గత లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ అప్రతిహత ప్రస్థానాన్ని నిలువరించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన కలగూర గంపలాంటి ఇండియా కూటమి ఆశలుడిగిపోయి అవసాన దశకు చేరుకున్నది. కూటమి మిత్ర పక్షాలు కాంగ్రెస్‌ను మోయరాని భారంగా భావిస్తుండటమే అందుకు కారణమని చెప్పాలి. ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో విభేదాలు తీవ్రమయ్యాయి. లోక్‌సభ ఎన్నికలు మరో నాలుగేండ్ల తర్వాత కానీ జరగవు. అంతవరకు కాంగ్రెస్‌తో ‘సహజీవన భారాన్ని’ మోసే ఓపిక మిత్ర పక్షాలకు నశిస్తున్నది. దాంతో క్రమక్రమంగా ఒక్కరొక్కరు కాంగ్రెస్ నుంచి దూరమవుతున్నారు. ముందుగా ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. ఇండియా కూటమి మిత్రపక్షాలైన టీఎంసీ, ఎస్పీ ఆప్‌కు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌పై అనూహ్య రీతిలో చేసిన విమర్శలే ఈ చీలికకు దారితీశాయి. ఫలితంగా కాంగ్రెస్ ఒంటరైంది.
ఇక మహారాష్ట్రలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండియా కూటమి లేదా స్థానిక రూపమైన మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) ఉమ్మడి పోటీ అనేది జరగబోదని తేటతెల్లమైంది. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సహా పట్టణ సంస్థలకు, జిల్లా పరిషత్‌లకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన (ఉద్ధవ్) ప్రకటించింది. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేయడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బ. మిత్రపక్షాల మద్దతుతో అంతోఇంతో లబ్ధి పొందుదామనుకుంటున్న కాంగ్రెస్‌కు మరీ పెద్ద దెబ్బ. అతిపురాతన పార్టీ ఏకాకితనం స్వయంకృతమేనని చెప్పక తప్పదు. తనకు లేని బలాన్ని ఊహించుకుని అధిక సీట్లు రాబట్టుకోవడం, గెలవలేక చతికిల బడటం వంటివి ఇందుకు దారితీశాయి. రాహుల్ పరిపక్వ శైలి దీనికి ఆజ్యం పోసింది.
ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమి జాతీయ ఎన్నికలకు మాత్రమే పరిమితమని మహారాష్ట్ర రాజకీయ కురువృద్ధుడైన శరద్ పవార్ ప్రకటించడం కీలక పరిణామం. ఆచరణాత్మకంగా చూస్తే ఇండియా కూటమి కథ ముగింపునకు వచ్చినట్టేనని అవి సూచిస్తున్నాయి. పరస్పర విరుద్ధమైన భావజాలాలున్న పార్టీలు కేవలం బీజేపీ వ్యతిరేకత అనే ఏకసూత్ర కార్యక్రమం మీదే కూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అవసరమైన సందర్భాల్లో రాజీ పడటం, అన్ని పార్టీలను ఏకతాటిపై నడపడం వంటి కూటమి ధర్మాలను పాటించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందనేది విస్పష్టం. పైగా ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో హామీల అమలు అనేది హాస్యాస్పదంగా తయారై తీవ్రమైన ప్రజాగ్రహానికి గురవుతున్నది. హామీల డొల్లతనం మీదే బీజేపీ తన అస్ర్తాలను సంధించడం మహారాష్ట్రలో కూటమికి ప్రతికూలంగా పనిచేయడం తెలిసిందే. ఇవన్నీ వెరసి కూటమిని లోపల నుంచి కూల్చివేస్తున్నాయి. ఎవరికి వారే కావడంతో కూటమి కథ దాదాపుగా ముగిసిపోయింది.