంగా తలెత్తుకుంటున్నామో, అదే స్థాయిలో అప్పుల భారంతో తల దించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.
2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం, దేశ జాతీయ రుణం అక్షరాలా రూ.235.4 లక్షల కోట్లు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి మన అప్పు కేవలం రూ.54.9 లక్షల కోట్లు మాత్రమే. అంటే, కేవలం పదేండ్ల కాలంలో దేశం చేసిన అప్పు 4.3 రెట్లు పెరిగింది. ప్రతి భారతీయుడిపై సగటున రూ.1.66 లక్షల అప్పు ఉన్నది. జీడీపీలో అప్పు నిష్పత్తి 67% నుంచి 83.9%కి చేరుకున్నది. ఇది కేవలం అంకె కాదు, రాబోయే తరాల భవిష్యత్తుపై రాస్తున్న మరణశాసనం.
భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని పాలకులు గర్వంగా చెప్తుంటారు. 3.73 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో మనం ఆ స్థానంలో ఉన్నమాట నిజమే. కానీ, ఇందులో ఒక పెద్ద మాయ ఉన్నది. ఒక దేశం ఎంత ధనవంతమైనదో చెప్పాల్సింది దాని మొత్తం ఆదాయం కాదు, ఆ దేశ పౌరుడి తలసరి ఆదాయం. దేశ ఆర్థిక శక్తిని తలసరి ఆదాయపరంగా విశ్లేషిస్తే విస్తుపోయే వాస్తవాలు కనిపిస్తాయి. ప్రస్తుతం అమెరికా తన పౌరుడికి సగటున ఏడాదికి 83,000 డాలర్ల ఆదాయాన్ని అందిస్తుండగా, జర్మనీ 54,000, జపాన్ 35,000 డాలర్ల ఆదాయంతో తమ పౌరుల జీవన ప్రమాణాలను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి. వీటన్నింటితో పోలిస్తే మన దేశ తలసరి ఆదాయం కేవలం 2,730 డాలర్లు మాత్రమే. అంటే, ఆదాయ పంపిణీలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామని, సంపద కేవలం పైస్థాయిలోనే కేంద్రీకృతమై సామాన్యుడి వరకు ఆశించిన స్థాయిలో చేరటం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒక్క అమెరికన్ సంపాదన మన దేశంలోని 30 మంది పౌరుల మొత్తం ఆదాయంతో సమానం. జనాభాపరంగా మనం పెద్ద దేశం కాబట్టి జీడీపీ పెద్దదిగా కనిపిస్తుంది. కానీ పౌరుడి జీవన ప్రమాణాల విషయానికి వస్తే ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం మనం ప్రపంచంలో 136వ స్థానంలో ఉన్నాం. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం, దేశంలోని కేవలం 1% ధనవంతుల చేతుల్లోనే 40.1% సంపద కేంద్రీకృతమై ఉన్నది. అంటే, వృద్ధి జరుగుతున్నది కానీ అది కేవలం కొందరి మేడలకే పరిమితమవుతున్నది.
2014 ఎన్నికల సమయంలో రూపాయి విలువ పడిపోతుంటే అప్పటి పాలకవర్గాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.60. ఇప్పుడు అది రూ.94 దాటిపోయింది. పదేండ్లలో రూపాయి విలువ 40% పైగా కుప్పకూలింది. రూపాయి బలహీనపడటం అంటే మనం విదేశాల నుంచి కొనే పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు పెరగటం. ఈ భారం నేరుగా సామాన్యుడి వంటగదిపై పడుతున్నది. ‘రూపాయి మజబూత్” (బలమైన రూపాయి) అనే నినాదం ఇప్పుడు కేవలం జ్ఞాపకం మాత్రమే.
దేశానికి వెన్నెముక వంటి యువత ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నది. 2017-18లోనే నిరుద్యోగ రేటు 6.1%గా నమోదైంది, ఇది 45 ఏండ్ల గరిష్టం. 2024 నాటికి యువతలో (15-24 ఏండ్లు) నిరుద్యోగం 16% నుంచి 45% మధ్య ఊగిసలాడుతున్నది. ప్రతి ఏటా కోటిన్నర మంది ఉద్యోగ మార్కెట్లోకి వస్తుంటే, ప్రభుత్వం సృష్టిస్తున్న అవకాశాలు కేవలం కొన్ని లక్షలు మాత్రమే.
ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పి చేపట్టిన నోట్ల రద్దు దేశాన్ని కుదిపేసింది. నోట్ల రద్దు (2016) నల్లధనం అంతం అవుతుందని చెప్పారు. కానీ, 99.3% నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చేశాయి. అంటే నల్లధనం ఎక్కడికి పోయింది? వెనకబడిన వర్గాలు, చిన్న వ్యాపారులు చితికిపోయారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్యుడికి కష్టం తప్ప, లక్ష్యాలు నెరవేరలేదు. జీఎస్టీ అమలు ఒక దేశం ఒక పన్ను అనేది వినటానికి బాగున్నా, దాని సంక్లిష్టమైన స్లాబ్‌లు (5%, 12%, 18%, 28%) చిన్న వ్యాపారులకు శాపంగా మారాయి. కోట్లాది చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య ఆదాయ పంపిణీ గొడవలు నిత్యకృత్యమయ్యాయి.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచిక)లో మనం 105వ స్థానంలో ఉన్నాం. పొరుగున ఉన్న పాకిస్థాన్ (102) కంటే మనం వెనుకబడి ఉన్నామంటే అది మన వ్యవస్థకు అవమానం కాదా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో 134వ స్థానంలో మన విద్య ఉన్నది. ఆరోగ్య పరిస్థితులకు అద్దం పడుతున్నది. రోజుకు కేవలం రూ.126 ఆదాయంతో బతుకులీడుస్తున్న గ్రామీణ భారతీయుడికి విశ్వగురు అనే మాట ఒక వెటకారంగా వినిపిస్తుంటే తప్పెవరిది?
అభివృద్ధి అంటే కేవలం గణాంకాల గారడీ కాదు. అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాలు, మెరిసే విమానాశ్రయాలు మాత్రమే కాదు. ఆఖరి వరుసలో ఉన్న వ్యక్తికి పట్టెడన్నం, చేతినిండా పని, భవిష్యత్తుపై భరోసా లభించినప్పుడే అది నిజమైన వికాసం. ‘అచ్ఛే దిన్” అనేది కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోకూడదు. పాలకులను ప్రశ్నించటం ప్రజాస్వామ్యంలో పౌరుడి బాధ్యత. ప్రచార ఆర్భాటాల పొరలను తొలగించి చూస్తే, సామాన్య భారతీయుడు ఇంకా సవాళ్ల సుడిగుండంలోనే ఉన్నాడని అర్థమవుతున్నది.
– సూర్యదేవర రామకృష్ణ